అంతెత్తున తన ఎదురుగా ఉన్న కొత్త వ్యక్తుల్ని చూసి ఆ పాప భయపడి ఏడుస్తున్నప్పుడు ఫొటో తీశారు జాన్ మూర్. తల్లి కనిపించడం లేదు. తండ్రి కనిపించడం లేదు. రెండున్నరేళ్ల పసిదానికి అదొక పెద్ద విపత్తు. ఆ విపత్తుకే.. ‘ట్రంప్’ రూపాన్ని ఇచ్చింది ‘టైమ్’. కవర్‌పై ‘వెల్‌కమ్ టు అమెరికా’ అని క్యాప్షన్ పెట్టింది.
‘టైమ్’ పత్రిక ప్రతి ఆదివారం, లేదంటే సోమవారం స్టాండ్స్‌లోకి వస్తుంది. శనివారం వరకు ప్రింట్ అవుతూ ఉంటుంది. పైన మనం చూస్తున్నది నేడో, రేపో రాబోతున్న సంచిక. కవరు పేజీ మీద చిన్న పాప ఏడుస్తూ ట్రంప్‌ను చూస్తూ ఉంది. ట్రంప్ ఫీలింగ్సేమీ లేకుండా.. ఏడుస్తున్న ఆ పాపను చూస్తూ ఉన్నాడు. ఆ వయసు పాప ఏడుస్తూ చూస్తుంటే ఎవరికైనా చేతుల్లోకి ఎత్తుకోవాలనిపిస్తుంది. ట్రంప్‌కి కూడా అనిపించేదేమో. ఆయన అక్కడ ఉండి ఉంటే! యు.ఎస్.–మెక్సికో సరిహద్దుల్లోని మెకాలెన్ టెక్సాస్ ఏరియాలో.. తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న గెట్టీ ఇమేజస్ ఫొటోగ్రాఫర్ జాన్ మూర్ ఈ పాపను ఫొటో తీశారు. వలస వచ్చినవారిపై విచారణ జరిపించేందుకు వీలుగా.. ముందు వారి పిల్లల్ని నిర్బంధ కేంద్రాలకు తరలించి, విచారణ ముగిశాక తల్లిదండులకు అప్పగిస్తారు. వలసల్ని కట్టడి చెయ్యడం కోసం ట్రంప్ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ పాలసీ ఇది. జీరో టాలరెన్స్ అనే మాట పాతదే. ట్రంప్ ఇప్పుడు దానిని కుటుంబాలపై ప్రయోగించారు. కుటుంబాలను విడదీస్తున్నారంటే ఎవరూ హద్దులు దాటి అమెరికాలోకి వచ్చే సాహసం చెయ్యరు, సమస్య అలా సాల్వ్ అయిపోతుందని ట్రంప్ అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నట్లు జరగలేదు.
వలసలు ఆగలేదు. ఆయనపై విమర్శలూ ఆగలేదు. ట్రంప్ భార్య మెలానియ సహా, అమెరికన్ పౌరులు, అమెరికా పూర్వపు ప్రథమ మహిళలు ‘సపరేషన్ ఆఫ్ ఫ్యామిలీ’ని వ్యతిరేకించారు. పిల్లల్ని తల్లుల చేతుల్లోంచి లాగేసుకోవడం ఎవరికి మాత్రం నచ్చుతుంది? ఆ.. లాగేవాళ్లకైనా నచ్చుతుందా? ట్రంప్‌పై ఒత్తిడి వచ్చింది. చివరికాయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి, జీరో టాలరెన్స్ పాలసీని రద్దు చేశారు. ఈ ఆర్డర్స్ వచ్చింది బుధవారం. అప్పటికే ‘టైమ్’ పత్రిక ప్రింట్‌కి వెళ్లిపోయింది! మంగళవారం జాన్ మూర్ ఆ చిన్న పాప ఫొటోను టైమ్స్ కార్యాలయానికి తెచ్చిస్తే, వెంటనేఆ ఫొటోకు ఫొటోషాప్‌లో ట్రంప్‌ని యాడ్ చేసి కవర్‌పేజీని డిజైన్ చేసుకుంది టైమ్. అంతెత్తున తన ఎదురుగా ఉన్న కొత్త వ్యక్తుల్ని చూసి ఆ పాప భయపడి ఏడుస్తున్నప్పుడు ఫొటో తీశారు జాన్ మూర్. తల్లి కనిపించడం లేదు. తండ్రి కనిపించడం లేదు. రెండున్నరేళ్ల పసిదానికి అదొక పెద్ద విపత్తు. ఆ విపత్తుకే.. ‘ట్రంప్’ రూపాన్ని ఇచ్చింది ‘టైమ్’. ట్రంప్ తన పాలసీని వెనక్కు తీసుకున్నాడు కదా అని, టైమ్ తన కాపీలను వెనక్కు తీసుకునే ప్రయత్నాలేమీ చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ‘జీరో టాలరెన్స్’ అమల్లో ఉంది. అప్పటి నుంచి జూన్ 20 న దానిని రద్దు చేసేవరకు రెండు వేల మందికి పైగా పిల్లల్ని నిర్బంధ కేంద్రాలకు తరలించింది యు.ఎస్.పాలనా యంత్రాంగం. ఆ పిల్లలందరి తల్లిదండ్రుల విచారణా పూర్తయితే కానీ జీరో టాలరెన్స్ ఆగినట్లు కాదు. అప్పటివరకు ట్రంప్‌పై ఇలాంటివి ఎన్ని కవర్ పేజీలు వేసినా తక్కువే.నిర్బంధ కేంద్రాల్లో పిల్లల్ని బాగానే చూసుకుంటున్నారని ట్రంప్ ప్రభుత్వం అంటోంది. ఏంటి చూసుకోవడం.. అమ్మానాన్నని పక్కన లేకుండా చేసి! ఆ కేంద్రాల లోపల ఎంత కఠినంగా ఉంటున్నారో చూపించే వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఓ పసిదాన్ని బోర్డర్ పెట్రోల్ ఏజెంట్ అడుగుతుంటాడు.. ‘నువ్వెక్కణ్నుంచి వచ్చావ్?’ అని! ఎక్కణ్నుంచైనా తనొక్కటే వస్తుందా? ఆ ప్రశ్న అడగడంలోనే నిర్దాక్షిణ్యం కనిపిస్తుంది. ‘ఎల్ సాల్వడార్’ అని చెబుతుంది. ‘మరి నువ్వూ..’ అని ఇంకో చిన్నారిని అడుగుతాడు. ‘గ..ట..మ. లా..ఆ ఆ ఆ ఆ ఆ’ అని సన్నగా మొదలు పెట్టి పెద్దగా ఏడ్చేస్తుంది. ట్రంప్ వినాలి ఆ ఏడుపుని. తనని తను ఏవగించుకుంటాడు.. ‘సిగ్గుందా.. నీకు’ అని. అంత దుఃఖం ఆ పాప గొంతులో!!
‘ఇమ్మిగ్రేషన్ గురించి మాట్లాyì ఇక టైమ్ వేస్ట్ చేయకండి అని ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ’ తో అన్నారు ట్రంప్. అది ఆయన పార్టీనే. రిపబ్లికన్ పార్టీ. ‘రద్దు చేశాను కదా.. ఇక డిస్కషన్ ఎందుకు?’ అని ఆయన ఉద్దేశం.
ట్రంప్ ఎప్పుడైనా తన గొప్పతనం గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు టైమ్ పత్రిక తనను ఎన్నిసార్లు కవర్‌పేజీగా వేసిందో.. తీసి చూపిస్తారు. ఇటీవల సింగపూర్‌లో కిమ్, తను కలుసుకున్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించిన టైమ్ రిపోర్టర్ బ్రియన్ బెనెట్‌ని పిలిచి, ‘ఈవారం కూడా కవర్ పేజీ నాదేనా?’ అని అడిగారు! ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. హన్నా ఎలిస్ అనే జర్నలిస్టు.. ‘ఇప్పుడీ తాజా సంచికను కూడా ట్రంప్ గొప్పగా చూపించుకోగలరా?’ అని ప్రశ్నించారు.
– మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment