విండోస్ 10 వండర్స్... | Wonders of the windows 10 | Sakshi
Sakshi News home page

విండోస్ 10 వండర్స్...

Published Tue, Feb 10 2015 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

విండోస్ 10  వండర్స్...

మేకింగ్‌లో ఉన్న భారీ బడ్జెట్ సినిమా మీద జనాల్లో ఎంత ఆసక్తి ఉంటోందో.. మైక్రోసాఫ్ట్ రూపొందిస్తున్న విండోస్ 10 మీద కూడా నెటిజనుల్లో అంతే ఆసక్తి కనిపిస్తోంది. విడుదలకు ముందే సినిమాకు సంబంధించిన టీజర్లు లీక్ అయినట్టుగా విండోస్ 10 ఫీచర్ల విషయంలో కూడా రకరకాల వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ మానసపుత్రిక అలా ఉండబోతోంది.. ఇలా ఉండబోతోంది.. మీ డెస్క్‌టాప్‌ల, స్మార్ట్‌ఫోన్‌ల లుక్‌నే మార్చబోతోంది అంటూ.. వార్తలు వస్తున్నాయి.
 
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఎన్ని మార్పులు తీసుకు వచ్చినా.. అన్నింటిలోనూ కొనసాగిన డీఫాల్ట్ వెబ్‌బ్రౌజర్ స్థానంలో కొత్త బ్రౌజర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నదట మైక్రోసాఫ్ట్. మేకింగ్ నేపథ్యంలో దీన్ని ‘స్పార్టన్’గా వ్యవహరిస్తున్నారట. విండోస్‌ఎక్స్‌ప్లోరర్‌ను అరుదైన సందర్భాల్లో తప్ప వినియోగించం. మొజిల్లా, గూగుల్ క్రోమ్‌బ్రౌజర్లనే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ సరికొత్త స్పార్టన్ మాత్రం ఉత్సవవిగ్రహంలా కాకుండా... విస్తృతంగా వాడుకోవడానికి అనుగుణంగా ఉంటుందట. ఇది మొజిల్లా, క్రోమ్‌లకు దీటుగా ఉంటుందని లీకువీరులు చెబుతున్నారు. విండోస్ 10పై విండోస్ ఎక్స్‌ప్లోరర్ వెబ్‌బ్రౌజర్ పూర్తిగా కనుమరుగు కానుంది.  ఇదే  ఈ కొత్త ఓఎస్ గురించి చెప్పుకోదగ్గ ప్రముఖమైన అంశం.

స్టోర్ కూడా ఓపెన్‌చేస్తున్నారు!

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచే డివైజ్‌ల కోసం కొత్తగా ఒక అప్లికేషన్ స్టోర్‌ను రూపొందించనున్నారట. ఆండ్రాయిడ్‌కు ఆప్‌స్టోర్‌లాగా, ఐ ఆపరేటింగ్ సిస్టమ్ డివైజ్‌లు వాడే వారి కోసం రూపొందించిన ఐ స్టోర్‌లాగా.. ఈ నవ్యమైన విండోస్ ఓఎస్‌ను వాడే వారి కోసం ఈ స్టోర్‌ఉంటుందని తెలుస్తోంది. దీంట్లో మైక్రోసాఫ్ట్ విండోస్‌సేవలన్నీ అప్లికేషన్‌ల రూపంలో అందుబాటులో ఉంటాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు.
 
ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్స్‌బాక్స్..

వినోదభరితమైన సేవలను అందించడానికి ఈ అప్లికేషన్ ఇందులో గేమ్ అప్లికేషన్లు, ఇతర సోషల్‌మీడియా సేవలకు సంబంధించిన అప్లికేషన్లుంటాయి. ఇది విండోస్ అపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు అద్వితీయమైన అనుభవాన్ని ఇస్తుందని.. గొప్ప ఎంటర్‌టైన్‌గా ఉంటుందని రూపకర్తలే చెబుతున్నారు. గేమింగ్ విషయంలో కొత్త యుగానికి ఇది ఆరంభంగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ ప్రకటించుకొంటోంది. ఈ ఎక్స్‌బాక్స్ గురించి పూర్తి వివరాలు తెలిస్తే కానీ ఆ యుగం ఎలా ఉంటుందో చెప్పలేం!

విండోస్10 ఫీచర్ల విషయంలో మైక్రోసాఫ్ట్ ఎంతో గోప్యత పాటిస్తున్నా ఇలాంటి విషయాలు అయితే బయటపడిపోతున్నాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్ల, స్మార్ట్‌ఫోన్ల వినియోగపు అనుభవాన్నే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మార్చేస్తుందని అంటూ మైక్రోసాఫ్ట్ ఊరిస్తున్న తరుణంలో ఇలాంటి లీకులు మరింత ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే డెస్క్‌టాప్‌ల విషయంలో విండోస్ ఓఎస్‌లను చాంపియన్‌లుగా నిలిచినా.. స్మార్ట్‌ఫోన్ల విషయంలో అప్లికేషన్ల లేమి కనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితిని ప్రతిష్టాత్మక విండోస్ 10 ఏ విధంగా మార్చేస్తుందో... వినియోగదారులను ఎలా అలరిస్తుందో ఈ ఓఎస్‌పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కానీ అర్థం కాదు.
 

Advertisement
Advertisement
Advertisement