![a visit to the gardener who fever fever returned - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/4/Ambedkar-Buddha.jpg.webp?itok=VZxPJLbA)
ఒకరోజు, జ్వరం వచ్చిన తోటమాలిని పరామర్శించి తిరిగి వస్తూ, ‘మృత్యువంటే అతడు భయపడుతున్నాడు’ అని తన కార్యదర్శి రత్తూతో అన్నారు అంబేడ్కర్. కానీ మృత్యువు ఆయన చెంతే ఉన్నది. 1956 డిసెంబర్ 4న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం మహారాష్ట్ర నాయకులు ఆచార్య ఆత్రే, ఎస్.ఎం.జోషీలను రిపబ్లికన్ పార్టీలో చేరవలసిందిగా ఉత్తరాలు డిక్టేట్ చేశారు. ఆ తెల్లారి జైన నాయకులు వస్తే వారితో మాట్లాడారు. అనంతరం, అలసటగా ఉండటంతో తలకు రత్తూ నూనెతో మాలిష్ చేస్తుండగా ఆ హాయిలో సోఫా మీద తాళం వేస్తూ మంద్ర స్వరంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ పాడుకున్నారు. భోజనానికి పిలుపు రావడంతో లేచి, కొద్దిగా అన్నం తిని వస్తూ తన పర్సనల్ లైబ్రరీలోని కొన్ని పుస్తకాలను పడకగదిలో పెట్టించుకున్నారు. అలాగే, బుద్ధా అండ్ దమ్మ పీఠిక, బర్మా ప్రభుత్వానికి రాసిన ఉత్తరం కూడా తెమ్మన్నారు. కబీరు గీతం పాడుతూ పడకగదికి చేరుకున్నారు. డిసెంబర్ 6వ తేదీ ఉదయం 6:30కు చూసినప్పుడు అంబేడ్కర్ నిద్రిస్తున్నారనే అనుకున్నారు భార్య సవితాదేవి. కానీ ఆయన దేహం అప్పటికే భవసాగరాన్ని దాటేసింది.
దళితులపై హిందూమతం చూపుతున్న వివక్షను ఏళ్లతరబడి సహిస్తూ వచ్చిన అంబేడ్కర్ అప్పటికి ఇరవై ఏళ్ల క్రితమే బౌద్ధం వైపు మళ్లారు. 1935లో యవ్లాలో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఆవేశపూరితంగా మాట్లాడారు. ‘దురదృష్టవశాత్తు నేను హిందూ సమాజంలో అంటరానివాడిగా పుట్టాను. పుట్టుక నా చేతిలో లేదు కాబట్టి దానికి ఇప్పుడు నేనేమీ చేయలేను. అయితే హిందువుగా మాత్రం మరణించను’ అని అన్నారు. ఆయన నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా చాలామంది దళితులు సమర్థించారు. బాంబేలోని నయీగాంలో దళితులు సమావేశమై అంబేడ్కర్‌తో పాటు మతం మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. యవ్లా సమావేశం తర్వాత ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అంబేడ్కర్‌కు ఆహ్వానాలు పంపారు. అయితే సిక్కు, బౌద్ధ మతాలే అంబేడ్కర్‌ను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఇటాలియన్ బౌద్ధ సన్యాసి రెవరెండ్ లోక్‌సుదా 1936 జూన్‌లో అంబేడ్కర్‌ను కలుసుకుని, బౌద్ధమత ప్రాశస్త్యాన్ని వివరించారు. తర్వాత కొద్ది కాలానికే అంబేడ్కర్ బౌద్ధం స్వీకరించారు. (రేపు అంబేడ్కర్ వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment