విరాట్‌స్వరూపుడు ఈ బౌన్సర్లూ ఆడాడు...!
గ్యాలరీ
గుర్తుందా మీకు?... ఆ స్నేహితురాలు స్టాండ్‌లో ఉందని మనోడు ఆడలేదన్నారు. ఆమె ఇప్పుడు స్టాండ్‌కు దూరంగా ఉందని ఆడి గెలిపిస్తున్నాడని అంటున్నారు. వీళ్ల నాలుక ఒక దూస్రా! ఒక గూగ్లీ!! ట్వీట్లతో విరాట్‌నూ, అనుష్కనూ ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటున్నారు. లేటెస్ట్‌గా అనుష్క స్టాండ్‌లో లేకపోవడం వల్లే విరాట్ విశ్వరూపం చూపించాడని, అలా ఆ మహాతల్లి ఇండియాను గెలిపించిందని ట్వీట్ల మీద ట్వీట్లు కొడుతున్నారు.
ఇదంతా చేసేది మన పెద్దలే. అందుకు మన పెద్దలను మనమే నిందిస్తే ఎలా?
ఒకసారి మన పిల్లరికం సమయంలో అల్లరిగా మనం చేసే పనులను దాచేసి, పొరుగింటి పిల్లలను దానికి బాధ్యులను చేసే మన ఇంటి పెద్దవాళ్లను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ‘మావాడు బంగారం... చేసేదంతా ఆ పోకిరీలే. పాపం... వీడికి నోట్లో నాలుక లేదు. ఒంట్లో ఓపికా లేదు. ఆ తుంటరి పనులు చేసేదంతా పోకిరీలే’’ అంటుండే ఇంటి పెద్దలను గుర్తుచేసుకోండి. మనం ఎంత వెధవ పని చేసినా వెనకేసుకొస్తారు. ఆ పనికి బాధ్యతను మరొకరికి అంటగట్టేస్తారు. మనల్ని గట్టున పడేస్తారు. ఇంకోర్ని చెట్టుక్కట్టేస్తారు. అవును... మరి! ఈ పెద్దోళ్లున్నారే... వాళ్లంతా చాలా గొప్పోళ్లు. వాళ్ల మనసులు చాలా విశాలం. సంకుచిత భావాలా? అబ్బెబ్బె... కుచ్చితం, సంకుచితం అంటే ఏమిటో వాళ్లకు తెలియనే తెలియదు. కానీ వాళ్లు చాలా గొప్పోళ్లు. మోకాలి నునుపుకూ, బట్టతల మెరుపుకూ, మన ఆటగాడి గెలుపు విరాట్స్వరూపానికీ, ఒక రోజు విశ్వరూపానికీ బాగా ముడేస్తారు. మరి మనోళ్లంతా ప్రాజ్ఞులు, విజ్ఞులు, వివేకులు. దేన్ని దేంతోనైనా ముడేస్తారు.
ఇక ఈ కామెంట్స్ చేసేవాళ్లకు ఒక తెర ఉంది. తమ ఐడెంటిటీలను మరుగుపరిచే మాంఛి బలమైన తెర ఉంది. అన్నీ రంధ్రాలతో నిండి ఉండే తడిక లాంటి ఆ తెర పేరు సోషల్ మీడియా. అందుకే ఆ తడిక మాటున దాగుండిపోయి, దాని బొక్కల్లోంచి పొరుగింటి బాగోతాలను చూసేస్తారు. ఖాఫ్ పంచాయితీలో పెద్దల్లా నరం లేని నాల్కలను పెదరాయుడి భుజం మీద కండువాల్లా రజనీ స్టైల్లో గిరగిర తిప్పేస్తారు. కామెంట్లు గుప్పేస్తారు. తీర్పులు చెప్పేస్తారు.
పాపం... సదరు ఆటగాడి ప్రతిభ కాదు... అతడి నైపుణ్యం కాదు... కృషి కాదు... పట్టుదల కాదు... ప్రాక్టిస్ కాదు. ప్రజ్ఞ కాదు. అందుకు విరాట్‌కు సలసలా కాలిపోయిందంటే కాలిపోదా మరి. ఆట బాగా ఆడాడంటే దానికి కారణం వాడి ప్రజ్ఞ కాదు. ఏకాగ్రత కాదు, వెర్రెత్తిపోయే జనాల ధోరణికి సదరు ఆటగాడు చిర్రెత్తిపోయాడంటే పోడా మరి? సదరు గెలుపునకు కారణం ఆమెకు ఇప్పుడు దూరంగా ఉండటమేనంటూ అతడి విరాట్స్వరూపాన్ని, గొప్పనూ, నైపుణ్యాలనూ మరేదో అంశంతో ముడేస్తే మండిపోదా మరి? తాము బజారుకీడుస్తున్న ఒక మహిళను వెనకేసుకొచ్చాడంటే రాడా మరి? అందుకే బహుశా ఆమె ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీతోనే కావచ్చు... మన పెద్ద మనుషులు వేస్తున్న ఈ ఒక బౌన్సర్లనూ, యార్కర్లనూ ఎదుర్కొన్నాడు. ఆ బ్యాడ్ కామెంట్ల బౌలింగ్‌ను తన ట్వీట్లతో బ్యాట్ చేశాడు. ‘షేమ్’ అంటూ బాదేశాడు. ‘ఉఫ్‌ఫ్ఫ్’మంటూ వాళ్ల కామెంట్స్‌ను తన జవాబుతో ఊదేశాడు. మొన్నాడిన ఆటకు కాదు... ఇలాంటి వుల్టాస్ ‘ఫుల్’టాస్ కామెంట్ల పనిపట్టినందుకు... ‘విరాట్... యూ ఆర్ గ్రేట్’!
- యాసీన్