వాస్క్యులర్ కౌన్సెలింగ్
నా వయసు 38 ఏళ్లు. గత 15 ఏళ్లుగా సెక్యూరిటీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాను. మొదట్లో సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సూపర్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే డ్యూటీలో భాగంగా ఎక్కువసేపు నిలబడే ఉంటాను. నాకు ఇటీవల కాళ్లలో వాపు వస్తోంది. అలాగే పిక్కలు కూడా పట్టేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్లు ఇబ్బందిపడుతున్నాను. బాధ భరించలేనప్పుడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను. రోజురోజుకూ సమస్య పెరుగుతోంది. ఇలాంటి సమస్య గతంలో నాకెన్నడూ లేదు. అసలు నాకు ఏమైంది. దయచేసి సలహా ఇవ్వండి.
- రాజు, వైజాగ్
మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు వేరికోస్ వెయిన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఈ సమస్య సాధారణంగా ఎక్కువ సేపు నిల్చుని ఉండేవారిలో, అధిక బరువులు మోసేవారిలో ఎక్కువగా ఉంటుంది. వీరికి మొదట్లో కాళ్లలో వాపు రావడం, మంట పుట్టడం, పిక్కలు పట్టేయడం చోటు చేసుకుంటాయి. అనంతరం వీరు నడక అంటేనే బెదిరిపోయేలా సమస్య మరీ తీవ్రమవుతుంది. వ్యాధి దశను బట్టి పూర్తి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్ నిర్ధారణ చేస్తే, మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్స విధానాలతో మీ సమస్యను పూర్తిగా ఉపశమనం కలిగేలా చేయవచ్చు. మొదటి దశ, రెండోదశలో వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి సర్జరీ అవసరం ఉండదు. కేవలం డాక్టర్ సూచించిన మేరకు మందులు వాడుతూ వారు అందించే సలహాలను పాటిస్తూ మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకుంటే వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. మెరుగైన ఫలితాల కోసం సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. సమస్య నుంచి తాత్కాలికంగా రిలీఫ్ దొరికిన చాలామంది మందులు మానివేయడం లేదా కోర్స్ పూర్తయిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించకుండా ఉండటం లాంటివి చేస్తుంటారు.
దీనివల్ల వ్యాధి మరింత ముదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇక మూడు లేదా నాలుగో దశలో వ్యాధి ఉంటే మాత్రం వాస్క్యులర్, శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. వేరికోస్ వెయిన్స్‌కు మంచి చికిత్స అందుబాటులో ఉంది. కాబట్టి మీరు వెంటనే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులను సంప్రదించి, మీ సమస్యకు కారణాన్ని తెలుసుకోండి. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే చికిత్స ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలను సులువుగా పొందవచ్చు.
- డా॥దేవేందర్ సింగ్
సీనియర్ వాస్క్యులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
పిక్కలు నొప్పిగా ఉన్నాయి.. సమస్య ఏమిటి?
Published Mon, Sep 19 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
Advertisement