
సారీ... రాంబాబు మారలేదు!
మాది కడప జిల్లా వేంపల్లి మండలం. నేను ఎంబిఏ పూర్తి చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్యాషన్. ఎన్నో ఆర్టికల్స్ రాస్తుండేవాడిని.
ప్రేమలో... ఫెయిల్యూర్... తిరస్కారం... ఛీత్కారం...
ఆత్మహత్యలు... మనోవ్యాధులు... చదువుని నిర్లక్ష్యం చేయడం...
అంతలోనే... ఏదో సాధించాలనే కసి...
ఇదంతా రొటీన్...
ఏ మాత్రం వెరైటీ లేదు...
జీవితమంటేనే రొటీన్ అంటున్నాడు జయసింహ
‘రొటీన్ రాంబాబు’ లఘుచిత్రం ద్వారా...
డెరైక్టర్స్ వాయిస్:
మాది కడప జిల్లా వేంపల్లి మండలం. నేను ఎంబిఏ పూర్తి చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్యాషన్. ఎన్నో ఆర్టికల్స్ రాస్తుండేవాడిని. సినిమాల మీద ఉన్న ఆసక్తితో కథలు తయారుచేసుకునేవాడిని. నాకు శ్రీశ్రీ రచనలంటే చాలా ఇష్టం. రైటర్‌గా, డెరైక్టర్‌గా నిలబడాలనేది నా చిరకాలవాంఛ. ‘ఉయ్యాలజంపాల మూవీ కంపెనీ’ వారి ‘సన్‌షైన్’ సినిమాకి వర్క్ చేస్తున్నాను. మా కుటుంబసభ్యులు, మిత్రులు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ లఘుచిత్రం చేయడానికి మా అన్నయ్య నాకు సహకరించారు. మా స్నేహితులమంతా కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి ఈ చిత్రం తీశాము. ఇక ఈ కథలో... ఒకే రకమైన సమస్య ఇద్దరు విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులకు ఎదురైతే, వాళ్ల సంఘర్షణ ఎలా ఉంటుందనే విషయాన్ని సరదాగా చూపాలనుకున్నాను. ఈ చిత్రం ‘మా మూవీస్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్’లో సెలక్ట్ అయింది. ఎంటర్‌టెయిన్‌మెంట్ చిత్రాలంటే నాకు ఇష్టం. ముందు ముందు అటువంటి చిత్రాలు తీయాలనుకుంటున్నాను.
షార్ట్‌స్టోరీ:
తనను ఎవరూ ప్రేమించటం లేదని ఒక యువకుడు, ప్రేమలో విఫలం అయి, ఐఏఎస్ కావాలన్న తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చలేక మరొక యువకుడు... ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ఒకరితో ఒకరు వారి వారి బాధలు పంచుకుంటారు. ఒకరికొకరు సర్ది చెప్పుకుంటారు. ఆత్మహత్య యత్నం విరమించుకుంటారు. చివరకు ఆ యువకుడు ప్రేమలో విజయం సాధిస్తాడు, రెండవ వ్యక్తి ఐఏఎస్ అవుతాడు. అంతవరకూ ఓకే. అక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. అది చిట్టి తెర మీద చూడాల్సిందే.
కామెంట్:
మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఇందులోని నటీనటులు బాగా నటించారు. అయితే తీసే విధానం మరికాస్త పట్టుగా ఉండాలి. అలాగే కొన్ని కొన్ని డైలాగులు మరీ పేలవంగా ఉన్నాయి. ఇంత మంచి కాన్సెప్ట్‌ని మరి కాస్త బలంగా డెరైక్ట్ చేసి ఉంటే బావుండేది. సంభాషణలలో హాస్యం బావుంది. ‘హచ్ కుక్కలా ఉండాల్సిన నీ పరిస్థితి ఊరకుక్కలా అయ్యింది’ , ‘ఇన్సూరెన్స్ పాలసీలు అడిగేవాడి కంటె నా బతుకు అధ్వానంగా ఉంది’ ‘తొలిచూపు వలపు మాత్రమే కాదు... గత జన్మ పిలుపు...’ వంటి సంభాషణలు బాగున్నాయి. ఇందులో హీరోగా నటించిన వ్యక్తి నటన ఎక్స్‌లెంట్ అని చెప్పాలి. చిట్టితెరలో లఘుచిత్రాలు తీసే యువత... సిగరెట్లు కాల్చడం, మందు కొట్టడం వంటి సీన్లు తీయకుండా ఉంటే బాగుంటుంది. సినిమాని మరింత పక్కాగా తీయడం, డైలాగులు పకడ్బందీగా ఉండేలా చూసుకోవడం... వంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఈ దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంటుంది.
- డా.వైజయంతి