ఘోర ప్రమాదం
- ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీ
- ఇద్దరి దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి విషమం
- ఇంకో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
- పావగడ సమీపంలో ఘటన
పావగడ/రొద్దం:
కర్ణాటక రాష్ట్రం పావగడ-కళ్యాణదుర్గం ప్రధాన రహదారిలోని పావగడ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ-02.జెడ్-148 నంబర్ గల బస్సు 62 మంది ప్రయాణికులతో పావగడకు బయలుదేరింది. పావగడ విడ్స్ సమీపంలోని నాగలమడక మలువులోకి రాగానే పావగడ వైపు నుంచి కళ్యాణదుర్గం వెళ్తూ ఎదురొచ్చిన ఐచర్ వాహనం, ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ధ్వంసమైన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వారిలో యశోద(35)గా గుర్తించారు. మరో యువకుడు మృతి చెందగా, అతని వివరాలు తెలియరాలేదు. బస్సు డ్రైవర్ నరసింహులు(45), ఐచర్ వాహన డ్రైవర్ మణి(40) పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 20 మందిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గాయపడిన వారి వివరాలు...
ఐచర్ క్లీనర్ మూర్తి(34), వెంకటేసు(40)కంబదూరు తిమ్మాపురం, సుబ్బరాయుడు(35)కంబదూరు తిమ్మాపురం, లక్ష్మిదేవి(50), ఆదిలక్ష్మి(45)కళ్యాణదుర్గం, నరసింహప్ప(30) పావగడ, చెన్నమ్మ(65) చెన్నంపల్లి, పద్మావతి(40) బస్సు కండక్టర్, అమృత విద్యార్థి(16), గంగమ్మ(40), శ్రీనివాసులు(40) అండేపల్లి, రత్నయ్యశెట్టి(55)పావగడ, నాగభూషణ(40)కదిరిదేవరపల్లి, నారాయణ(34) తదితరులు ఉన్నారు. మరో ఆరుగురు స్వల్ప గాయాలతో చికిత్స బయటపడ్డారు. సీఐ ఆనంద్, ఎస్‌ఐ మజునాథ్ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేపసుకుని దర్యాప్తు చేస్తున్నారు.