స్త్రీలోక సంచారం | Woman's Wandering | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Sun, Sep 23 2018 11:49 PM | Last Updated on Mon, Sep 24 2018 12:06 AM

Woman's Wandering - Sakshi

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 2019 ఆస్కార్‌ పోటీలకు భారతదేశం నుంచి అధికారికంగా ప్రవేశం పొందిన అస్సామీ చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్‌’ దర్శకురాలు రీమా దాస్‌.. తన చిత్రం ప్రచారం కోసం డబ్బుల వేటలో పడ్డారు. సొంత గిటార్‌ సంపాదించుకుని, స్థానిక బాలురతో మ్యూజిక్‌ బ్యాండ్‌ ఏర్పాటు చేయాలని కలలుగన్న ధను అనే పదేళ్ల బాలికలోని తపనను కథాంశంగా తీసుకుని, చేత్తో పట్టుకుని తీసే కెమెరాతో అస్సాంలోని పల్లె ప్రాంతాలలో రీమా దాస్‌ చిత్రీకరించిన ‘విలేజ్‌ రాక్‌స్టార్‌’ ఇప్పటివరకు కనీసం 40 దేశాలలో ప్రదర్శనకు, అభినందనలకు నోచుకుంది.

ఒక కేరళ నన్‌పై పలుమార్లు అత్యాచారం జరిపి, అసహజమైన లైంగిక అకృత్యాలకు పాల్పడిన బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ కేరళ కోర్టు ఇచ్చిన రెండు రోజుల పోలీసు కస్టడీ ఈరోజు మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ముగుస్తోంది. బిషప్‌ అప్పటికే మూడు రోజుల పోలీస్‌ కస్టడీలో ఉన్నందున అతడికి ఈ రెండు రోజుల కస్టడీ నుంచి మినహాయింపును ఇవ్వాలని లాయర్లు కోరగా.. ఆ మూడు రోజులూ బిషప్‌కు సామర్థ్య నిర్ధారణ పరీక్ష చేయడానికి, అతడి ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్, దుస్తులు స్వాధీనం చేసుకోడానికి సరిపోయినందున.. అనంతర విచారణ కోసం మళ్లీ ఒకసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరఫు న్యాయవాదులు చేసిన వాదనకు అనుకూలంగా మేజిస్ట్రేట్‌ స్పందించారు.

తెలంగాణలో పరువు హత్యల కలకలం ఇంకా సద్దుమణగకుండానే తాజాగా హైదరాబాద్‌కు 80 కి.మీ. దూరంలోని జనగామ పట్టణానికి చెందిన 18 ఏళ్ల అగ్రకుల యువతి, జనగామకు 20 కి.మీ. దూరంలోని పరిపడిగ ప్రాంత ఎరుకల కులస్తుడైన 25 ఏళ్ల యువకుడు.. గుర్తు తెలియని ఒక అటవీ ప్రాంతంలో తామిద్దరూ ఉన్న చోటు నుంచి ఒక వీడియో తీసి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఈ జంటకు వారి కుటుంబాల నుంచి ప్రాణహాని పొంచి ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదే ఇంటర్‌ పూర్తి చేసిన యువతి, రెండు నెలల క్రితం ఆ యువకుడిని కులాంతర వివాహం చేసుకుని జనగాం నుంచి హైదరాబాద్‌ వచ్చి, అక్కడి నుంచి అతడితో కలిసి అటవీ ప్రాంతంలో తలదాచుకుని, తన తల్లిదండ్రుల నుంచి, గ్రామస్తుల నుంచి తమను కాపాడాలని ఆ వీడియోలో విజ్ఞప్తి చేయగా, గ్రామస్తులు మాత్రం ఆ యువకుడు ఇప్పటికే ముగ్గురు అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని, యువతిని అతడి బారిన పడనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కొన్ని జాతీయ ఆంగ్ల పత్రికలు రాశాయి.

అగ్రకుల కుటుంబానికి చెందిన ఓ పదేళ్ల బాలిక చెయ్యి తాకుతూ, చాక్లెట్‌ ఇచ్చిన పదమూడేళ్ల బాలుడిని ఆ బాలిక బంధువులు అతడి ఇంటి నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు.. ఒంటి మీద బట్టలు తీసి, కొట్టుకుంటూ, దిగంబరంగా నడిపించుకుంటూ వెళ్లిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే బాలిక బంధువులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై  ఎస్సీ, ఎస్సీ యాక్ట్‌ 1989 లోని సెక్షన్‌ 452, సెక్షన్‌ 323, సెక్షన్‌ 506 కింద కేసులు నమోదు చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ¯ð లకొంది.

2022లో అంతరిక్షంలోకి మనిషిని పంపే భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’కు డైరెక్టర్‌గా వి.ఆర్‌.లలితాంబిక ఎంపిక అయ్యారు. ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌)లో వంద మిషన్‌ల అనుభవం ఉన్న సీనియర్‌ సైంటిస్ట్‌ లలిత (56) 2017 ఫిబ్రవరి 15న భారతదేశం రికార్డు స్థాయిలో నింగిలోకి 104 ఉపగ్రహాలను పంపించిన ప్రాజెక్టులో కూడా కీలక పాత్ర పోషించారు.

రుడాలి, చింగారి, ఏక్‌ ఫల్‌ దామన్‌ : ఎ విక్టిమ్‌ ఆఫ్‌ మార్షల్‌ వయలెన్స్‌తో పాటు ఇంకా అనేక స్త్రీవాద చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందిన బాలీవుడ్‌ దర్శకురాలు కల్పనా లజ్మీ (61) ఆదివారం తెల్లవారుజామున మరణించారు. 2006లో మిథున్‌ చక్రవర్తి, అంజు సహానీ, సుస్మితా సేన్‌లతో తన ఆఖరి సినిమా ‘చింగారి’ని తీసిన కల్పన ఏడాది కాలంగా కిడ్నీ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, కరణ్‌ జోహార్, ఆలియాభట్, సోనీ రాజ్‌ధాన్, నీనా గుప్తా ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు.

భారతదేశపు తొలి మహిళా విమానయాన ఫైర్‌ ఫైటర్‌గా 26 ఏళ్ల తానియా సాన్యాల్‌ తన జన్మస్థల మైన కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్‌లో బాధ్యతలు స్వీకరించారు. విధినిర్వహణలో భాగంగా తానియా.. 161 మందితో కూడిన పురుష బృందంతో జూనియర్‌ అసిస్టెంట్‌గా కలిసి పని చేయడంతో పాటు.. కోల్‌కతా సమీపంలోని నారాయణపూర్‌లో ఉన్న ‘ఫైర్‌ సర్వీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’ (ఎఫ్‌.ఎస్‌.టి.సి.)లో 25 ఏళ్ల అంజలీ మీనా (జైపూర్‌) అనే ఒకే ఒక యువతి సహా 133 మంది యువకులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.

లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ వ్యాక్స్‌ మ్యూజియానికి అనుబంధంగా ప్రపంచ దేశాలలోని ముఖ్యనగరాలతో పాటు ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌
ఇటీవల తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే ఆ మ్యూజియంలో ఉన్న షారుక్‌ఖాన్, విరాట్‌ కోహ్లీ, కత్రీనా కైఫ్‌ వంటి వారితో పాటు తన విగ్రహం కూడా ఉండటంపై సన్నీ లియోన్‌ ఆనందం వ్యక్తం చేస్తూ, విగ్రహం పక్కన నిలబడి తీసుకున్న ఫొటోను ‘ది క్రేజీనెస్‌ అండ్‌ హిస్టీరియా’ అనే కామెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా, ‘షి ఈజ్‌ ది మోస్ట్‌ గూగుల్డ్‌ ఎంటర్‌టైనర్‌ ఇన్‌ ఇండియా’ అని పేర్కొంటూ విగ్రహంతో ఉన్న ఆమె వీడియోను ఇంగ్లండ్‌లోని హఫింగ్టన్‌ పోస్ట్‌ ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement