ఆ ద్రోహాన్ని క్షమించలేను! | womencheated by her Friend | Sakshi
Sakshi News home page

ఆ ద్రోహాన్ని క్షమించలేను!

Published Wed, Feb 11 2015 8:30 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఆ ద్రోహాన్ని క్షమించలేను! - Sakshi

ఆ ద్రోహాన్ని క్షమించలేను!

షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!

 
సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...
 
మధ్యాహ్నం పన్నెండు కావస్తోంది. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది. ఆ సమయంలో ఎవరొచ్చారో అర్థం కాలేదు. వంట పనికి బ్రేక్ ఇచ్చి, చేతిలో ఉన్న గిన్నెని గట్టుమీద పెట్టి పరుగుదీశాను. తలుపు తీసి.. ఎదురుగా ఉన్న మావారిని చూసి ఆశ్చర్యపోయాను. ‘శ్రీధర్... నువ్వా?’ అన్నాను విస్మయంగా చూస్తూ.

శ్రీధర్ మాట్లాడలేదు. విసురుగా లోనికి వచ్చాడు. ల్యాప్‌టాప్‌ని సోఫాలోకి గిరాటేసి, విసవిసా బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. తన ప్రవర్తన వింతగా అనిపించింది. టైమ్ గాని టైములో ఆఫీసు నుంచి వచ్చేశాడు. పైగా అదోలా ఉన్నాడు. ఏం జరిగివుంటుందో అనుకుంటూ లోనికి వెళ్లాను. పక్కన కూర్చుని, ‘అలా ఉన్నావేంటి శ్రీ? ఏదైనా సమస్యా?’’ అన్నాను అనునయంగా. అంతే... అంతెత్తున లేచాడు. ‘ఆపుతావా నీ ప్రశ్నలు? అసలే చిరాగ్గా ఉంది. ఇంకా నా బుర్ర తినకు’... నా మనసు చివుక్కుమంది. కళ్లలో నీళ్లూరాయి.

‘నిన్ను విసిగించాలని కాదు శ్రీ. నువ్వలా ఉంటే చూడలేక అడిగాను. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే’ అంటూ లేచాను. దుఃఖపూరితమైన నా స్వరం విని శ్రీధర్ కాస్త తగ్గాడు. ‘ఏం జరిగిందో తెలియాలి అంతే కదా’ అంటూ గబగబా సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేశాడు. ‘ఇదిగో చూడు’ అంటూ ఫోన్‌ని నా చేతిలో పెట్టాడు. ఏముందోనని ఆతృతగా చూసిన నేను అదిరిపడ్డాను. ‘ఏంటిది శ్రీ?’ అన్నాను విస్తుపోతూ. ‘నా కొలీగ్ ఒకతను రాత్రి వాటిని చూశాడట. ఇవాళ నా దగ్గరకు వచ్చి మరీ చూపించాడు. నా తల కొట్టేసినట్టయ్యింది. అందరూ ఆఫీసులో దీని గురించే డిస్కషన్. సిగ్గేసి ఇంటికొచ్చేశాను. ఈపాటికి అందరూ వాటిని చూసేసి ఉంటారు. నేను బయటికెలా వెళ్లాలి,

అందరినీ ఎలా ఫేస్ చేయాలి? ఛ...’

ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సిగ్గుతో మనసు చితికిపోతోంది. అవమానంతో గుండె రగిలి పోతోంది. ఎవరు చేశారీ పని? ఎందుకు చేశారు? నేనేం చేశానని? ఆలోచనలు మెదడును రంపపు కోత కోస్తుంటే... అక్కడ నిలబడలేక వంటింట్లోకి వెళ్లి పోయాను. దుఃఖం పొంగుకొస్తోంది. ఫేస్‌బుక్‌లో నా గురించి రాసిన పిచ్చి రాతలు, మార్ఫింగ్ చేసిన నా ఫొటోలు కళ్లముందే కదులుతున్నాయి. నేను మంచిదాన్ని కాదని, పెళ్లికి ముందే గర్భం దాల్చి అబార్షన్ చేయించుకున్నానని, ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కూడా నా భర్త కాదని... భగవంతుడా, ఏ ఆడపిల్లా భరించలేని నిందలవి!

ఎవరో పన్నిన ఉచ్చులో నా కాపురం చిక్కు కుంది. ఉన్నట్టుండి నా జీవితం పూర్తిగా మారి పోయింది. నా ముఖం చూడ్డానికి కూడా శ్రీధర్ ఇష ్టపడట్లేదు. నాతో మాట్లాడట్లేదు. ఆఫీసుకు సెలవు పెట్టేశాడు. తలుపులు మూసుకుని గదిలోనే ఉంటు న్నాడు. తనలో తనే కుమిలిపోతున్నాడు. చేయని తప్పుకు మా జీవితాలు బలైపోతున్నాయి. ఎవరో పెట్టిన చిచ్చుకి నా కలలు కాలి బూడిదవుతున్నాయి. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టి తీరాలి. అనుకున్నదే తడవుగా కంప్యూ టర్ ముందు కూర్చున్నాను. జరిగినదంతా వివరిస్తూ హైదరాబాద్ క్రైమ్‌బ్రాంచ్ డీసీపీకి మెయిల్ పెట్టాను.
     
వారం తర్వాత, డీసీపీ గారి నుంచి ఫోన్. ‘ఫేస్‌బుక్‌లో పోస్టింగ్స్ చేస్తున్నవారెవరో తెలిసింది సుధా... మీరు ఓసారి ఇండియా వస్తే మంచిది.’... డీసీపీ అలా అనగానే శ్రీధర్‌ని తీసుకుని ఆఘమేఘాల మీద యూకే నుండి ఇండియా బయలుదేరాను. నా బతుకును నరకప్రాయం చేసిన వ్యక్తిని చూడాలని ఆతృతగా హైదరాబాద్ డీసీపీ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి షాకైపోయాను.

‘రజితా... నువ్వా?’ అన్నాను నమ్మలేనట్టుగా. రజిత మాట్లాడలేదు. డీసీపీ సమాధానమిచ్చారు. ‘ఇదంతా చేసింది తనే మిసెస్ సుధా. ఫేస్‌బుక్‌లో పోస్టింగ్స్ చేస్తోన్న కంప్యూటర్ ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేశాం. పోస్టింగ్స్ మైసూర్‌లో జరుగుతున్నట్టు తేలింది. ఒకసారి నేను మీ ఫ్రెండ్స్ గురించి అడిగినప్పుడు, మీ బెస్ట్ ఫ్రెండ్ రజిత బెంగళూరులో పని చేస్తోందని చెప్పారు కదా. తనకి మైసూర్ వెళ్లే చాన్సెస్ ఎక్కువ ఉండటంతో, తన ఫొటో తీసుకెళ్లి కేఫ్ యజమానికి చూపించాం. గుర్తు పట్టాడు.

 

తను ఆ కేఫ్‌కి వెళ్లినట్లుగా సీసీ టీవీ ఫుటేజులు చెప్తున్నాయి. తను వెళ్లిన తేదీలు, వేళలు... ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌‌స జరిగిన తేదీలు, వేళలతో సరిపోయాయి. దాంతో తనని అరెస్ట్ చేశాం.’... ఆయనలా చెప్తుంటే నా బుర్ర తిరిగిపోయింది. రజిత దగ్గరకు వెళ్లాను. తన చేతులు నా చేతుల్లోకి తీసుకున్నాను. ‘పక్కపక్క ఇళ్లవాళ్లం. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగాం. కలిసే చదువుకున్నాం. స్నేహితులమే అయినా అక్కాచెల్లెళ్లంత అనురాగంతో మెలిగాం. నువ్వు ఇలా చేశావంటే నమ్మలేకపోతున్నాను. చెప్పు రజితా... నామీద నీకెందుకంత కసి? నేనేం చేశాను?’

 నా చేతుల్ని విదిలించికొట్టి, చివ్వున లేచింది రజిత. ‘ప్రాణంగా ప్రేమించిన శ్రీధర్‌ని తన్నుకు పోయావ్. నా మనసును ముక్కలు చేశావ్. ఇంతకంటే ఏం చేయాలి?’... అదిరిపడ్డాను. ‘శ్రీధర్‌ని తన్నుకుపోయానా? తను నీ ప్రాణమా? ఏమంటున్నావే?’ అన్నాను అయోమయంగా. ‘శ్రీధర్‌ని నేను పిచ్చిగా ప్రేమించాను. నా ప్రేమను తనకు చెప్పాలనుకునేలోపు నువ్వు తనని వలలో వేసుకున్నావ్. నీవాణ్ని చేసేసుకున్నావ్. అందుకే నిన్ను తన నుంచి దూరం చేయాలనుకున్నాను. ఫేస్‌బుక్‌లో నీ గురించి చేతికొచ్చినట్టు రాసి పారేశాను.

 

మార్ఫ్ చేసిన ఫొటోలను అప్‌లోడ్ చేశాను. శ్రీధర్ నిన్ను వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవాలి. అదే నాకు కావాలి’... పిచ్చిదానిలా అరుస్తోన్న రజిత వైపు కొయ్యబొమ్మలా చూస్తూండి పోయాను. నా కళ్లు అప్రయత్నంగానే వర్షించడం మొదలుపెట్టాయి. శ్రీధర్ మీద రజిత ఆశలు పెంచుకున్న విషయం నాకు తెలియదు. ముగ్గురం కాలేజీలో ఫ్రెండ్స్. శ్రీధర్ నాకు ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేశాను. ఇవన్నీ రజిత స్వయంగా చూసింది. మా పెళ్లిలో దగ్గరుండి తనే అన్నీ చేసింది. అలాంటిది ఈ రోజు ఇలా...

ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దాన్ని ఏం అనడానికీ నోరు రాలేదు. ‘అది స్నేహితురాలికి ద్రోహం చేయగలదేమో, తన బెస్ట్ ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయగలదేమో. కానీ నేనలా చేయలేను. కేసు విత్‌డ్రా చేసుకుంటున్నాను. తెలియక చేసిన తప్పు అనుకుని మీరు కూడా తనని వదిలేయండి’ అని డీసీపీతో చెప్పి వచ్చేశాను. ఆ తర్వాత చాన్నాళ్లపాటు నా మనసు రజిత చుట్టూనే తిరిగింది. శిక్ష పడనీయకుండా కేసు విత్‌డ్రా చేసేకున్నాను కానీ... స్వార్థంతో, అసూయతో తను మా స్నేహానికి తల పెట్టిన ద్రోహాన్ని మాత్రం క్షమించలేకపోయాను. బహుశా నా స్థానంలో ఎవరున్నా క్షమించగలిగే వారు కాదేమో!
 - సుధ (గోప్యత కోసం పేర్లు మార్చాం)
 ప్రెజెంటేషన్: సమీర నేలపూడి
 
ఫేస్‌బుక్ అనేది బంధాలను కలుపుకోవడానికి రూపొందింది. కానీ దానివల్ల బాంధవ్యాలు చెడిపోవడం చాలాసార్లు జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈ ఉదంతమే. స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేయడానికి ఫేస్‌బుక్‌ను వాడుకుందా అమ్మాయి. పోస్టింగ్‌‌స చేసిన ఐపీ అడ్రస్ ద్వారా తనని పట్టుకున్నాం. అయితే బాధితురాలు కేసు విత్‌డ్రా చేసుకోవడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశాం. మనం ఎవరో అవతలి వారికి తెలియదు కదా అని ఫేస్‌బుక్ ద్వారా పలువురు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే నేను ఫేస్‌బుక్‌ని ఫేస్‌లెస్ బుక్ అంటుం టాను. ఫేస్‌బుక్ విషయంలో అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పాస్‌వర్డ్ ఎవరికీ చెప్పకూడదు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు అందరికీ షేర్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అసభ్యకరమైన రాతలు రాస్తున్నా, ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నా, ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు విషయం చెప్పడం మంచిది.
 
జి.పాలరాజు
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్
క్రైమ్ బ్రాంచ్
హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement