రోజూ కనబడే కథలు | Which are daily stories | Sakshi
Sakshi News home page

రోజూ కనబడే కథలు

Published Mon, Jun 8 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

రోజూ కనబడే కథలు

రోజూ కనబడే కథలు

స్టేషన్‌లో బామ్మ...
 
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జనరల్ బోగీ ప్రయాణీకులు వేచి ఉండే ప్రాంగణం... కొంతకాలంగా  అదే ఆమె ఇల్లు. ప్లాట్‌ఫాం ఊడ్చే వారి దగ్గర్నుంచి రైల్వే పోలీసుల దాకా  అందరూ కొడుకులూ కూతుర్లే... పాసింజర్లేమో చుట్టాలు.  కొన్ని నెలల క్రితం కొడుకే  రైల్వేస్టేషన్‌లో వదిలేసాడని, అప్పటి నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయిందని  లేదు... తనంతట తానే వచ్చిందని నెలలు కాదు ఏళ్ల నుంచి అక్కడే ఉందని.... ఇందులో ఏది నిజమో చెప్పాల్సిన  బామ్మ... ఆ ఒక్కటి తప్ప అన్నీ చెబుతుంది. ఆమెని చూస్తే... ఇలాంటి అమ్మమ్మ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఆమెతో మాట్లాడితే... ఆ అనుభవాల మూటను ఇంటికి భధ్రంగా తెచ్చుకోవాలనిపిస్తుంది.

తన పేరు చంద్రావతి (85) అని చెబుతున్న ఈ బామ్మ... పుట్టపర్తిలో తనకు కంటి ఆపరేషన్ ఉచితంగా చేశారని, అక్కడంత మంచి మనుషుల్ని ఇంకెక్కడా తను చూడలేదంది. రైల్వే  ప్లాట్‌ఫాం మీది చిరువ్యాపారుల దగ్గర్నుంచి ప్రతి ఒక్కరికీ ఈ బామ్మ చిరపరిచితమే. ఎవరినీ చేయి చాచి యాచించదు. అక్కడి రెస్టారెంట్ వాళ్లిచ్చే ఇడ్లీ తప్ప మరేదీ తిన దు. మినరల్ వాటర్ మాత్రం డిమాండ్ చేసి తీసుకుంటుంది. గతంలో పలుమార్లు వృద్ధాశ్రమాలకు తరలించినా... తిరిగి  రైల్వేస్టేషన్‌కే వచ్చేసింది.
 
ప్లాట్‌ఫాం ‘సాక్షి’గా... ‘కన్న’ కధలెన్నో...
 ‘‘ఒక పోలీసాయన అమ్మా అని పిలిచేవాడు. కబుర్లు చెప్పేవాడు  కాని ఎప్పుడూ ఆడవాళ్లతో గడిపేవాడు. అందుకే ఇక్కడ పనిచేసేవాళ్లంతా అతడ్ని తిట్టుకునేవారు. ఒకసారి తన భార్యను తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. ఆ పిల్ల ఒఠ్టి అమాయకురాలు. మీ ఆయన ఆడాళ్లతో తిరుగుతున్నాడే అని చెబితే... వాళ్లకి డబ్బులివ్వడు.. ఇంకా వాళ్ల దగ్గర ఉన్న నగా నట్రా కూడా లాక్కొచ్చేసి నాకిచ్చేస్తాడు అనింది పిచ్చిది. చివరికా పోలీసుని సస్పెండ్ చేశార్లే’’అంటూ చెప్పుకొచ్చిన చంద్రావతి దగ్గర అలాంటి కథలు బోలెడు. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో ప్రయాణించే వారిలో మంచోళ్లు, చెడ్డోళ్లు, పిచ్చోళ్లు, అల్లరోళ్లు.. ఇలా ఎందరినో చూసిన ఆ బామ్మ... తనతో బాగా మాట్లాడినవారితో ఎంచక్కా కబుర్లు పంచుకుంటుంది.  రాత్రుళ్లు నిద్రపోని ఈ బామ్మ... పలుమార్లు  దొంగల సమాచారాన్ని పోలీసులకు అందించిందట కూడా. అక్కడ పనిచేసేవాళ్లు  తనను బాగా చూసుకుంటున్నారని... ప్లాట్‌ఫాం ఊడ్చే మహిళకి  మగబిడ్డ పుట్టాడని... మనవడికి జుబ్బా కొనమని రూ.50 ఇచ్చానని గొప్పగా చెప్పింది.
 
బామ్మ మాట... బంగారు బాట...

 ‘‘మనం ఎప్పుడూ సుఖపడకూడదు. సుఖపడితే ఆ తర్వాత కష్టపడలేం’’ ‘‘పిల్లలు మనల్ని చూస్తారా చూడరా అని లెక్కేయకూడదు. వాళ్లని చక్కగా చదివించాలి. విద్యావంతుల్ని చేయాలి అది మన బాధ్యత’’ ‘‘చేపని పట్టాలని వలవేసేవాడు వానపామును ఎరవేస్తాడు. వానపామును తింటూ చేప సంతోషిస్తుంటే... నిన్ను తినేవాడు పైనున్నాడులే అని వానపాము అనుకుంటుంది. ఎవరి మీదైనా గెలిచానని విర్రవీగితే మనిషైనా అంతే’’ ఇంటి వెనకాల రేగిచెట్టు ఇంటి ముందు పోలీసోడు ఉండకూడదట’’ఇప్పుడు మనుషుల మధ్య కులాల తేడాలు లేవు. మంచోళ్లు చెడ్డోళ్లు రెండే జాతులున్నారు’’చెంప నిమురుతూ... ఆప్యాయంగా ఈ బామ్మ చెప్పే ఇలాంటివే ఎన్నో.. సూక్తులు వింటే గొప్ప పుస్తకాలు చదివిన ఫీలింగ్ కలుగుతుంది. వృద్ధాప్యం వంకతో పెద్దవాళ్లను దూరం చేసుకుంటున్న నేటి తరం ఎన్ని కోల్పోతోందో అర్థమవుతుంది..

 ఏ తల్లి కన్న కూతురో, ఏ బిడ్డను కన్నతల్లో... రెలైక్కే చోటునే తన శేష జీవితానికి నీడగా మార్చుకుంది. ఏమీ కాని వారి మధ్య అంతా తనవారే అనుకుంటూ బతుకు బండిని నడిపిస్తోంది. చివరి మజిలీ వరకూ ఆ ప్రయాణం  ఆమె కోరుకున్నట్టుగా ఆరోగ్యంగా కొనసాగాలని ఆశిద్దాం.
 - ఎస్.సత్యబాబు
 
 ఎఫ్‌బిలో హల్‌చల్...
 గోవాకు చెందిన అభిసాహి ఒక సామాజిక కార్యకర్త ఈ బామ్మ గురించి రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో జంటనగరవాసులు పలువురు ఆమెను కలుస్తున్నారు. ఎవరి దగ్గరా ఏమీ తీసుకోవడానికి ఇష్టపడని చంద్రావతి... అందులో ఏముందో ఏమో గాని తనకున్న బ్యాగ్‌ను మాత్రం ఎవరు ముట్టుకున్నా ఊరుకోదు. ‘‘నాకు డబ్బులెందుకయ్యా? ఏం చేసుకుంటా? ప్రేమగా ఎవరు వచ్చినా మాట్లాడుతా. అందర్నీ నా బిడ్డలే అనుకుంటా’’ అంటుందామె.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement