భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని 'అనంత చతుర్థి' అంటారు. ఈ రోజే వినాయక నిమజ్జనం చేస్తారు. ఆ రోజు ఆచరించే అనంతపద్మనాభస్వామి వ్రతం అత్యంత మహిమాన్వితమైనది. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీ కృష్ణడే పాండవులు సూచించాడని వ్యాసమహర్షి రచించిన మహాభారతంలో ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే దారిద్ర్యం తొలగిపోయి...విజయం, అభయం, ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణ వచనం.
అనంత వ్రతం అనగా..
మాయాజూదంలో ఓడిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాల గురించి శ్రీ కృష్ణుడు తెలుసుకుంటుండేవాడు. అలా ఓసారి పాండవుల దగ్గరకు వెళ్లిన శ్రీ కృష్ణుడితో.. ఏ వ్రతాలను ఆచరిస్తే తమకు కష్టాలు తొలగిపోతాయో వివరించమని అడిగాడు ధర్మరాజు. అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు సూచించినదే అనంత పద్మనాభస్వామి వ్రతం.
ఎవరీ అనంతడు...
అనంత పద్మనాభుడు ఎవరని అడిగిన ధర్మరాజు ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. అనంతుడు అంటే ఎవరో కాదు స్వయంగా తానే అని వివరించాడు. అనంతుడు అంటే అంతటా వ్యాపించినవాడు, కాల స్వరూపుడు అని అర్థం. అనంత విశ్వంలో అణువణువు నిండి ఉండేది తానే అని వివరించాడు కృష్ణుడు. సృష్టి, స్థితి,లయలకు కారణం అయినా కాలస్వరూపుడి రూపంలో ఉన్నది, దశావతారాలు ఎత్తేది తానే అని చెప్పాడు. అందుకే చతుర్ధశ భువనాలు నిండి ఉన్న అనంతస్వరూపం అయిన అనంతుడిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయన్నాడు.
ఏటా భాద్రపద మాసం పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యోదయానికి తిధి ఉండడం ప్రధానం కాబట్టి చతుర్దశి ఏ రోజైతే సూర్యోదయానికి ఉంటుందో ఆ రోజుని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇవాళ (సెప్టెంబరు 17, 2024) మంగళవారం ఉదయం 11 గంటలవరకూ చతుర్దశి ఉంది...అందుకే ఈ రోజే స్త్రీలు ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరించి ఆ దైవం అనుగ్రహంతో తమ కష్టాల నుంచి బయటపడతామని విశ్వసిస్తారు.
వ్రత విధానం..
ఏ పూజ తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలి..అందుకే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆరంభించే ముందు వినాయకుడిని పూజించాలి. అనంతరం నవగ్రహ పూజ ఆచరించి ఆ తర్వాత అనంతపద్మనాభుడికి షోడశోపచార పూజ చేయాలి. 14 దారాలను కలిపి ఎరుపు రంగు తోరాన్ని పూజించి..వ్రతం అనంతరం కట్టుకోవాలి. ఇలా అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని 14 ఏళ్లు ఆచరించాలని శ్రీ కృష్ణుడు వివరించాడు. శ్రీకృష్ణుడి సూచన పాండవులు ఈ వ్రతం చేసి అడగడుగున ఎదురైన కష్టాల నుంచి బయటపడటమే గాక కోల్పోయిన తమ రాజ్యాన్ని సంపదను తిరిగి దక్కించుకోగలిగారు.
కలిగే ప్రయోజనాలు..
వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు..సంపద పెరుగుతుంది.వృత్తి జీవితంలో వెంటాడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
(చదవండి: ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..)
Comments
Please login to add a commentAdd a comment