సన్‌రైజ్ క్యాలెండర్...
రోజువారీ వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు ఉపయోగపడే క్యాలెండర్ అప్లికేషన్ ఇది. ఇటీవలే తాజాగా అప్‌డేట్ అయింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌కూ అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్ గూగుల్ క్యాలెండర్‌తోపాటు ఎవర్‌నోట్ వంటి అప్లికేషన్లతో సులువుగా అనుసంధానమవుతుంది. రోజులో ఏ సమయంలో ఏం చేయాలనుకుంటున్నామో గుర్తు చేసుకునేందుకు పార్టీలు, ఇతర కార్యక్రమాలకు బంధుమిత్రులను ఆహ్వానించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఫేస్‌బుక్ ఈవెంట్స్, గూగుల్ మ్యాప్స్, లింక్డ్‌ఇన్ కాంటాక్ట్స్‌తోనూ ఇంటిగ్రేట్ కాగలగడం ఈ అప్లికేషన్ మరో ప్రత్యేకత.
ఆపత్కాలంలో ఆరుగురికి మెసేజ్‌లు...
అనుకోకుండా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోతే... స్నేహితులు లేదా బంధువులను రహస్యంగా సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటే ‘సర్కిల్ ఆఫ్ 6’ మీకు తగిన అప్లికేషన్. మహిళల భద్రతపై ఆందోళన నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అప్లికేషన్‌పై రెండుసార్లు ట్యాప్ చేస్తే చాలు... ముందుగానే రాసిపెట్టుకున్న మూడు మెసేజ్‌లలో ఒకటి మీ కాంటాక్ట్స్‌లోని ఆరుగురికి చేరిపోతుంది. జీపీఎస్ ద్వారా మీరెక్కడున్నారో చెబుతూ మిమ్మల్ని పిక్ చేసుకోవాల్సిందిగా ఒక సందేశం వెళుతుంది. ఇంకో సందేశం ద్వారా వెంటనే కాల్ చేయాల్సిందిగా ఫ్రెండ్స్‌కు రిక్వెస్ట్ వెళుతుంది. మహిళా భద్రతకు ఉద్దేశించిన హాట్‌లైన్‌తో నేరుగా సంప్రదింపులు చేసేందుకూ అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా.
ఆండ్రాయిడ్‌కూ వెబ్‌ఎండీ...
జ్వరమొచ్చినా... లేదా ఇంకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లడం పరిపాటి. అలాకాకుండా... మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు... డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించవచ్చు? అన్న విషయం తెలుసుకునేందుకు వెబ్‌ఎండీ అప్లికేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. అనారోగ్యం తాలూకూ లక్షణాలను అందిస్తే... ఈ అప్లికేషన్ ఏ వ్యాధి లేదా సమస్య ఉందో సూచనప్రాయంగా చెబుతుంది. ఎలాంటి ప్రాథమిక చికిత్స చేసుకోవచ్చో సూచిస్తుంది కూడా. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్నదీ తెలియజేస్తుంది.
డెస్క్‌టాప్‌పైనా న్యూస్ టికర్....
టీవీ ఛానళ్లలో స్క్రీన్ దిగువభాగంలో వచ్చే న్యూస్‌టికర్లను గమనించే ఉంటారు. వీటిని పీసీ డెస్క్‌టాప్‌పైనా వచ్చేలా చేసుకోవచ్చు. ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్లను సేకరించి డెస్క్‌టాప్‌పై చేర్చేందుకు బాట్‌వేర్ అనే యూకే సంస్థ డెస్క్‌టాప్ టికర్ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. కొన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్లు ముందుగానే ప్రీలోడ్ అయినప్పటికీ మీకు కావాల్సిన వాటిని అదనంగా చేర్చుకునే అవకాశముంది. స్క్రీన్‌పై ఎక్కడ రావాలన్న అంశాన్నీ మీరే నిర్ణయించవచ్చు. మ్యాక్ లేదా లీనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఈ అప్లికేషన్ పనిచేయదు. వివరాలకు... http://www.battware.co.uk వెబ్‌సైట్‌ను చూడండి.
భలే ఆప్స్
Published Wed, Jun 18 2014 11:41 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement