స్త్రీలోక సంచారం | Womens empowerment:Telangana IAS reshuffle: 11 district collectors transferred | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Thu, Aug 30 2018 12:25 AM | Last Updated on Thu, Aug 30 2018 12:25 AM

Womens empowerment:Telangana IAS reshuffle: 11 district collectors transferred - Sakshi

చట్ట విరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఉప్పల్‌లోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య దంపతులు డాక్టర్‌ సిగిరెడ్డి ఉమామహేశ్వరి, డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌లను వలపన్ని (డీకాయ్‌ ఆపరేషన్‌) పోలీసులు అరెస్టు చేసి, వారి దగ్గర్నుంచి ఒక ప్రింటర్, స్కానర్, రెండు సెల్‌ఫోన్‌లు, లింగ నిర్ధారణ పరీక్ష ఫీజుగా వారే ఇచ్చిన 7,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గర్భిణి అయిన ఒక లేడీ కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని మఫ్టీలో వెళ్లి, ఫీజు కట్టి, లింగనిర్ధారణ పరీక్ష చేయించి, రిపోర్ట్స్‌ తమ చేతికి అందిన వెంటనే డాక్టర్‌ దంపతులైన గైనకాలజిస్టు, జనరల్‌ సర్జన్‌లను అరెస్టు చేసిన పోలీసులు.. 2000 సంవత్సరంలో ప్రారంభం అయిన ఈ ఆసుపత్రి ఏడాది నుంచీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తోందని తెలిపారు. 

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరుగా ప్రస్తుతం పూర్తిస్థాయి అదనపు బాధ్యలు నిర్వహిస్తున్న వాకాటి కరుణ స్థానంలోకి బదిలీ అవగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి స్థానంలోకి కుమురంభీం అసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ ప్రశాంత్‌ జీవన్‌ బదలీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలకు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 11 మంది జిల్లా కలెక్టర్‌ల బదిలీలో భాగంగా ఆమ్రపాలిని కూడా బదిలీ చేసిన ప్రభుత్వం ఆమెకు ఎక్కడికి బదిలీ చేస్తున్నది మాత్రం వెంటనే వెల్లడించలేదు!

క్టోబర్‌లో పంపిణీ కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తున్న బతుకమ్మ చీరలను భద్రపరిచేందుకు గోదాములను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. తెల్లకార్డులలో ఉన్న వివరాలను బట్టి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటీ 8 లక్షల మంది ఉండగా వారందరికీ 280 రూపాయల ఖరీదైన చీరను బతుకమ్మ కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని నెలలుగా భారీ ఎత్తున చీరలు నేయిస్తోంది. 

రెండు ప్రపంచ యుద్ధాలను, బొలీవియా విప్లవాలను, 3,000 మంది మాత్రమే ఉండే తన సకాబా గ్రామ జనాభా 1,75,000 అవడాన్ని కళ్లారా చూసి, ఈ ఏడాది అక్టోబర్‌ 26వ తేదీకి 118 ఏళ్లను పూర్తి చేసుకోబోతున్న జూలియా ఫ్లోర్స్‌ కోల్కే తన దేశమైన బొలీవియాలోనే, బహుశా ప్రపంచంలోనే అతి వృద్ధురాలైన మహిళగా రికార్డు నెలకొల్పబోతున్నారు. అయితే ఆమె తరఫున రికార్డు కోసం తమకు దరఖాస్తు వంటిదేదీ అందలేదని గిని ్నస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అంటుండగా.. అలాంటి బుక్‌ ఒకటి ఉందా అని కోల్కే బోసినవ్వులు నవ్వుతున్నారు. 

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఇటీవల బాలల సంరక్షణాలయాలలో జరిగిన లైంగిక అకృత్యాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో, ఆ సంరక్షణాలయాల తీరుతెన్నులపై అధ్యయనం జరిపి ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌.సి.పి.సి.ఆర్‌) ఇచ్చిన తాత్కాలిక నివేదిక వెల్లడించిన విషయాలపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,874 చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లను (సి.సి.ఐ.లు) తనిఖీ చేయగా వాటిలో కేవలం 54 మాత్రమే చట్టబద్ధంగా నడుస్తున్నట్లు ఎన్‌.సి.పి.సి.ఆర్‌. కోర్టుకు అందించిన తన నివేదికలో తెలిపింది! 

తాగి డ్రైవ్‌ చేస్తున్నాడని ఒక యువతి తన బాయ్‌ఫ్రెండ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం కోర్టు అతడికి జరిమానా విధించడంతో పాటు, 17 నెలలు డ్రైవింగ్‌ చెయ్యకుండా నిషేధించింది. బ్రిటన్‌లో ఉంటున్న కమల్‌జీత్‌ సాగూ అనే ఒక ప్రవాస భారతీయుడు తన 44వ పుట్టినరోజు సందర్భంగా గత జూన్‌ 18న గర్ల్‌ ఫ్రెండ్‌ను కారులో ఎక్కించుకుని తిప్పుతూ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యా గొడవ మొదలై,  అతడు కారు దిగి సిగరెట్‌ కోసం ఓ షాపు దగ్గరికి వెళ్లినప్పుడు ఆ గర్ల్‌ఫ్రెండ్‌ ఉత్తిపుణ్యానికి పోలీసులకు ఫోన్‌ చేసి ‘తన బాయ్‌ఫ్రెండ్‌ తాగి డ్రైవ్‌ చేస్తున్నాడని’ చెప్పడంతో ఇన్నాళ్లూ నడిచిన ఆ కేసులో ఇప్పుడు తీర్పు వచ్చింది.

ఏషియన్‌ గేమ్స్‌తో దేశానికి తొలిసారి రజత పతకం సాధించుకు వచ్చిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి. సింధుపై ఒక వైపు ప్రశంసల జల్లు కురుస్తుండగా, మరోవైపు.. ఆమె ఏ ఫైనల్స్‌లోనూ స్వర్ణపతకం సాధించలేకపోతోందనీ, ఫైనల్స్‌లో ఆడేందుకు ఆమె భయపడుతోందని సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! దీనిపై సింధు తండ్రి రమణ స్పందిస్తూ, ‘‘ఇప్పటి వరకు ఎంతో మంది బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు ఇండియా తరఫున ఆడారు. వారిలో ఎంతమంది ఒలింపిక్స్‌ ఫైనల్‌కు వెళ్లారు? ఎంతమంది అంతర్జాతీయ పతకాలు గెలుచుకొచ్చారు?’’ అని ప్రశ్నించారు. 

918లో సరిగ్గా ఇదే రోజున ఫ్యానీ కప్లాన్‌ అనే 28 ఏళ్ల రష్యన్‌ యువతి, ‘సోషలిస్ట్‌ రివల్యూషనరీ పార్టీ’ సభ్యురాలు.. ‘బోల్షెవిక్‌’ పార్టీ నేత వ్లాదిమిర్‌ లెనిన్‌పై హత్యాయత్నం చేశారు. రివల్యూషనరీ పార్టీని రద్దు చేసిన లెనిల్‌.. విప్లవ ద్రోహి అంటూ.. ఆగస్టు 30న మాస్కో ఫ్యాక్టరీ నుంచి బయటికి వస్తున్న లెనిన్‌పై కప్లాన్‌ అతి సమీపం నుంచి జరిపిన మూడు రౌండ్‌ల కాల్పులలో లెనిన్‌ చావు తప్పి, తీవ్రమైన గాయాలతో బయటపడగా.. ఆ తర్వాత మూడు రోజులకే పోలీసులు హడావుడిగా విచారణ జరిపించి సెప్టెంబర్‌ 3న ఆమె మెడ వెనుకభాగంలో తుపాకీ పెట్టి కాల్చి చంపేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement