కిడ్నీలో ఈ నీటిబుడగలేమిటి..? | Water bubbles in kidney? | Sakshi
Sakshi News home page

కిడ్నీలో ఈ నీటిబుడగలేమిటి..?

Published Fri, Aug 30 2013 12:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

కిడ్నీలో ఈ నీటిబుడగలేమిటి..?

కిడ్నీలో ఈ నీటిబుడగలేమిటి..?

 నాకు 45 ఏళ్లు. ఈమధ్యకాలంలో బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. దాంతో హెల్త్ చెక్ అప్స్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ‘కిడ్నీ పనితీరు కొంచెమే మారింది, పెద్దగా ప్రమాదమేమీ లేద’న్నారు. అసలీ నీటి బుడగల జబ్బేమిటి? నాకు భయమేస్తుంది. మా నాన్నగారు కూడా ఏదో కిడ్నీ సమస్యతోనే చనిపోయారు. ఈ జబ్బు విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అసలు కిడ్నీ చెడిపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నా ఈ జబ్బుకు ఏదైనా ఆపరేషన్ అవసరం ఉంటుందా?
  - సుదర్శన్, వరంగల్  

 
 మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండవచ్చునని అనిపిస్తోంది. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే జబ్బు . ఈ జబ్బు ఉన్నవారిలో 30 ఏళ్ల వయసప్పటి నుంచి 50 ఏళ్ల మధ్యన మూత్రపిండాల్లో నీటిబుడగలు తయారవ్వడం మొదలవుతుంది. ఈ నీటిబుడగల సంఖ్య, పరిమాణం పెరిగేకొద్దీ కిడ్నీ సైజ్ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల కిడ్నీ కండ తగ్గడానికి అవకాశం ఉంటుంది. క్రమేపీ నీటిబుడగల సంఖ్య పెరగడం వల్ల కిడ్నీ పనితీరు కూడా నెమ్మదిగా మందగిస్తూ పోతుంది.
 
 ఈ జబ్బుకు నిర్దిష్టంగా ఏ మందులూ లేకపోయినా, బీపీని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు తక్కువ మాంసకృత్తులను తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరును కాపాడుకోవచ్చు. ఈ జబ్బు ఉన్నవారు క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్ స్కాన్, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుంటూ, మూత్రపిండాల వ్యాధి నిపుణులను సంప్రదిస్తూ ఉండటం అవసరం. ఈ జబ్బు ఉన్నవారు దీన్ని నిర్లక్ష్యం చేసినా కిడ్నీ పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీర్ఘకాలం పాటు సాధారణజీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఆందోళన చెందకండి.
 
 నాకు 56 ఏళ్లు. పదేళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నాను. ఇటీవల పురుషాంగం మీద చర్మం పగిలినట్లుగా ఉండి, మంటగా ఉంటోంది. చర్మం కూడా ఫ్రీగా వెనక్కి రావడం లేదు. షుగర్ అప్పుడప్పుడూ 200 పైన కూడా ఉంటోంది. దీనివల్ల సెక్స్‌లో కూడా ఇబ్బంది కలుగుతోంది. దయచేసి ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి.
 - డి.ఆర్.ఎస్., నందిగామ

 
 షుగర్ ఉన్నవారిలో పురుషాంగం చివరన ఉన్న చర్మానికి ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావడం చాలా సాధారణంగా జరిగేదే. ఇలా జరిగినప్పుడు ఒకటి రెండుసార్లు యాంటీఫంగల్, యాంటీబయాటిక్ మందులు వాడినప్పటికీ ఇలాగే జరుగుతుంటే సున్తీ ఆపరేషన్ చేయించుకుంటే దీర్ఘకాలికంగా ఉపయోగం ఉంటుంది. పురుషాంగం చర్మం వెనక్కి రానివారిలో లోపల మూత్రనాళం (యురెథ్రా) కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా సున్తీ ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సలహా ఇస్తాం. మీరు మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
 నాకు పెళ్లయి ఏడాది అయ్యింది. పెళ్లయిన మొదటి రెండు రోజులు జంకుతో నేను సెక్స్‌లో పాల్గొనలేకపోయాను. తర్వాత కూడా సెక్స్ చేయబోతే అంగస్తంభన సరిగా కాలేదు. మొదట్లో ఏమీ అనకపోయినా ఇటీవల నా భార్య నా పట్ల చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకేమో కొద్దిగా అంగస్తంభన అయి మళ్లీ చాలా త్వరగా  వీర్యస్ఖలనం అయిపోతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
 - డి.ఎన్.పి., సత్తుపల్లి

 
 సాధారణంగా పెళ్లయిన కొత్తలో కాస్త బెరుకుగా ఉన్నా, దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగాక అంగస్తంభన మామూలుగానే జరిగిపోవాలి. కానీ చాలా సందర్భాలలో మానసిక కారణాల వల్లగాని, ఒకరిపై మరొకరికి పూర్తిగా ఇష్టం కలగకపోవడం వల్లగాని, పార్ట్‌నర్స్ మధ్య మనస్పర్థల వల్లగాని ఇలా మీకు జరిగినట్లుగా అంగస్తంభన పూర్తిగా జరగకపోవడం, వీర్యం త్వరగా పడిపోవడం వంటివి  జరగవచ్చు. అందువల్ల మీరు సెక్స్ కౌన్సెలింగ్ చేయించుకుని, సెక్స్‌లో పాల్గొనండి. అప్పటికీ ప్రయోజనం లేకపోతే సెక్స్‌ను ప్రేరేపించే మందులు వాడటం వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది. మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
 నా వయసు 36 ఏళ్లు. గత రెండేళ్లుగా మూత్రంలో విపరీతమైన వుంట. నాకు మూత్రధార సరిగా రావడం లేదు. సెక్స్ చేసినప్పుడు వీర్యం సరిగా రావడం లేదు. పై సమస్యలతో తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాను. సెక్స్ చేసినా, మూత్రం పోసినా పొత్తికడుపులో బిగదీసుకుపోయినట్లుగా ఉంటోంది. దాంతో సెక్స్ అంటేనే భయుమేస్తోంది. పెళ్లికి ముందు కండోమ్ లేకుండా చాలాసార్లు చాలావుంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నాను. అప్పుడు అలా చేయడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయేమోనని యూంటిబయూటిక్స్ ఎక్కువగా మింగుతున్నాను. నాకు వుంచి సలహా ఇవ్వండి.
 - ఆర్.కె.ఆర్., విజయవాడ

 
 మీరు ముందుగా ఇరట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్ (ఆర్‌జీయూ) అనే పరీక్ష చేయించుకోవాలి. దీనిల్ల మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి(బ్లాక్) ఉందేమో తెలుస్తుంది. అలా ఉంటే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా మూత్రనాళాన్ని వెడల్పు చేయించుకుంటే మూత్రం, వీర్యం రెండూ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
 డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement