భగవంతునికి ఎన్నో నామాలున్నాయి. ఆయన వేయి నామాల విష్ణుదేవుడు కదా! అయినా గోవిందనామం చాలా ప్రశస్తమైనది. తిరుపతి యాత్రికులు శ్రీ వేంకటేశ్వరసామిని గోవిందనామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు. గోవింద నామాంకితమైన మాలను ధరించి శ్రీ వేంకటేశ్వర వ్రతం ఆచరించే సంప్రదాయం ఏర్పడింది. ‘మాల’ అనే శబ్దానికి లక్ష్మిని కల్గించేది అని అర్థం. అంటే అశుభాలను తొలగించి సకల సంపదలను కల్గించేది మాల.
శ్రీ వ్రతమాల వేయు విధానం:
‘ఓం శ్రీ వేంకటేశ్వర పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ గోవింద పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ నారాయణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ వాసుదేవ పరబ్రహ్మణే నమః’
ముడుపు: ఎవరైతే దీక్షాధారణ చేయదలచారో వారు స్వామికి ముడుపు కట్టి దీక్షను ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ దేవదేవుడు కాపాడగలడు.
కావలసిన వస్తువులు: అరచేయి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రము 1 మీటరు, 7 రూపాయి బిళ్లలు + 7 పావలా బిళ్లలు. ఇప్పుడు పావలా బిళ్లలు దొరకవు కాబట్టి, చిల్లర పైసలు ఏవి దొరికితే అవే. తెల్లని వస్త్రమైతే దానికి పసుపు అద్ది, ఆరబెట్టి బాగా ఆరిన తరువాత దీక్షకు కూర్చొని, మొదట మాలను కింద చెప్పిన విధంగా శుభ్రపరచుకొని ధూప దీప పూజా కార్యక్రమాలొనర్చి సిద్ధపరచుకోవాలి. తరువాత పసుపు వస్త్రాన్ని తీసుకొని ఎడమ అరచేతిలో ఉంచుకొని, అందులో రూపాయి పావలా ఉంచి స్వామి సకలాభీష్టసిద్ధి మంత్రాన్ని జపిస్తూ ఒక ముడి వేయాలి. అలాగే కొంత స్థలమిచ్చి రెండో ముడి వేయాలి. ఈ రెండవ ముడి వేసేటప్పడు ఇదివరకువేసిన ముడిని దాటించి వేయరాదు. ఖాళీగా వున్న వస్త్రాన్నే తిప్పుతూ ముడివేయాలి. ముడుపు కట్టే సమయంలో ఎవ్వరితోను మాట్లాడరాదు. స్వామి అభీష్ట సిద్ధిమంత్రాన్ని జపిస్తూ ఏడు ముడుపులు కట్టాలి. ఈ ముడుపు కార్యక్రమం అయిన తర్వాత పూజ కావించి మాలధారణ చేయవలెను.
మాలను ఇలా పవిత్రం చేయాలి
ఆవు పంచితం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, గంధం, నీళ్లు– వీటితో మాలను అభిషేకం చేసి, కర్పూర నీరాజనం çసమర్పించి, గోవింద నామాన్ని 108 పర్యాయాలు జపిస్తూ ధరించాలి.
వ్రత నియమం
♦ వైకుంఠ ఏకాదశికి 7 వారాలు, 6 వారాలు, 5 వారాలు, 4 వారాలు, 7 రోజులు ముందుగా గాని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు
♦ మాలను తులసి పూసలతో గాని తామర పూసలతో గాని, పటిక పూసలతో గాని పవిత్రం చేసి శ్రీవేంకటేశ్వరస్వామికి తమ శక్త్యనుసారం పూజ కావించి ధరించాలి
♦ స్త్రీలు అయితే 7 రోజుల వ్రతాన్ని ఆచరించవచ్చు
♦ వైకుంఠ ఏకాదశి ముందురోజు ఉదయం 9–30 గంటలకు తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంవద్ద ’యాగపూజ –కంకణ ధారణ జరుగుతుంది. భక్తులు విధిగా హాజరుకావాలి. భక్తులు యాగానికి కావలసిన 7 రకముల సమిధలు 500 గ్రా. ఆవు నెయ్యి తీసుకు రావాలి
♦ శ్రీస్వామివారికి ముఖ్యమయిన పసుపు వస్త్రాలను విధిగా ధరించాలి. నుదుట తిరునామాలు పెట్టుకోవాలి
♦ వ్రతకాలంలో ధూమం మద్యం, మత్తుపదార్థాలు, మాంసాహారం సేవించరాదు. దాంపత్యానికి దూరంగా ఉండాలి. సాత్వికాహారం ఉత్తమం
♦ ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం స్నాన కార్యక్రమం ముగించుకొని శ్రీ స్వామి వారి గోవిందనామము ధ్యానించాలి. వీలైతే రోజుకు 1008 సార్లు ‘ఓం నమోవేంకటేశాయ’ అనే సకలాభీష్ట సిద్ధిమంత్రాన్ని జపించాలి. భజనలో పాల్గొనాలి
♦ ఎదుటి వారిని తనమాటల చేతకాని, చేతలచేతగాని బాధింపరాదు
♦ దీక్షాకాలంలో ఇతరులను ‘గోవిందా’ అని పిలవాలి
♦ ఉపవాస కార్యక్రమాన్ని తూ.చ. తప్పక భక్తిగా, నిష్ఠగా పాటించాలి. ఈ వ్రతాన్ని అన్ని వర్ణాలవారు ఆచరించవచ్చు. ఆచరించినవారు స్వామివారి కృపా కటాక్షం వలన తలచిన కోర్కెలు నెరవేర్చుకొని సకల సుఖాలు పొందవచ్చు.
శ్రీవారి హుండీ ముడుపు
పచ్చకర్పూరం 50 గ్రా.; జీడిపప్పు 50 గ్రా.; ఎండు ద్రాక్ష 50 గ్రా.; ఏలకులు 50 గ్రా.; మిరియాలు 50 గ్రా.; జీలకర్ర 50 గ్రా.; బియ్యం 50 గ్రా.; కర్పూరం 50 గ్రా.
ఇంటికి తెచ్చుకొనే ముడుపు
బియ్యం 100 గ్రా; టెంకాయ 1; కర్పూరం 1 ప్యాకెట్
పై పదార్థాలు రెండు విడి విడి సంచులలో వేరువేరుగా కట్టుకొని ముడుపుల మూటతో నడచి శ్రీ స్వామివారి సన్నిధి చేరాలి. ఇంటికి తెచ్చుకొను ముడుపు మూటను దగ్గరిలో వచ్చే శనివారం రోజున వారి వారి ఇంటిలో పూజ చేసుకుని ముగించుకొనవచ్చు.
– టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి)
Comments
Please login to add a commentAdd a comment