ఏది తేలిక?!
చట్టం
వింత చూడండి... కమిలిన కన్నుతో వెళ్లి ఏ ఆడకూతురైనా కేసు వేయడం తేలిక. అదే ఆడకూతురు తన ఇష్టం లేకుండా భర్త తనపై పదే పదే లైంగిక చర్యకు పాల్పడుతున్నాడని చెప్పినప్పుడు మాత్రం ఏ చట్టమూ వినదు, ఏ సెక్షనూ పట్టించుకోదు. ఏమిటి పరిష్కారం? చట్టాలు మారాలి. లేదా మగాళ్లు మారాలి. ఏది తేలిక?
ఇండియాకు ఒక ‘రేప్ లా’ ఉంది. అయితే ఆ ‘లా’ లో భారతీయ వివాహితకు (భర్త జరిపే అత్యాచారం నుంచి) మాత్రం రక్షణ లేదు! ఇందుకు తాజా నిదర్శనం జస్టిస్ వీరేందర్ భట్ ఇచ్చిన తీర్పు. ‘‘తాగొచ్చి అత్యాచారం చేసినప్పటికీ అతడు భర్త కనుక, ‘రేప్ లా’ పరిధిలోకి ఈ కేసు రాదు కనుక నిందితుడు నిర్దోషిగా భావించడమైనది’’ - ఇదీ తీర్పు సారాంశం.
అంటే భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకోవడం వైవాహిక సంస్కృతిలో ఒక భాగం అనుకోవాలా?! మనసా వాచా కర్మణా అతడు ఆమెను శారీరకంగా లోబరచుకోవడం అన్నది దాంపత్యంలో సహజం, సర్వ సాధారణం అని సరిపెట్టుకోవాలా?! ‘‘దేశంలోని అత్యధిక శాతం వివాహితల లైంగిక హక్కును ఈ తీర్పు నిరాకరిస్తోంది. భారతీయ న్యాయ వ్యవస్థ వైఫల్యానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు’’ అని స్త్రీవాదులతో పాటు, సామాన్య మహిళలూ దేశవ్యాప్తంగా ఆవేదనతో ఎలుగెత్తారంటే ఇదెంత దురదృష్టకరమైన తీర్పో చూడండి.
అసలేం జరిగింది?
గత ఏడాది మార్చిలో వికాస్ అనే వ్యక్తి ఒక యువతిని ఢిల్లీ శివార్లలోని ఘాజియాబాద్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ‘తీసుకువచ్చాడు’. అప్పటికి ఆమె పూర్తి స్పృహలో లేదు. ఆ స్థితిలోనే ఆమె చేత పెళ్లి పత్రాలపై అతడు సంతకాలు చేయించాడు. తర్వాత ఆమెను ‘తీసుకెళ్లి’ మరికాస్త మత్తుమందిచ్చి అత్యాచారం జరిపి, పారిపోయాడు. ఇదీ బాధితురాలి వాదన. కాదు, గోడు.
ఇక జడ్జిగారు. ‘‘వికాస్ తాగినట్లు కానీ, తన భార్యకు మత్తుమందు ఇచ్చినట్లుగానీ సాక్ష్యాధారాలు లేవు కనుక అతడు నిర్దోషి అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అతడు నిజంగానే తన భార్యపై అత్యాచారం జరిపి ఉన్నప్పటికీ ఆ చర్యను ఇండియన్ రేప్ లా ప్రకారం నేరంగా పరిగణించడానికి లేదు’ అని రూలింగ్ ఇచ్చేశారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో (నిర్భయ కేసులో) దేశ ప్రజలంతా ఎన్నడూ లేనంతగా ఆగ్రహోదగ్రులయ్యాక మన దేశం ‘రేప్ లా’ ను మరింత శక్తిమంతం చేసింది. చేసి సరిగ్గా ఏడాది. ఇంతలోనే ఆ శక్తిని అవహేళన చేస్తున్నట్లుగా భట్ గారి తీర్పు! ‘రేప్ లా’ ను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేసే పనిని ప్రభుత్వం అప్పట్లో జస్టిస్ వర్మ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అప్పగించింది.
ఆయన ఇప్పుడు లేరు. చనిపోయారు. పోతూ పోతూ అన్నట్లుగా, భర్త జరిపే అత్యాచారాన్ని కూడా నేరంగా పరిగణించాలని సిఫారసు చేశారు. అయితే వర్మ కమిటీ చేసిన ఈ సిఫారసు తిరస్కారానికి గురయింది! భారతీయ కుటుంబ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉంటాయి కనుక భర్త జరిపే అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే... తప్పుడు కేసులు ఎక్కువై మొత్తానికి వైవాహిక వ్యవస్థే దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్న భయంతో న్యాయ పండితులు ఈ ఒక్క క్లాజును ‘రేప్ లా’ లో చేర్చలేకపోయారు.