మరో ఆరుగురికి అస్వస్థత
మరో ఆరుగురికి అస్వస్థత
Published Thu, Aug 17 2017 10:47 PM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM
మొత్తం 42 మంది బాలికలు ఆస్పత్రిపాలు
కస్తూరిబా విద్యాలయలో అధికారుల విచారణ
వై.రామవరం (రంపచోడవరం) : తోటకూరపాలెంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో బాలికల అస్వస్థత ఘటన.. మిగిలిన విద్యార్థినులను హడలెత్తిస్తే.. అధికారులను పరుగులు పెట్టించింది. ఈ విద్యాలయంలో గురువారం మరో ఆరుగురికి విరేచనాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం తిన్న ఆహారం వికటించి 36 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతలకు గురైన విషయం విదితమే. దీంతో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 42కు పెరిగింది. ఈ సంఘటనపై సర్వశిక్షా అభియాన్ జిల్లా పీఓ శేషగిరిరావు గురువారం విచారణ చేశారు. స్టోర్ రూమ్‌లోని ఆహార పధార్థాలను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వై.పాండురంగరావు తనిఖీ చేశారు.
అందరిలోనూ ఆందోళన..
విద్యాలయ ప్రత్యేకాధికారి (ప్రిన్సిపాల్) విజయకుమారి నిర్వాకమే ఈ సంఘటనకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడి మానేసిన బడిఈడు (డ్రాపౌట్స్) పిల్లల కోసం కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ చదువు కొనసాగిస్తున్న వారందరూ అసలే డ్రాపౌట్స్ కావడంతో ఈ సంఘటన వారిని బెంబేలెత్తిస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విద్యాలయంలో ప్రస్తుతం మొత్తం 130 మంది బాలికలు ఉన్నారు.
పెత్తనం చెలాయిస్తున్న భర్త!
ఈ విద్యాలయంలో ప్రత్యేకాధికారి విజయకుమారి భర్త పెత్తనం చలాయిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మహిళా ఉపాధ్యాయులే ఉన్న ఆ బాలికల విద్యాలయంలోకి పురుషులకు ప్రవేశం ఉండదు. అయితే అ నిబంధనలను తుంగలోకి తొక్కి, ఆయన విద్యాలయంలో యథేచ్ఛగా తిరుగుతుంటారని విద్యార్థినులు చెబుతున్నారు. ఒక మహిళా ఉపాధ్యాయిని నిర్వర్తించాల్సిన వార్డెన్ విధులను ఎస్‌ఓ భర్తే చేపట్టారన్న విమర్శలున్నాయి.
సకాలంలో స్పందించారు...
విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం తెలియగానే ఐటీడీఏ పీఓ దినేష్ కుమార్ వెంటనే వై.రామవరం చేరుకున్నారు. చవిటిదిబ్బలు పీహెచ్‌సీ వైద్యాధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది సకాలంలో వైద్యం చేయడంతో విద్యార్థినులు ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారని గ్రామస్తులు అంటున్నారు. సర్వశిక్షా అభియాన్ జిల్లా పీఓ శేషగిరిరావు, ఏజెన్సీ డీఈఓ హెచ్‌వీ ప్రసాద్, ఎంపీడీఓ కె.బాపన్నదొర, ఎంఈఓ కె.ప్రసాదబాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గొర్లె శ్రీకాంత్ తదితరులు బుధవారం రాత్రి నుంచి ఆస్పత్రిలో మకాం వేసి తగిన సేవలు అందించారు.
Advertisement
Advertisement