
ఆ హక్కు మాకులేదా!
వేదిక
‘ఇద్దరూ ఆడపిల్లలే.... రేపొద్దున మిమ్మల్ని ఎవరు చూస్తారు?’ అని అడిగినవారికి అమ్మ చెప్పిన సమాధానం...‘ఆడపిల్లలయితే ఏంటి, మగ పిల్లలయితే ఏంటి? మూడో బిడ్డని పోషించే స్థోమత లేదు మాకు’ అని చెప్పేదట. ఏడాది కిందటే మా అమ్మ చనిపోయింది. నాన్న ఒంటరి అయిపోయారు. నాకు పెళ్లయి పదేళ్లయింది. నా పెళ్లయిన రెండేళ్లకు చెల్లి పెళ్లయింది. చెల్లి గుజరాత్‌లో ఉంటోంది. నేను విజయవాడలో ఉంటున్నాను. నాన్న హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నారు. నాన్న ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే! మొన్నామధ్య చూడ్డానికి వెళ్లినపుడు చాలా నీరసంగా ఉన్నారు.
అమ్మానాన్నలకు పెద్ద వయసు కాదు. గుండెపోటు వల్ల యాభై ఏళ్లు కూడా నిండకుండా కన్నుమూసింది అమ్మ. నాన్న పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బెంగగా ఉంది. ఇక లాభం లేదని...మావారితో నా మనసులోని మాట చెప్పాను. ‘‘ఇద్దరం ఆడపిల్లలం అవడం వల్ల ఈ రోజు నాన్న ఒంటరిగా బతకాల్సి వస్తోంది కదండీ! అమ్మను అందరూ మగపిల్లాడి కోసం చూడమని చెబితే ‘ఎవరైతే ఏంటి?’ అనేదట. కానీ నేను ఆడపిల్లను కావడం వల్లే కదా! నాన్న పరిస్థితి చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాను.
అదే మగపిల్లాడినైతే నా ఇంట్లో పెట్టుకుని కూర్చోబెట్టి పోషించుకునేదాన్ని’’ అన్నాను. ‘‘ఇప్పుడు మాత్రం ఎవరు కాదన్నారు. నీ జీతంలో కొంత డబ్బు మీ నాన్నగారికి పంపు’’ అన్నారు. ‘‘డబ్బు ఆయన దగ్గర కూడా ఉంది కదండీ!’’ అన్నాను. ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. నాకు మా నాన్నగారిని మా ఇంటికి తీసుకురావాలని ఉంది. మా వారికి పెద్ద అభ్యంతరం ఏమీ లేదు. కానీ మా అత్తమామలు ఏమనుకుంటారోనని సందేహిస్తున్నారు. ఆయనకిష్టం లేకుండా నాన్నని తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయోనని నా భయం. మగపిల్లలు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటే...జేజేలు కొట్టే ఈ సమాజం ఆ హక్కునూ, బాధ్యతనూ ఆడపిల్లలకు ఎందుకు ఇవ్వదో నాకు అర్థం కావడం లేదు.
- అనుపమ, విజయవాడ