
ట్రిప్పుని బట్టి బీమా టిప్పులు
ఉమెన్స్ ఫైనాన్స్ / ట్రావెల్ ఇన్సూరెన్స్
సెలవుల్లో విహారానికో, వ్యాపార అవసరాలకో, విద్య తదితర వైజ్ఞానిక పర్యటనలకో దేశంలోని వివిధ ప్రదేశాలకు లేదా విదేశీ ప్రయాణాలకు ప్రణాళిక వేస్తూ ఉంటాం. ఆ ప్రయాణం సవ్యంగా సాగి, అనుకున్న పనులను ముగించుకుంటే బాగానే ఉంటుంది. అయితే ఆ ప్రయాణంలో అవాంతరాలు ఏర్పడితే? వాటిని ఎదుర్కొవడానికి తగిన ఏర్పాట్లు కూడా ముందే చేసుకోవాలి. మరి ఇలా ముందే జాగ్రత్త వహించడం సాధ్యం అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానమే ‘ట్రావెల్ ఇన్సూరెన్స్’. ట్రావెల్ ఇన్సూరెన్స్ సాధారణంగా ఈ కింద తెలియజేసిన వాటికి కవరేజీ అందిస్తుంది. పర్యటన రద్దు (ట్రిప్ క్యాన్సిలేషన్), అంతరాయం (ఇంటరప్షన్).సామాను కోల్పోవడం (బ్యాగేజీ లాస్) అత్యవసర వైద్యం (మెడికల్ ఎమర్జెన్సీ)
వివిధ రకాల ఇన్సూరెన్స్ కంపెనీలు పై చెప్పిన కవరేజీలనే వివిధ రకాల నిబంధనలు, షరతులతో అందజేస్తున్నాయి. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని ఆన్‌లైన్‌లో కూడా పొందవచ్చు. అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకునేటప్పుడు ప్రీమియం ఏది తక్కువగా ఉంటుందో దానిని ఎంచుకోకుండా, ట్రిప్‌కి తగిన కవరేజీని ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ అందిస్తోందో ఆ కంపెనీ ఇన్సూరెన్స్‌ని ప్లాన్‌ని ఎంచుకోవడం మంచిది.
ఏ ట్రావెల్ పాలసీ అయినా, ఆ పాలసీ వేటి వేటిని కవర్ చేస్తోందీ, వేటి వేటిని కవర్ చేయడం లేదు అనే జాబితా ఉంటుంది. ఆ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బంది ఎదురై, క్లెయిమ్ నమోదు చేయవలసి వచ్చినప్పుడు, ఏమేమి ప్రొసీజర్లు ఉంటాయో ఆ క్లెయిమ్ సెటిల్‌మెంటు ప్రాసెస్ గురించి కూడా ఒక అవగాహన ఏర్పచుకోండి. ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా క్లెయిం సెటిల్‌మెంట్ పొందగలుగుతారు.
పాలసీ తీసుకున్నప్పుడు రీఫండ్ ఎలా ఇస్తారో కూడా గమనించండి. ఎందుకంటే ఒక్కోసారి ట్రిప్ మీ వ్యక్తిగత కారణాల వల్ల రద్దు కావచ్చు. కనుక రీఫండ్ ఎంత అందజేస్తారో కూడా తెలుసుకోండి. పాలసీ ప్రీమియం అనేది ట్రావెల్ ఫ్రీక్వెన్సీ, ఎంతమందికి కవరేజి కావాలి? ఏ ప్రదేశానికి వెళుతున్నారు తదితర వివరాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ట్రావెల్ పాలసీని తీసుకునేటప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా వాటిని పాలసీలో నమోదు చెయ్యండి. లేకపోతే కవరేజీ లభించదు.
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’