‘హోల్ లంగ్ లావేజ్’తో మీ జబ్బు నయం! | Whole Lung lavej' cure your disease! | Sakshi
Sakshi News home page

‘హోల్ లంగ్ లావేజ్’తో మీ జబ్బు నయం!

Published Tue, Feb 2 2016 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

Whole Lung lavej' cure your disease!

హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 42  ఏళ్లు. నేను గృహిణిని. నాకు కొంతకాలంగా రెండు చేతి వేళ్లలో, మోకాళ్లలో విపరీతమైన నొప్పులు, వాపులు ఉన్నాయి. ఉదయాన్నే కొంత సేపటిదాకా ఏ పని చేసుకోలేకపోతున్నారు. డాక్టర్‌ను సంప్రదిస్తే రక్త పరీక్ష చేయించి,నాకు వచ్చి వ్యాధి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్థారించారు. అంటే ఏమిటి? దీనికి పరిష్కారం ఉందా? సలహా ఇవ్వగలరు.
 - లక్ష్మి, కాకినాడ

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను వాడుక భాషలో ‘వాతం’ అంటారు. జీవక్రియల అసమతుల్యత వల్ల మన రోగనిరోధక శక్తే మన పట్ల ప్రతికూలంగా పని చేయడం వల్ల ఇది వస్తుంది.

కారణాలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి గల కచ్చితమైన కారణాలు లేవు. ఇది కొన్ని ఇన్‌ఫెక్షన్స్ వల్ల, వాతావరణ మార్పుల వల్ల, వంశపారంపర్యంగా, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంది.
 
లక్షణాలు:  ఈ వ్యాధి ప్రభావం మన కణజాలంతో పాటు అవయవాలపై కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా కీళ్లపై (సైనోవియల్ జాయింట్స్) వ్యాధి మరింతగా ప్రభావం చూపుతుంది  కీళ్లలో ఉండే సైనోవియల్ మెంబ్రేన్ క్రానిక్ (ఎక్కువ కాలం) ఇన్‌ఫ్లమేషన్‌కు గురి కావడం వల్ల కీళ్ల వాపు, నొప్పి, వేడిగా అనిపిం చడం వంటి లక్షణాలు కనపడతాయి  శరీరంలోని ఇరుప్రక్కలా ఉండే ఒకే రకం కీళ్లలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించడం అన్నది ఈ వ్యాధి ముఖ్య లక్షణం  లక్షణాలు ముందుగా చిన్న కీళ్లు అయిన కాలివేళ్లు, చేతివేళ్లు, మణికట్టు, ఆ తరువాత పెద్ద కీళ్లైన భుజాలు, మోకాలు, తుంటి... ఈ వరుసలో వ్యాపిస్తుంటాయి  ఉదయాన్నే నిద్ర లేవగానే కీళ్లు బిగుసుకుపోయి సాధారణ కదలికలకూ సాధ్యం కాని విధంగా ఉంటాయి. కొంత సమయం తర్వాత నిదానంగా అవి వదులవుతాయి  కీళ్లపై చర్మం చిన్న కణుతుల్లా ఏర్పడతాయి. వీటినే ‘రుమటాయిడ్’ నాడ్యూల్స్’ అంటారు  ఈ వ్యాధి బారిన పడ్డవారిలోని రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి (అథెరో స్ల్కీరోసిస్) గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైన తెలిపిన లక్షణాలే కాకుండా జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రక్తహీనత మొదలైన ఇతర లక్షణాలు ఉండవచ్చు.
 
హోమియో చికిత్స:
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఈ జబ్బుకి ఇతర చికిత్సా విధానాలలో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభ్యమౌతుంది. అయితే రోగి వ్యక్తిగత లక్షణాలు, స్వరూప స్వభావాల ఆధారంగానే మందులు సూచించాల్సి ఉంటుంది.
 
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్
 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 65 ఏళ్లు. గత పదేళ్లుగా డయాబెటిస్ ఉంది. నా రక్తపరీక్షలో క్రియాటినిన్ 1.5 ఎంజీ/డీఎల్ ఉంది. నేను హైపర్‌టెన్షన్, థైరాయిడ్, గుండెజబ్బు వంటి వాటితో  బాధపడుతున్నాను. ఇవన్నీ మూత్రపిండాలకు ముప్పుగా పరిణమిస్తాయా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
 - డానియెల్, వసాయ్ (మహారాష్ట్ర)

 మీరు రాసిన వివరాలను బట్టి, మీరు డయాబెటిస్ ఉండటంతో పాటు మీరు పేర్కొన్న క్రియాటినిన్ మోతాదులను బట్టి ముందుగా మీరు నేత్ర వైద్యుణ్ణి సంప్రదించి, రెటీనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డయాబెటిస్ వల్ల రెటీనా దెబ్బతిని ఉంటే మూత్రంలో ప్రోటీన్ కూడా పోయే అవకాశం ఉంది. ఈ సమస్యలు ఉన్నవారు మూత్రపిండాలు దెబ్బతినకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలి. తినకముందు బ్లడ్‌షుగర్ 110 ఎంజీ/డీఎల్ లోపు, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బీపీ 125/75 లోపల ఉండేలా చూసుకోండి. ఇక బ్లడ్ కొలెస్టరాల్ కూడా 150 ఎంజీ/డీఎల్ లోపు ఉండేలా జాగ్రత్తపడాలి. అవసరమైతే దీనికి సంబంధించిన మందులు వాడాలి. ఆహారపదార్థాలలో ఉప్పు బాగా తగ్గించాలి. మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. డాక్టర్ సూచించకుండా మీ అంతట మీరే  పెయిన్‌కిల్లర్స్ కూడా వాడకూడదు.
 
నా వయసు 38 ఏళ్లు. నాకు మూత్రవిసర్జన సమయంలో మంట అనిపిస్తోంది. తరచూ జ్వరం కూడా వస్తోంది. గైనకాలజిస్ట్‌ను సంప్రదించి మందులు వాడితే తగ్గిపోతోంది.  నెలలోపే మళ్లీ జ్వరం, మూత్రంలో మంట కనిపిస్తున్నాయి. దీని నుంచి బయటపడటం ఎలాగో చెప్పండి.
 - వనజ, రాజమండ్రి

 మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇలా మీలో మాటిమాటికీ సమస్య తలెత్తడానికి కారణాలేమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మీకు డయాబెటిస్ ఉందో, లేదో రాయలేదు. ఒకవేళ డయాబెటిస్ ఉన్నట్లయితే తరచూ ఇలా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది ముందుగా మీరు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించి, మూత్రపిండాలలో రాళ్లుగానీ, మూత్రనాళాలలో వాపుగానీ లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఒక్కోసారి మీరు మీ డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్ కోర్సు పూర్తి చేయకపోయినా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మూడు నెలల పాటు యాంటీబయాటిక్ కోర్సు వాడాలి. మీరు మంచినీళ్లు ఎక్కువగా తాగండి. మూత్రం వచ్చినట్లు అనిపించిన వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి.
 
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
పల్మనాలజీ కౌన్సెలింగ్
 
 నా వయసు 30 ఏళ్లు. నేను మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఏడాదిగా నేను తీవ్రమైన ఆయాసంతో బాధపడుతున్నాను. ఒక్కోసారి ఊపిరి కూడా తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నాను. ఈమధ్య సమస్య తీవ్రం కావడంతో దగ్గర్లోని ఆస్పత్తిలో అడ్మిట్ అయ్యాను. డాక్టర్లు టెస్టులన్నీ చేసి లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఉందని, కొంతకాలం మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. ఇంతకాలం మందులు వాడుతున్నా నా సమస్య ఇంకా తీవ్రమవుతోంది గానీ తగ్గడం లేదు. ఈమధ్యే ఒక సీనియర్ చెస్ట్ ఫిజీషియన్‌ను కలిస్తే ‘లంగ్ లావేజ్’ చేయడం ద్వారా నా ఆరోగ్యం బాగవుతుందని చెప్పారు. దయచేసి దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయగలరు.
 - శ్రావణ్, హైదరాబాద్

 మీరు వివరించిన అనారోగ్య లక్షణాలను పరిశీలిస్తే మీకు ‘పల్మనరీ అల్వియోలార్ ప్రొటియినోసిస్’ అనే అరుదైన లంగ్ వ్యాధి సోకినట్టు అనుమానంగా ఉంది. చాలా అరుదుగా వచ్చే దీని వల్ల ఊపిరితిత్తుల్లో ప్రొటీన్ చేరుతుంది. దీంతో వాటి పనితీరు దెబ్బతింటుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. చెస్ట్ సీటీ స్కాన్, బ్రాంకోస్కోపీ, లంగ్ బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయాలి. దీనిని వీలైనంత త్వరగా నివారించాలి. ఇందుకోసం ఏ లంగ్‌లో ప్రోటీన్ చేయిందనే విషయాన్ని మళ్లీ పరీక్షల ద్వారా తెలుసుకొని అందుకు తగినట్లుగా చికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ‘పల్మనరీ అల్వియోలార్ ప్రొటియినోసిస్’ అనే వ్యాధిని ‘హోల్ లంగ్ లావేజ్’ ప్రక్రియ ద్వారా సమూలంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స విధానం దాదాపు రెండు వారాల పాటు ఉంటుంది. ఒకవేళ మీకు ఒకే లంగ్‌లో ప్రొటీన్ ఉత్పత్తి ఉంటే ఆ ఊపిరితిత్తిని మాత్రమే శుభ్రపరిస్తే సరిపోతుంది. ఇందుకు పదిరోజుల పాటు మీరు ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా రెండు ఊపిరితిత్తులకూ ఈ వ్యాధి సోకినట్లు పరీక్షల ద్వారా తేలితే మాత్రం రెండూ క్లీన్ చేయాలి. మొదటి విడతలో ఒక లంగ్‌ను మాత్రమే శుభ్రపరుస్తాం. ఆ ఊపిరితిత్తిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత ఛాతీ ఫిజియోథెరపీ నిర్వహించి లంగ్‌ను డ్రై చేస్తాం. ఈ ప్రక్రియ ఆరు గంటల పాటు కొనసాగుతుంది. అనంతరం వారం గ్యాప్ ఇచ్చి రెండో లంగ్‌ను కూడా మొదటి లంగ్‌కు కొనసాగించిన విధానాన్నే పాటిస్తాం. మీరు అధైర్యపడకుండా ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అనుభవిస్తున్న బాధ నుంచి త్వరగా ఉపశమనం పొందండి.
 
డాక్టర్ ఎమ్.వి. నాగార్జున
సీనియర్ పల్మనాలజిస్టు,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ,
హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement