పొట్ట ఉబ్బటం కిడ్నీ సమస్యకు సంకేతమా?
నాకు 55 ఏళ్లు. మొదట్నుంచీ నేను కొంచెం లావుగానే ఉంటాను. కానీ ఈమధ్య కాలంలో పొట్ట మాత్రం విపరీతంగా ముందుకు వస్తూ ఉంది. ఉదయం వేళల్లో కాళ్ల వాపు, ముఖం వాపు కూడా ఉంటోంది. గత 20 ఏళ్లుగా నాకు మద్యం అలవాటు ఉంది. నా స్నేహితులంతా కిడ్నీ చెడిపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడతాయని అంటున్నారు. ఇతరత్రా నాకు ఎలాంటి సమస్యా లేదు. గత మూడేళ్లుగా హైబీపీ కూడా ఉంది. నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? పొట్ట విపరీతంగా ఉబ్బితే కిడ్నీ సమస్య ఉన్నట్లా? దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి.
- డి.ఎస్.ఎమ్., కరీంనగర్
సాధారణంగా పొట్టతోపాటు, శరీరం కూడా పెరిగితే స్థూలకాయం అంటారు. కానీ ముఖం మీద, కళ్ల చుట్టూ వాపు రావడం, పాదాల్లో వాపు వంటి లక్షణాలు స్థూలకాయంలో ఉండవు. కిడ్నీ, గుండె, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నవాళ్లలో మాత్రమే ఇలాంటి వాపు కనిపిస్తుంటుంది. ఒకవేళ పై సమస్యల కారణంగా పొట్టలో కూడా నీరు చేరితే, పొట్ట ఉబ్బుతుంది. ఈ కండిషన్‌ను అసైటిస్ అంటారు.
అయితే ఈ కండిషన్‌లో కాళ్లూ, చేతులు స్థూలకాయంలో ఉన్నంత లావుగా ఉండకుండా, మామూలుగానే ఉంటాయి. కిడ్నీ సమస్య ఉన్నవాళ్లలో పొట్ట వాపు కంటే కళ్ల చుట్టూ వాపు ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి క్రియాటినిన్ అనే కిడ్నీ పరీక్ష, ఎల్.ఎఫ్.టి. అనే కాలేయ పరీక్ష, ఎకో-కార్డియోగ్రామ్ అనే గుండె పరీక్ష చేయించుకుంటే... మీ లక్షణాలు దేనికి సంబంధించినవో తెలుస్తుంది. మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి, పై పరీక్షలు చేయించుకోండి.
డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్