సొంతిల్లు... 30 లోపే! | won house in my drema | Sakshi
Sakshi News home page

సొంతిల్లు... 30 లోపే!

Published Fri, Feb 21 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

సొంతిల్లు... 30 లోపే!

సొంతిల్లు... 30 లోపే!

వరంగల్ జిల్లాలోని మచ్చుపహాడ్ మా సొంతూరు. 20 ఎకరాలుండేది. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లకు, ఇతరత్రా అవసరాలకు మొత్తం కరిగిపోయింది. ఈ క్రమంలో నాన్నగారు చనిపోవడంతో బాధ్యతలన్నీ నాపై పడ్డాయి. పేరుకు సొంతిల్లున్నా అది శిథిలమై కూలి పోయింది. ఫలితంగా కొన్నాళ్ల పాటు మా మేనమామ దగ్గర, కొన్నాళ్లు అద్దె ఇళ్లలో గడిపాం. దీంతో ఎలాగైనా సరే సొంతిల్లు.. అదీ రాజధాని హైదరాబాద్‌లో సాధించాలన్న కోరిక బలంగా నాటుకుంది. ఇంటర్మీడియెట్ దశలో.. టీనేజ్‌లో అనుకున్నది ఒక దశాబ్దం తర్వాత 2011లో సాకారమైంది.
 
వరంగల్, హైదరాబాద్‌లో దాదాపు పదేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఇటు ఇంటి అవసరాలతో పాటు అటు సొంతిల్లు కోసం కూడా కొంచెం కొంచెం పొదుపు చేశా. ఇలా నేననుకున్న బడ్జెట్, కోరుకున్న ఇంటి కోసం వెదుకుతుండగా మూడేళ్ల క్రితం ఉప్పల్‌లోని పర్వతపూర్‌లో ఇల్లు కనిపించింది. ధర రూ.20 లక్షల పైచిలుకే. డౌన్‌పేమెంట్లు, ఈఎంఐల గురించి ముందే ప్రణాళిక వేసుకోవడం ఇక్కడ పనికొచ్చింది. ముందుగా డౌన్‌పేమెంట్‌కు కొంత డబ్బు సమకూర్చుకున్నా. దీని కోసం ఇతరత్రా పొదుపు మొత్తాలను బ్రేక్ చేశా.

ఊళ్లో కొంత ప్రాపర్టీ మిగిలితే దాన్ని విక్రయించా. ఇంకాస్త మొత్తం చేతి కొచ్చింది. కాస్త బాధగా అనిపించినా.. ఇంట్లో బంగారాన్ని విక్రయించా. మరికాస్త డబ్బు చేతికొచ్చింది. అప్పట్లో నా జీతం సుమారు రూ. 27,000. బ్యాంకుల్ని సంప్రదించగా..చివరికి పీఎన్‌బీ రూ.12 లక్షల దాకా గృహ రుణం ఇస్తామంది. ఇంకాస్త తక్కువయింది. బంధుమిత్రుల నుంచి చేబదులు తీసుకుని కట్టేశా. అలా ఇల్లు సొంతమైంది.
 

ఖర్చులు తగ్గించుకున్నాం ..
 
ఈఎంఐలు మొదలయ్యాయి. నెలకు రూ. 13,000 కట్టాలి. అదే సమయంలో వేరే బాధ్యతలూ పడ్డాయి. దీంతో భారం పెరిగింది. కుటుంబ సభ్యుల అండతో ఖర్చుల్ని సాధ్యమైనంత తగ్గించుకున్నాం. అంతలో ఇంకో సంస్థ కాస్త ఎక్కువ జీతంతో మంచి ఆఫర్ ఇచ్చింది. పరిస్థితులు చక్కబడ్డాయి. చూస్తుండగానే రెండున్నరేళ్ల ఈఎంఐలు కట్టేశా.
 
ఆదా.. పెట్టుబడి

ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా చూసినా మరే రకంగా చూసినా నా నిర్ణయం కరెక్టేననిపిస్తోంది. ఆర్థిక మందగమనంతో రియల్ ఎస్టేట్ ధరలు గణనీయంగా తగ్గినపుడు తీసుకోవడం కలిసొచ్చింది. నేను ఇల్లు తీసుకున్న ప్రాంతం కీలకమైన హైదరాబాద్-వరంగల్ హైవేకి దగ్గర్లో ఉంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఐటీఐఆర్ ఇక్కడే రాబోతోంది. మరోవైపు, అద్దె రూపంలో చెల్లించాల్సిన దాదాపు రూ. 7,000-8,000ను ఈఎంఐకి బదలాయిస్తున్నా. సొంతింటిని నేను దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌గానే భావిస్తున్నాను కనుక అది పెట్టుబడి కిందే లెక్క. ఇది పోతే అదనంగా చెల్లించాల్సింది నెలకు రూ.5 వేలే. నా ఇంటి విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గత రెండున్నరేళ్లలో ఇది దాదాపు 40 శాతం పెరిగింది.     

- రాజిరెడ్డి కేశిరెడ్డి  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement