ది ఛాలెంజ్‌! | We struggled to understand the horrors of life | Sakshi
Sakshi News home page

ది ఛాలెంజ్‌!

Published Mon, Feb 27 2017 11:25 PM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM

ది ఛాలెంజ్‌! - Sakshi

ది ఛాలెంజ్‌!

ఒక్క అడుగు ముందుకు వేయాలంటేవంద మీమాంసలు వెనక్కులాగుతుంటాయి. ఒక సాహసం చేయాలంటే లక్ష భూతాలు అడ్డుపడుతుంటాయి. అలా అని... అడుగు వేయడం మానకూడదు. సాహసం చేయడం ఆపకూడదు. మరో జన్మలోకి తొంగి చూసి మన లోపాన్ని అర్థం చేసుకునేకన్నా ఈ జన్మలోనే మన భయాలను అర్థం చేసుకొని పోరాడితేనే జీవితం ఒక లక్ష్యం అవుతుంది. కష్టం ఒక ఛాలెంజ్‌ అవుతుంది.

రాత్రి పది దాటింది. శేఖర్‌కి నిద్రపట్టడం లేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. బయట అంతా చీకటి. లోపలంతా చీకటి. తనలోనూ చీకటే. ‘నన్నెవరూ అర్థం చేసుకోరు. నాకెవరూ అండగా ఉండరు. అయినా ఈ అవిటివాడిని ఎవరు ప్రేమిస్తారు? చివరకు అమ్మ కూడా అన్నయ్యవైపే. నా గురించి ఆలోచించేదైతే ఇలా నన్ను ఒంటరిని చేసి వెళుతుందా!’ దుఃఖం పొగిలి పొగిలి వస్తోంది శేఖర్‌కి. కళ్ల నిండా నీళ్లు. ‘నేనే ఎందుకు ఇలా పుట్టాను. నా కన్నా ముందు పుట్టిన అన్నయ్య బానే ఉన్నాడు. నా తర్వాత పుట్టిన చెల్లీ ఆరోగ్యంగా ఉంది. నేనే ఎందుకిలా? నాకిలా అవడానికి అమ్మే కారణమట. అన్నయ్య పుట్టాక అప్పుడే పిల్లలు వద్దనుకొని ఏవో ముందులు వాడిందట అమ్మ. ఆ మందుల వల్లే నాకీ అవిటితనం వచ్చిందట. మేనత్త  చెప్పిన మాటలు శేఖర్‌ చెవుల్లో గింగురుమంటున్నాయి. ‘పుట్టుకతోనే రెండు కాళ్లు చచ్చుపడిపోయి పుట్టాను. పాతికేళ్లు వచ్చినా ఇంకా చంటిపిల్లాడిలా పాకుతూనే ఉన్నాను. పాకుతూనే బాత్రూమ్‌కి వెళ్లాలి. పాకుతూనే పనులన్నీ చేసుకోవాలి. పాకుతూనే పదేళ్లపాటు బడికి వెళ్లాను. ఇక ఈ జీవితం అంతా ఇంతే. ఏం పనిచేయగలను? ఎలా బతకగలను? నడిచే అదృష్టం నాకు లేదా’.. ఆ ఆలోచనకు మళ్లీ దుఃఖం ఎగదన్నుకొచ్చింది. వెక్కివెక్కి ఏడుస్తూ రెండు చేతులతో ముఖం కప్పుకున్నాడు శేఖర్‌

వెలుగు నింపేవారెవ్వరు?
‘శేఖర్‌.. శేఖర్‌..’ అంటూ భుజం పట్టి ఊపేసరికి ఉలిక్కిపడి చూశాడు శేఖర్‌... ఈ టైమ్‌లో ఎవరా అని. లైట్‌ స్విచ్‌ వేస్తూ కనిపించాడు వెంకట్‌. మేనత్త కొడుకు వాడు. తన కన్నా ఏడాది చిన్న. గదిలో అప్పటి వరకు ఉన్న చీకటిని.. బల్బు తన వెలుతురుతో తరిమేసింది. ‘‘నువ్వొక్కడివే ఉన్నావని తెలిసి ఈ రాత్రి ఇక్కడే ఉండిపోదామని వచ్చాను బావా. ఏంటిలా... చీకటింట్లో.. తలుపు కూడా వేసుకోకుండా..’’ అన్నాడు వెంకట్‌... శేఖర్‌ మంచం పక్కనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ. ‘‘నువ్వెందుకొచ్చావ్‌?! అవిటివాడిని. నేనుంటే ఎంత, పోతే ఎంత. భూమికి భారమే తప్ప నాలాంటివాడు ఎవరికి ఉపయోగం?’’ శేఖర్‌ గుండెలోని బాధంతా గొంతు దాటి వచ్చేస్తోంది.‘‘అదేంటి బావా అలా అంటావు. మా అందరికీ నువ్వంటే ఎంతో అభిమానం. నీకు నువ్వుగా కదల్లేకపోవచ్చు. కానీ, నీకున్న తెలివితేటలు మాలో ఎవరికున్నాయి..’’ వెంకట్‌ మాటలకు అడ్డుపడ్డాడు శేఖర్‌. ‘‘చాల్లే ఇన్నాళ్లూ చావలేక బతికున్నాను. ఇప్పుడు చస్తూ బతుకుతున్నాను. నేను అవిటివాడినని అన్నయ్యకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదట.  వాడికి పుట్టే పిల్లలకూ నాలా అవిటితనం రావచ్చని భయపడుతున్నారట. నేనిలా ఉండటం వల్లే చెల్లికీ పెళ్లి కావడం లేదట. మంచి సంబంధాలు నామూలంగా చెడిపోయాయని అన్నయ్య నోటికొచ్చిన మాటల్లా అని వెళ్లిపోయాడు. నన్ను ఎప్పుడో వదిలించుకుని ఉంటే ఈ రోజు ఈ తిప్పలు వచ్చేవి కాదట. వాడు అన్నేసి మాటలు అంటుంటే అమ్మ, చెల్లి ఒక్కరైనా అడ్డుచెప్పలేదు రా! పైగా ‘ఏం చే యగలం, మన కర్మ’ అని ఏడుస్తూ కూర్చున్నారు. అంటే నేను ఇక్కడ ఉండకూడదనేగా వీళ్లంతా కోరుకునేది. ఇలా పుట్టడం నా తప్పా! నా మనసెంత గాయపడిందో అని కూడా చూడకుండా అన్నయ్యను సముదాయించి తీసుకురావడానికి వెళ్లారు ఇద్దరూ! నాన్నే ఉండి ఉంటే ఇలా జరిగేదా! అడుగు కూడా వేయలేని నేను ఏం పని చేయగలను. నాకు నిజంగా బతకాలని లేదురా. చచ్చేమార్గం చెప్పు’’ అని పెద్దగా ఏడ్చేశాడు శేఖర్‌!

భారం ఎప్పటికి దిగుతుంది?
శేఖర్‌ చిన్నతనంలోనే తండ్రి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఆసరా చేసుకుని ముగ్గురు పిల్లలను తల్లి విమల సాకుతూ వచ్చింది. శేఖర్‌ని రోజూ తనే స్కూల్‌కి తీసుకెళ్లి, ఇంటికి తీసుకువచ్చేది. కాస్త పెద్దయ్యాక స్కూల్లో స్నేహితులే తీసుకెళ్లేవారు. కొన్నాళ్లకి తనే కాళ్లతో, చేతులతో పాక్కుంటూ స్కూల్‌కి అతికష్టంగా వెళ్లి వచ్చేవాడు. ఊళ్లో హై స్కూల్‌ వరకే ఉంది. ఎవరో ఒకరు దగ్గర లేకపోతే అవసరాలు తీర్చుకోవడానికే కష్టపడేవాడు. అందుకే విమల కొడుకును టౌన్‌కి పంపించలేదు. తర్వాత ఏం చేయాలో తోచక శేఖర్‌ని ఇంట్లోనే ఉంచింది. ఊళ్లో అందరూ శేఖర్‌ని జాలిగా చూసేవారు. ‘విమలమ్మా! ఎన్నాళ్లో నీకీ కష్టం’ అనేవారు! ఆమె మౌనంగా వినేది. మౌనంగా ఉండేది. మిగతా ఇద్దరు పిల్లలు పట్టణంలో ఉండి చదువుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి అంటే కుటుంబం వివరాలన్నీ ఇరువైపుల వాళ్లు చూస్తారు. శేఖర్‌ని అవిటివాడిగా చూసినవాళ్లు ‘వీళ్ల కుటుంబంలో అవిటితనం ఉంది. పుట్టబోయే వాళ్లు కూడా అవిటితనంతో పుడితే..’ అనే అనుమానం వ్యక్తం చేసిన వాళ్లు ఈ సంబంధం వద్దన్నారు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఎవరి మనసులూ ప్రశాంతంగా లేవు.

‘వికల భావన’లకు థెరపీ
‘‘శేఖర్‌ మీ వేదన ఈ నాటిది కాదని అర్థం అవుతోంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం మీ చేతుల్లోనే ఉంది..’’కౌన్సెలర్‌ మాటలకు.. ‘‘నాకేం చేతనవుతుంది, కాలు కూడా కదపలేనివాడిని’’ అని నిస్సహాయంగా అన్నాడు శేఖర్‌.వెంకట్‌ బలవంతం మీద కౌన్సెలింగ్‌కి వచ్చాడు శేఖర్‌. ‘‘రిగ్రెషన్‌ థెరపీ మనలోని నిస్సహాయతను దూరం చేస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకునే తత్త్వాన్ని పెంచుతుంది’’ అని చెప్పి శేఖర్‌ని వెంట తీసుకొచ్చాడు వెంకట్‌. పట్టణంలో ఉండి చదువుకున్న వెంకట్‌కి రిగ్రెషన్‌ థెరపీ గురించి తెలుసు.

ధ్యానంలో అంతర్యానం
శేఖర్‌ ప్రయాణం మొదలైంది. అది వర్తమానం నుంచి గతం వైపుగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. బాల్యం నుంచీ ఎదురైన సమస్యలు, అందరూ చూసే జాలి చూపులను కళ్లు మూసుకొని మనోనేత్రంతో పరిశీలిస్తూ వెనక్కి వెనక్కి ప్రయాణిస్తున్నాడు. తన నిస్సహాయతకు కారణాలను అన్వేషిస్తున్నాడు. తల్లి గర్భం నుంచి గత జన్మలోకి అతని ప్రయాణం సాగింది. అక్కడ తనను తాను చూసుకున్నాడు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న తనను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తను ఆటలు ఆడుతున్నాడు. స్నేహితులతో, కుటుంబంతో కలిసి ఆనందంగా ఉన్నాడు.

ఉన్నట్టుండి పెద్ద కుదుపు
అకస్మాత్తుగా తన ఆప్త మిత్రుడు మర ణించాడు. ఈతకని మోట బావిలోకి దిగి శవమై తేలాడు. ఆ దృశ్యాన్ని తను తట్టుకోలేకపోతున్నాడు. ఎన్నో కష్టాల నుంచి తనను గట్టెక్కించాడు ఆ స్నేహితుడు. ఇప్పుడా స్నేహితుడు బావి గట్టున విగతజీవుడై ఉన్నాడు! ఇప్పుడు అతను లేడు. ఇక నా కష్టాలను తీర్చేవారు లేరు. నాకు అండగా ఉండేవారు లేరు. ఏ పనిచేద్దామన్నా చేతులు సహకరించడం లేదు. అడుగు వేద్దామన్నా కాలు ముందుకు పడటం లేదు. బాధ, భయం తొలుస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లకు తను పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. ఆ దిగులుతోనే మరణించాడు. ఆ దిగులుతోనే ఈ జన్మ తీసుకున్నాడు. పేరుకుపోయిన భయం, ఒంటరితనం.. అవే అవయవలోపానికి దారి తీసాయి..’ అని చెబుతున్న శేఖర్‌.. తనలో  ఎక్కడ సమస్య ఉందో గమనించాడు. తనను ఎప్పుడూ ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవాలనే ఆలోచనను కలిగి ఉండటాన్ని గమనించాడు. థెరపీ నుంచి బయటకు వచ్చాడు.

నిస్సహాయితకు స్వస్తి
వెంకట్‌ సాయంతోనే పట్టణంలోని హాస్టల్‌లో చేరాడు శేఖర్‌. తల్లి, అన్న, చెల్లెలు తమ పొరబాటును మన్నించి ఇంటికి రమ్మన్నారు. ‘‘అసలు మీమీద నాకెలాంటి కోపం లేదు. నేను నేనుగా ఎదగాలి. బయట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటాను. నా స్వశక్తితో ఎదిగి ఆ తర్వాతే మిమ్మల్ని కలుస్తాను’’ అని వారికి నచ్చచెప్పి పంపాడు శేఖర్‌. ఐదేళ్ల సమయంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఆగిపోయిన చదువును దూరవిద్య ద్వారా పూర్తిచేశాడు. వీల్‌చైర్‌ వాలీబాల్‌ సాధన చేస్తూ పారాలింపిక్‌ గేమ్స్‌లో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. బ్యాంకు పరీక్షలు రాసి, ఉద్యోగం సంపాదించుకున్నాడు. తల్లికి అండగా నిలిచాడు. అంగవైకల్యం తన తప్పు కాదని, ఆదర్శవంతమైన జీవనాన్ని దిద్దుకోకపోవడమే తప్పని తెలుసుకున్నాడు. లోపం ఉందని బాధపడకుండా ఉన్న అవయవాలను, చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకుంటే జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవచ్చో తెలియజేస్తూ నలగురికి ఆదర్శంగా నిలిచాడు.

అష్టవంకరలను అధిగమించిన అష్టావక్రుడు
ఇతిహాసాలలో అష్టావక్రుడు జీవితం ఎంతో గొప్పగా కనిపిస్తుంది. మహర్షి ఏకపాదుడి కుమారుడు ఎనిమిది వంకరలు గల దేహంతో జన్మించాడు. అందుకే అతనికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది. ఇతను పుట్టే సమయానికి తండ్రి జనకమహారాజు దగ్గర ఉన్న వందితో వాదించలేక ఓడిపోయి, జలబంధీగా ఉన్నాడు. అష్టావక్రుడు తన అంగవైకల్యం గురించి చింతించక వేదవిద్యలను అభ్యసించాడు. పన్నెండేళ్ల వయసులోనే తన వాదనతో వందిని ఓడించి బంధీగా ఉన్న తండ్రిని, మిగతావారిని విడిపించి తీసుకొచ్చిన ఘనుడు. ఆ విధంగా అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. బతికినన్నాళ్లూ ధర్మనిష్టకుడిగా, మహామునిగా ఖ్యాతి గడించాడు. వివాహం చేసుకొని పుత్ర పౌత్రులను పొందాడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహితగా ప్రపంచానికి తెలిసింది.

థెరపీతో ఉపయోగాలు
ఉన్న అవయవాలను సక్రమంగా ఉపయోగించుకోకపోవడమే అంగవైకల్యం అని తెలుస్తుంది.
పూర్ణంగా ఉన్నాను. పూర్ణంగా జీవిస్తున్నాను అనే భావన పెరుగుతుంది..
‘జీనియస్‌’ అంటే వంశపారంపర్యంగా జ్ఞానం ఉంటుంది అని కాదు. అన్నింటినీ  పరిపూర్ణంగా వాడుకోవడంలో ముందుండేవాడు అని తెలుసుకుంటారు.
తమ శక్తిని సరైన దృక్కోణంలో చూసి వాడుకోవాలనే జ్ఞానం పెరుగుతుంది.
తమకు లేదని బాధపడటం కన్నా ఉన్న పనినే పరిపూర్ణంగా చేయగలిగితే అదే పూర్ణత్వానికి దారి తీస్తుందని అర్థమవుతుంది.

అనుభవాల ప్రవాహం అర్థమైతే వైకల్యం దూరం
అంగవైకల్యం ఉన్నవారు కుటుంబం, సమాజం తమను చిన్నచూపు చూస్తున్నాయన్న భావనలో ఉంటారు. సమాజంలోనూ ఇలాంటి దృష్టికోణం ఉంది. అలాగే అంగవైకల్యంతో బాధపడేవారు భగవంతుడు శిక్ష వేశాడనో, తను గర్భంలో ఉన్నప్పుడు తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోలేదనో, వంశపారంపర్య లోపం అనో కుంగిపోతుంటారు. కానీ, తాము పాఠాన్ని నేర్చుకోవడం కోసమే ఈ జన్మ తీసుకున్నామని గ్రహించరు. అంగవైకల్యంతో బాధపడేవారికి రిగ్రెషన్‌ థెరపీ చేస్తే ‘గత జన్మలో యుద్ధంలో కానీ, జీవన ప్రయాణంలో కానీ తమకు కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తులను కోల్పోయి ఆ బాధ, భయంతోనే జీవించినవారు అధికంగా ఉన్నారు. దీంతో తమ కుడి భుజం పోయిందనో, తాము నడవలేకపోతున్నామనో బతికినన్నాళ్లూ భయం భయంగా జీవించి ఉంటారు. మరణ సమయంలోనూ అదే భయంతో శరీరాన్ని విడిచి ఉంటారు. తిరిగి, గర్భంలో ప్రవేశించినప్పుడు కూడా ఆ భావన బలంగా ఉండటం వల్ల అలాగే ముడుచుకుపోతారు. దీంతో అవయవాల ఎదుగుదల సరిగ్గా ఉండదు. ‘నాకీ అవయవం లేదు’ అని బలంగా మస్కిస్తంలో ఉండటం వల్లే అంగవైకల్యానికి దారి తీస్తుంది. అనుభవాల ప్రవాహం అర్ధమైతే ఉన్న విభాగాలన్నీ సరిగ్గా వినియోగించుకోవచ్చు.
 – డా.హరికుమార్, జనరల్‌ సర్జన్, ఫ్యూచర్‌ థెరపిస్ట్, హైదరాబాద్‌
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement