ఆడదే ఆధారం
నాటి సినిమా
పురుషుడు స్త్రీకి ఈ ప్రపంచంలో ఒక చిన్న ప్రపంచం కేటాయింటాడు. దాని పేరు ఇల్లు. స్త్రీ ఇంట్లో ఉండాలి. సాటి స్త్రీని ఇంట్లో ఉంచాలి. ఇంటి రాజకీయాలలో ఒకరితో ఒకరు తలపడుతూ ఉండాలి. రెండు గదులు, ఒక హాలు, చిన్న వరండా... ఇదే సామ్రాజ్యం అనుకుంటూ దానిలో ఆధిపత్యం కోసం ఒక స్త్రీ మరో స్త్రీతో వాదనకూ యుద్ధానికీ పీడనకూ దిగాలి. చాలాసార్లు పురుషుడు ఈ యుద్ధానికి దూరంగా ఉంటాడు. ఈ పాపంతో తనకు సంబంధం లేదు అన్నట్టుంటాడు. ఎందుకంటే అతడికి బయట పెద్ద ప్రపంచం ఉంది. అందులో అతడు హాయిగా తిరుగుతుంటాడు. కాని స్త్రీ మాత్రం? ఇంట్లోనే తాను వేదన అనుభవిస్తూ ఒకరికి వేదన కలిగిస్తూ... ‘ఆడదే ఆధారం’ సినిమా పురుష ప్రపంచంలో స్త్రీల సగటు మానసిక స్థితిని చెబుతుంది. అత్తగా ఉండే స్త్రీ కోడలని వేధించాలని, కోడలుగా ఉండే స్త్రీ అత్తామామలను నిర్లక్ష్యం చేయాలని నమ్ముతూ సమాజం కల్పించిన చట్రంలో స్త్రీలు ఎంత దారుణంగా కొట్టుకుపోతున్నారో చూపుతుంది. ఇందులో ఒక కోడలు (ముచ్చెర్ల అరుణ). ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఉద్యోగం చేస్తూ సంపాదిస్తోంది కనుక ఇంట్లో దర్జాగా ఉండాలని భావిస్తుంది. అత్తమామలను పనివాళ్ల కింద జమ చేస్తుంది. భర్త ఈ విషయాన్ని చూసీ చూడనట్టుగా ఉంటాడు.
వాదన చేస్తే భార్య పెద్ద గొడవకు దిగుతుందని భయం. వీళ్ల పక్క వాటాలోనే ఒక అత్తగారు (పి.ఆర్.వరలక్ష్మి) ఉంటుంది. ఈమె తన ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేస్తుంది. కోడలు (సీత) ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెకు సంతోషం లేదు. ఎందుకంటే కోడలు తేవాల్సిన కట్నాన్ని ఇంకా తేలేదు. బాకీ ఉంది. అందువల్ల అత్త కోడలని వేధిస్తూ ఉంటుంది. ఆమెను గర్భం దాల్చవద్దని ఆజ్ఞాపిస్తుంది. అయినప్పటికీ గర్భం వస్తే అబార్షన్ చేయించాలని చూస్తుంది. చివరకు కోడలితోనే తెగదెంపులు చేసుకునేదాకా వెళుతుంది. ఆ ఇంట్లో ఒక కోడలి వల్ల సుఖం లేదు. ఈ ఇంట్లో ఒక అత్త వల్ల సంతోషం లేదు. వీరి మనసులు, మెదడులు ఇంత ‘నేరో’గా కావడానికి కారణం ఎవరు అని మనం ఆలోచించాలి. కోడలికి అత్త శత్రువు, అత్తకు కోడలు శత్రువు అని ఎవరు నిర్థారణ చేశారు? మగవాడు కాదా? కాని అందరు మగవాళ్లు ఒకేలా ఉండరు. ఈ కథలోనే ఒక రేడియో మామ (విసు) ఉంటాడు. ఈయన రిటైరైన పెద్ద మనిషి. అయితై రిటైరైనవాడు రిటైరైనట్టు ఉండక కొడుకూ కోడలి (చంద్రమోహన్, రాజ్యలక్ష్మి)తో ఏ కాలనీకి వెళితే ఆ కాలనీలో చుట్టు పక్కల ఆడవాళ్ల కష్టాలను తీర్చే పని పెట్టుకుంటాడు. అతడి దృష్టి ఈ కాలనీకి రాగానే పొరుగన ఉన్న అత్తగారిపైన, పై పోర్షన్‌లో ఉన్న కోడలి మీద పడుతుంది. వారిని అతడు ఎలా సరిదిద్దాడో అనేది కథ.
అయితే అత్తాకోడళ్లందరూ ఇలాగే ఉంటే ఈ సినిమాకు విలువ లేదు. ఈ సినిమాలోని రేడియో మామ కోడలు పరిణితి కలిగిన స్త్రీ. మామగారు స్త్రీల పట్ల ఆర్తి చెందితే ఆయనకు ఆమె ఆలంబనగా నిలుస్తుంది. అలాగే మరో మురికివాడలో ఇద్దరు అత్తాకోడళ్లు ఉంటారు. తండ్రీ కొడుకులు తాగి తందనాలాడుతూ ఉంటే ఈ అత్తాకోడళ్లు ఎంతో సహనంతో సంయమనంతో ఒకరికొకరు మద్దతుగా ఉంటూ కాపురాన్ని నిలబెట్టుకుంటూ వస్తారు. మగాడు నిస్సహాయంగా ఉన్నా, దాష్టికంగా ఉన్నా స్త్రీ బుద్ధి కుశలతా, ఇంగితజ్ఞానంతో ఇంటిని నిలబెట్టుకోవచ్చు అనడానికి ఈ పాత్రలు కనిపిస్తాయి. కాని చాలాసార్లు స్త్రీలు ఎంత అభద్రతతో ఉంటారంటే అత్తతోగాని, కోడలితోగాని వైరం పెట్టుకుంటే తప్ప మనుగడ లేదు అనట్టుగా ఉంటారు. ఆర్థిక కేంద్రం మగాడు తీసుకోగా నాలుగ్గోడలు ఉండే ఇంటి కేంద్రమైనా తన చేతుల్లో ఉండాలని భావించడం వల్లే ఈ అభద్రత.
ఎట్టకేలకు ఈ సినిమాలో అత్త కోడలి ఔన్నత్యాన్ని గ్రహిస్తుంది. కోడలు అత్త పెద్దరికాన్ని అర్థం చేసుకుంటుంది. నలుగురూ ఆడవాళ్లే. కాని కొద్దిపాటి సామరస్యాన్ని కోల్పోయి ఇల్లు నరకం చేస్తారు. అత్త కోడలి దృష్టి నుంచి ఆలోచించినా కోడలు అత్త వైపు నుంచి ఆలోచించినా చాలా సమస్యలు రావు. ఉన్నవి తొలిగిపోతాయి. నేటికీ ఈ సూత్రం పాటించే అత్తాకోడళ్లు మాత్రం తక్కువ. అలాంటివారిని తట్టిలేపే సినిమా ‘ఆడదే ఆధారం’. తమిళంలో నటుడుగా, నాటక కర్తగా, దర్శకుడుగా ప్రఖ్యాతి పొందిన విసు ఈ సినిమాను మొదట తెలుగులో (1988) తీసి ఆ తర్వాత తమిళంలో చేశాడు. రెండు చోట్లా విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇరుగు పొరుగు ఎలా చస్తే మనకేంటి అనుకునే మనుషులకు బదులు... సాటి మనిషి కష్టాన్ని పట్టించుకునే రేడియో మామగా అతడు ఆకట్టుకుంటాడు. ఇందులో సీతారామశాస్త్రి రాసిన
‘మహిళలూ మహరాణులు’... ‘నేలమ్మా నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ’.. పాటలు రేడియోలో చాలాకాలం వినిపించాయి... వినిపిస్తున్నాయి. ప్రపంచం దాని చలన సూత్రాల ఆధారంగా అది కదలుతూ ఉండొచ్చు. కాని ఇంటి చలన సూత్రాలు సరిగ్గా ఉన్నప్పుడే దాని చలన సూత్రాలు సజావుగా సాగుతాయి. ఇల్లు సజావుగా ఉండాలంటే కుటుంబం సజావుగా ఉండాలి. కుటుంబం సజావుగా ఉండాలంటే స్త్రీ తనను తాను గమనించుకుంటూ ఏమరుపాటుగా ఉండాలి. తను స్త్రీ. ఎదురుగా ఉన్నది కూడా స్త్రీయే. ఆమే అగ్ని. ఆమే జడి. ఆడదే ఆధారం. కథ ఆడనే ఆరంభం.
– కె