ఆశాదీక్షలే ఇరు భుజాలు | Worlds First Armless Pilot is a Real Life Filipino American Super woman | Sakshi
Sakshi News home page

ఆశాదీక్షలే ఇరు భుజాలు

Published Sat, May 25 2019 12:48 AM | Last Updated on Sat, May 25 2019 12:48 AM

Worlds First Armless Pilot is a Real Life Filipino American Super woman - Sakshi

పడిశం పడితే బెంబేలు పడిపోతాం. జ్వరం వస్తే మంచమెక్కుతాం. ఇ.ఎం.ఐ కట్టలేక స్కిప్‌ అయితే ముఖానికి చెమటలు పట్టించుకుంటాం. ఏదో ఒక కష్టం వస్తే ఏదో ఒకవైపు పారిపోదాం అని చూస్తాం. ఎట్టకేలకు వాటినుంచి ఎలాగోలా బయట పడతాం. కాని బయటపడలేని కష్టం ఒకటి వస్తే? ఆ కష్టం శాశ్వతం అని తెలిస్తే? అప్పుడు సీతాకోకచిలుకలా ఎగిరే ధైర్యం తెచ్చుకుంటామా? గగనాన్ని సవాలు చేయగల ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటామా? ఈ జీవితం మెడలు వొంచి ముందుకు సాగగలం అని దిలాసాగా అనుకోగలుగుతామా?ఈమె, 36, సంవత్సరాల జెస్సికా కాక్స్‌ అనుకుంది. కనుక ఇవాళ ప్రపంచమంతా ఆమెను చూస్తోంది. ఆమెను వింటోంది. ఆమె మాటలకు ఇన్‌స్పయిర్‌ అయ్యి ఎదురయ్యే సవాళ్లను ముక్కచెక్కలు చేయడం నేర్చుకుంటోంది. ఆగడం, ఆపేయడం చెడ్డ అలవాట్లు.

ముందుకు సాగడం జెస్సికా కాక్స్‌ను చూసి నేర్చుకోవాల్సిన మంచి అలవాటు.అమెరికాలో అరిజోనా రాష్ట్రంలోని టక్సన్‌ ప్రాంతంలో 1983లో జెస్సికా జన్మించినప్పుడు ఆమెకు ఇరుభుజాలు లేకపోవడాన్ని చూసి తల్లిదండ్రులు స్థాణువయ్యారు. గర్భంతో ఉన్నప్పుడు చేసిన స్కానింగ్‌ రిపోర్ట్స్‌ సాధారణంగా ఉన్నాయని భావించడం వల్ల లోపల ఉన్న పాపాయికి భుజాలు లేకుండే పుట్టే ఒక అరుదైనా రుగ్మత ఉన్నట్టు కనిపెట్టలేకపోయారు. ఇటువంటి అనూహ్యత ఎదురైనప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏడుస్తూ మూల కూర్చుంటారు. కాని జెస్సికా తల్లిదండ్రులు మొదట తమ పాపకు భుజాలు లేవు అన్న వాస్తవాన్ని స్వీకరించారు. అయితే ఆమెను అందరు పిల్లలకు భిన్నంగా పెంచాలనే ఆలోచనను మానుకున్నారు. తాను అందరిలాంటి దాన్నే అనే భావం కలిగేలా జెస్సికాను మామూలు స్కూల్లోనే వేశారు.

మామూలు పిల్లలతోనే ఆడుకునేలా చేశారు. అయితే ఆ పిల్లలు ఆమెకు చేతులు లేవని ఎక్కువ ప్రేమగా, కన్సర్న్‌గా చూడటం జెస్సికాకు విసుగు పుట్టేది. తనకు తానుగా ఆడుకోవాలని కోరికతో తహతహలాడేది.జెస్సికాకు ఐదారేళ్ల వయసులోనే కృత్రిమ చేతులు పెట్టారు. రోజూ స్కూల్‌ నుంచి వచ్చాక ఆ చేతులను ఎలా ఉపయోగించాలన్న విషయం మీద ప్రాక్టీసు ఉండేది. పద్నాలుగేళ్ల వరకు కృత్రిమ చేతులతోనే జెస్సికా తన బాల్యాన్ని దాటింది. కాని ఎన్ని రోజులు గడిచినా అవి కృత్రిమ చేతులనే ఆమెకు అనిపించాయి తప్ప ‘తన చేతులు’ అనిపించలేదు.ఇవి నాకెందుకు... నావైన నా కాళ్లు ఉన్నాయి కదా వాటినే చేతులుగా మార్చుకుందామని నిర్ణయించుకుని, ఆ కృత్రిమ చేతులను పక్కకు పడేసిన రోజున ఆమె జీవితం మలుపు తిరిగింది. అప్పటినుంచి జెస్సికా తనను తాను సాధన చేసుకోవడం నేర్చుకుంది.

కాళ్లతో షూస్‌ వేసుకోవడం, ఈత కొట్టడం, టైప్‌ చేయడం, కారు నడపడం... అంతేకాదు యుద్ధవిద్య ‘టైట్వాండో’లో ఆమె అతి త్వరలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించింది. పియానో వాయించడం నేర్చుకుంది. అంతదాకా ఎందుకు కళ్లల్లో కాంటాక్ట్‌ లెన్సులు పెట్టుకోవడం తీయడం కూడా ఆమె కాళ్లతో అతి సులువుగా చేయగలదు. ‘శారీరక పరిమితులు ఉన్నాయనుకుని మెదడు వేసే బంధనాలు తెంచుకోవడంలోనే అసలు విజయమంతా ఉంది’ అని జెస్సికా కాక్స్‌ చెబుతుంది.ఫిలాసఫీలో డిగ్రీ చేశాక ఆమెకు విమానం నడపాలనే కోరిక పుట్టింది. కొత్తలో ఈ ఆలోచనకు భయపడ్డా, ఆమెకు ట్రయినింగ్‌ ఇచ్చే ఏవియేషన్‌ క్లబ్బులు సందేహించినా 2005లో ఆమె ఇందుకుగాను ట్రైయినింగ్‌ మొదలుపెడితే అనేక ప్రయత్నాలు, వైఫల్యాల తర్వాత 2008లో ఆమెకు అనుమతి పత్రం లభించింది.

పెడల్స్‌ లేని లైట్‌ వెయిట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపడానికి ఇప్పుడు జెస్సికా దగ్గర లైసెన్స్‌ ఉంది. ఇలాంటి లైసెన్స్‌ పొందిన మహిళ ఈమె ఒక్కతే.జెస్సికా విజయగాథ విని దాదాపు ఇరవై దేశాల యూనివర్సిటీలో స్ఫూర్తిదాయక ప్రసంగాల కోసం ఆమెను ఆహ్వానించాయి. ఆమె స్వయంగా మోటివేషనల్‌ స్పీకర్‌గా జనాలను ఉత్తేజ పరుస్తుంటుంది. ట్వయికోండో శిక్షణలో పరిచయమైన పాట్రిక్‌ను ఆమె వివాహం చేసుకుంది. వారిద్దరూ సంతోషంగా ఒకరికొకరు సపోర్టుగా ఉంటూ జీవితం సాగిస్తున్నారు.‘మీ కలలు కేవలం రెండు భుజాలు మాత్రమే ఉన్నాయన్న భావనని మొదట తీసేయ్యండి. మీకు వేయి భుజాలు ఉన్నాయని నమ్మినప్పుడే దేన్నయినా సాధిస్తారు’ అని ఆమె అంటుంది.భుజాలు లేని జెస్సికా ఇన్ని సాధించినప్పుడు రెండు భుజాల ఐశ్వర్యం ఉన్న మనం ఎన్ని సాధించాలి?        

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement