
ఇంటర్నెట్‌కు మగువలు దూరం!
‘గూగుల్’ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్... ఇప్పుడు అందరికీ సుపరిచితమైన పదం. యువతకైతే నెట్ లేనిదే కాలం గడవదు. ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో ఇంటర్నెట్ తప్పనిసరి అవసరంగా మారింది. ప్రపంచాన్ని కళ్లముందు చూపించే నెట్‌కు లభిస్తున్న ఆదరణ అంతాఇంతా కాదు. అయితే, భారత్‌లో మాత్రం ఇంటర్నెట్‌ను ఉపయోగించే మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. దేశంలో 49 శాతం మంది మహిళలు అంతర్జాలానికి దూరంగానే ఉంటున్నారు. ప్రఖ్యాత ఇంటర్నెట్ సేవల సంస్థ ‘గూగుల్’ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘ఉమెన్ అండ్ టెక్నాలజీ’ పేరిట నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా 8 నుంచి 55 ఏళ్ల వయస్సున్న 828 మంది మహిళలను ప్రశ్నించారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
*కనెక్షన్ పొందే వీలు లేకపోవడం, నెట్ ఖర్చును భరించలేకపోవడం, సమయం చిక్కకపోవడం వంటి కారణాలతో మహిళలు ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.
*ఇంటి పనులతో ఆలసిపోతున్న మగువలు ఖాళీ దొరికినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాలంపై ఆసక్తి చూపడం లేదు.
*ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడిపితే అత్తామామలు ఆగ్రహిస్తారనే భయంతో చాలామంది దీని జోలికి వెళ్లడం లేదు.
*ఇంటర్నెట్‌తో అనుసంధానం కావడానికి తగిన స్వేచ్ఛ కావాలని మహిళలు కోరుకుంటున్నారు.
*నెట్‌ను ఉపయోగించే, ఉపయోగించని మహిళల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నారు. ఇంటర్నెట్‌ను వాడుకొనే వారు ఆర్థికంగా ముందంజలో ఉంటున్నారు.