
వానలో తడవడం, చల్లని వాతావరణంలో ఎక్కువగా గడపడం వంటి కారణాల వల్ల జలుబు చేసే అవకాశాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే, పని ఒత్తిడి పెరిగినప్పుడు కూడా జలుబు చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. పని ఒత్తిడి మితిమీరినప్పుడు ముఖానికి చేరాల్సిన రక్తప్రసరణ దారిమళ్లి మెదడులోని న్యూరాన్లకు చేరుతుందని, దీని వల్ల ముక్కు చల్లబడి జలుబు చేస్తుందని ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొనుగొన్నారు.
కొంతమంది వలంటీర్లను ఎంపిక చేసి, రకరకాల ఒత్తిడి స్థాయి గల కంప్యూటర్ గేమ్స్ వారితో ఆడించి, థెర్మల్ ఇమేజింగ్ కెమెరాల సాయంతో వారి శరీర ఉష్ణోగ్రతలలో మార్పులను వారు గుర్తించారు. ఎక్కువ ఒత్తిడి గల గేమ్స్ ఆడిన వారిలో ముఖం, ముక్కు భాగాల్లో ఉష్ణోగ్రత తగ్గిందని వారు వివరించారు. ముఖంలోని అవయవాలకు చేరాల్సిన రక్తప్రసరణ దారిమళ్లడం వల్లనే ఇలా జరుగుతుందని, ఇదే పరిస్థితి గంటల తరబడి కొనసాగితే ముక్కు చల్లబడి జలుబు చేస్తుందని తెలిపారు.