
♦ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై విచారణ జరిపించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ఇంతవరకు జరిగిన ప్రయత్నాలేమిటో వివరిస్తూ వారం లోపు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చీఫ్ జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైదరాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వేధింపుల విచారణ కమిటీని ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపిస్తూ వి.సంధ్యారాణి, ఇతరులు కలిపి వేసిన రిట్ పిటిషన్ ను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలోని నిష్క్రియాప్రియత్వం వల్ల.. పని చేసే చోట లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఉల్లంఘనకు గురి అవుతోందని పిటిషనర్లు ఆందోళ వ్యక్తం చేయగా.. కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం, లైంగిక వేధింపుల నిరోధానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న చర్యలేమిటో తెలియపరచాలని ఆ రెండు పక్షాలను కోర్టు ఆదేశించింది.
♦ లాన్స్ నాయక్ రంజీత్ సింగ్ భుట్యాల్ భారత సైనికుడు. ఆయన భార్య షిము దేవి గృహిణి. జమ్మూకశ్మీర్ జిల్లాలోని రంబన్ గ్రామం వారిది. పదేళ్ల క్రితం ఇద్దరికీ పెళ్లయింది. పదేళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి వారి ఆశ ఫలించింది. షిము దేవి గర్భిణి అయింది. నవమాసాలు నిండాయి. ఏ క్షణమైనా పురుటినొప్పులు వచ్చేలా ఉన్నాయి. ఈలోపు రంబన్ గ్రామానికి వార్త అందింది.
రాజౌరీ జిల్లా సుందర్‌బని వాస్తవాధీన రేఖ దగ్గర ఆదివారం నాడు పాకిస్థాన్ చొరబాటు దారులతో జరిగిన పోరులో శత్రు మూకల బులెట్‌లకు ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు సైనికులలో లాన్స్ నాయక్ రంజీత్ కూడా ఒకరన్నది ఆ వార్త. మంగళవారం నాడు అంత్యక్రియల కోసం లాన్స్ నాయక్ భౌతిక కాయాన్ని రంబన్ గ్రామానికి తెచ్చారు. ఆ అమరవీరుడి చితికి నిప్పు పెట్టడానికి కొన్ని గంటల ముందు.. ఉదయం 5 గంటలకు షిము దేవి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను చూడకుండా అమరుడైన జవానుకు ఆ గ్రామం నివాళులు అర్పించింది. ఏక కాలంలో సంతోషాన్ని, విషాదాన్ని మోయలేక షిము దేవి సొమ్మసిల్లి పడిపోయింది.
♦ భారతదేశపు మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్.సి.ఎల్. సారథ్యంలోని ‘హెచ్.సి.ఎల్. టెక్’ వైస్ చైర్మన్‌గా రోష్నీ నాడార్ నియమితులయ్యారు. హెచ్.సి.ఎల్. వ్యవస్థాపకులు శివ్ నాడార్ ఏకైక సంతానం అయిన రోష్నీ నాడార్ మల్హోత్రాను హెచ్.సి.ఎల్. టెక్ డైరెక్టర్‌ల బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించింది. 8.2 బిలియన్ డాలర్ల హెచ్.సి.ఎల్. గ్రూపు కంపెనీలలో హెచ్.సి.ఎల్. టెక్ అత్యంత కీలకమైనది.
గతంలో ‘స్కై న్యూస్ యు.కె.’ న్యూస్ ప్రొడ్యూజర్‌గా పని చేసిన రోష్నీ.. ముగ్గురు పిల్లల తల్లి. ప్రస్తుతం ఆమె హెచ్.సి.ఎల్. కార్పోరేషన్ (హెచ్.సి.ఎల్. టెక్, హెచ్.సి.ఎల్. ఇన్ఫోసిస్టమ్స్, హెచ్.సి.ఎల్. హెల్త్‌కేర్) సీఈవోగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. హెచ్.సి.ఎల్. టెక్‌కు నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. వీటన్నిటితో పాటు ఆమె ఇక నుంచీ కొత్త బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. హెచ్.సి.ఎల్. టెక్ ప్రెసిడెంటుగా, సీఈవోగా ప్రస్తుతం సి.విజయకుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment