తూర్పున వంటగది, ఈశాన్యాన పూజగది ఉండాలనీ... వాయువ్యాన వంట చేయకూడదనీ... ఇలా ఎన్నో వాస్తు శాస్త్ర విషయాలు సామాన్యులకు కూడా తెలుసు. అయితే, అలా ఎందుకు ఉండాలి, లేకపోతే నష్టం ఏమిటి.. అని అడిగితే చెప్పగలిగేవారు అరుదు. అలాగే సింహద్వారానికి ఎదురుగా రోడ్డు ఉంటే వీధిశూల అని ఆ ఇంటిలో ఉండటానికి ఇష్టపడరు ఎవరూ. కొందరికి తూర్పు సింహద్వారం గల ఇల్లు కలిసొస్తే, మరికొందరికి పడమర అస్సలు పనికిరాదు.
కొందరికి ఉత్తర ద్వారం గల ఇంటిలో చేరినప్పటినుంచి వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కొందరు తాము ఉన్న ఇల్లు బొత్తిగా అచ్చుబాటు కాలేదని వాపోతుంటే, ఇంకొందరు షాపు యజమాని తమని ఖాళీ చేయమన్నా చేయకుండా మొండికి పడుతుంటారు. అదేమంటే, ఆ దుకాణాన్ని లీజుకు తీసుకున్నప్పటి నుంచి తమకు బాగా కలిసొచ్చిందనీ, ఇప్పుడు ఖాళీ చేయాలంటే కష్టంగా ఉందని కంట తడి పెడతారు.
నిజంగా వాస్తుకు ఇంత ప్రాముఖ్యత ఉందా? తాము పడుతున్న కష్టాలన్నింటికీ కారణం తాతల కాలం నుంచి ఉంటున్న ఇల్లే కారణమా... ఇటువంటి సందేహాలన్నింటికీ సమాధానమా అన్నట్లు హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు, భాగ్యరేఖ, భాగ్యరాశి, గోపాల్ సాముద్రికం వంటి పరిశోధనాత్మక గ్రంథాల రచయిత రాసిన ‘గృహవాస్తు’ పుస్తకం చదివితే, వాస్తు శాస్త్ర యథార్థాలపై ఒక అవగాహన ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు, అసలు వాస్తు ఎంత వరకు అవసరం అనేదానిపై శాస్త్రీయ సమాచారాన్ని ఇచ్చే ఈ గ్రంథం ప్రతి ఇంటా ఉండదగ్గది.
Comments
Please login to add a commentAdd a comment