స్త్రీలోక సంచారం | Womens empomerment:Superstar Rajinikanth's wife Latha to face trial for non-payment of dues | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Jul 12 2018 12:06 AM | Updated on Jul 12 2018 12:06 AM

Womens empomerment:Superstar Rajinikanth's wife Latha to face trial for non-payment of dues - Sakshi

రెండు వేర్వేరు కేసులలో తమిళ నటుడు రజనీకాంత్‌ భార్య లతకు, మాజీ మంత్రి పి.చిదంబరం భార్య నళినికి సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టుల నుండి చుక్కెదురైంది. రజనీ నటించిన ‘కొచ్చాడియన్‌’ 
(2014) నిర్మాణం కోసం ఓ మార్కెటింగ్‌ అండ్‌ మీడియా కంపెనీ నుంచి పది కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించకుండా చీటింగ్‌కు పాల్పడి కోర్టు ఆదేశించినప్పటికీ ఆ బకాయిలు చెల్లించనందుకు సుప్రీం కోర్టు తిరిగి లతపై క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ని పునఃప్రారంభించగా, ‘శారద చిట్‌ఫండ్‌’ స్కామ్‌లో తనను విచారించడం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు పంపడాన్ని సవాల్‌ చేస్తూ న ళిని చేసిన అప్పీల్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది ::: హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 24 కింద తన భర్త నుంచి మధ్యంతర జీవనభృతి పొందడం కోసం దిగువ కోరు  ్టనుంచి ఒక ముస్లిం మహిళ తెచ్చుకున్న ఆదేశాలను మధ్యప్రదేశ్‌ హైకోర్టు తిరస్కరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం హైందవ మహిళకు మాత్రమే విడిపోయిన భర్త నుంచి ఆటోమేటిక్‌గా (కేసు వేయనప్పటికీ) జీవన భృతి పొందే హక్కు లభిస్తుందని, ముస్లిం మహిళ మాత్రం ముస్లిం వివాహ చట్టం ప్రకారం మొదట భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, జీవన భృతి ఇవ్వడం లేదని రుజువు చేసుకోవలసి ఉంటుందని జస్టిస్‌ వందన కస్రేకర్‌ ఆ ముస్లిం మహిళ అభ్యర్థనను తోసిపుచ్చారు .

హైదరాబాద్‌ జె.ఎన్‌.టి.యు.లో ప్రస్తుతం జరుగుతున్న ఐదు రోజుల ‘ది హేగ్‌ ఇండియా సైబర్‌ సెక్యూరిటీ క్యాంప్‌’లో మహిళా ‘టెకీ’లే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. హేగ్, నెదర్లాండ్స్, హైదరాబాద్‌లలో ఏకకాలంలో జరుగుతున్న ఈ క్యాంప్‌లో నాటో, చెక్‌పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ వంటి దిగ్గజాలు ఇస్తున్న సెక్యూరిటీ టిప్స్‌ గురించి తెలుసుకోడానికి మహిళలే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, హైదరాబాద్‌ క్యాంప్‌కు మొదటి రోజు హాజరైన 54 మందిలో 20 మంది మహిళలేనని క్యాంప్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్‌ సెక్యూరిటీ క్లస్టర్‌ వెల్లడించింది ::: మొదటిసారి డేటింగ్‌కి వెళ్లినప్పుడు అబ్బాయా.. అమ్మాయా.. ఎవరు బిల్లు కట్టాలన్న ప్రశ్న ఈ భూమండలంలో ప్రేమ మొదలైన నాటినుంచి ఉన్నప్పటికీ అమ్మాయిల్ని కాదని అబ్బాయిలే సాధారణంగా బిల్లు చెల్లిస్తుండటం కనిపిస్తుంది. అయితే మొదటిసారి డేటింగ్‌కి వెళ్లినప్పుడు బిల్లు కట్టాలన్న చొరవ అమ్మాయిల్లోనే ఎక్కువగా ఉంటుందని, ఆ చొరవపై అబ్బాయిలు నీళ్లు చల్లకూడదని డేటింగ్‌ యాప్‌ ‘బడూ’ జరిపిన అధ్యయనంలో తేటతెల్లమయింది ::: మేదే హొజాబ్రీ అనే ఇరాన్‌ యువతి తన డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసినందుకు ఇరాన్‌ ప్రభుత్వం ఆమెను అరెస్ట్‌ చేయడంపై ఆ దేశంలో ఇప్పుడు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మేదేను సమర్థిస్తూ, మత పెద్దల్ని విమర్శిస్తూ అక్కడి యువతీయువకులు సోషల్‌ మీడియాలో చిత్ర విచిత్రమైన కామెంట్‌లు పెడుతూ, వీధులలో డ్యాన్స్‌లు చేస్తూ.. మేదే ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రపంచ దేశాల నడుమ దేశ ప్రతిష్టను పెంచేందుకు క్రౌన్‌ ప్రిన్స్‌ (వారసత్వంగా రాజు కాబోయే వ్యక్తి) మొహమ్మద్‌ బిన్‌సల్మాన్‌ అమలు పరుస్తున్న సంస్కరణల్లో భాగంగా ఇటీవలే మహిళల డ్రైవింగ్‌పై ఉన్న  దశాబ్దాల నాటి నిషేధాన్ని ఎత్తి వేసిన సౌదీ అరేబియా ఇప్పుడు.. తన దేశ మహిళలకు ‘నోటరీ’ అధికారాన్ని కూడా ఇచ్చింది. ఈ అధికారంతో మహిళలు ఆటార్నీ హక్కులను ఇవ్వొచ్చు, రద్దు చేయవచ్చు. ఆస్తుల్ని బదలాయించవచ్చు. కంపెనీల స్థాపనకు అవసరమైన డాక్యుమెంట్లను స్టాంప్‌ వేసి, సంతకం పెట్టి ఇవ్వవొచు ::: యాక్సిస్‌ బ్యాంక్‌ ఎం.డి., సి.ఇ.వో. శిఖాశర్మ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగుస్తుండటంలో ఆమె స్థానంలో నియామకానికి బ్యాంకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ముగ్గురి పేర్లను ఆర్‌.బి.ఐ.కి పంపారు. అయితే ఆ ముగ్గురిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం విశేషం ::: భార్యకు, కుమార్తెలకు కానుకగా ఇచ్చే ఆస్తులపై పన్ను విధింపును మినహాయిస్తూ ఆదాయ పన్ను చట్టంలో సవరణలు తేవాలని స్త్రీ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి మనేకాగాంధీ, ఆర్థికశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరారు. దీనిపై పీయూష్‌ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement