చదువు కోసం వెళ్తే.. బేడీలేస్తారా?
► అమెరికాలో తెలుగు విద్యార్థికి అవమానంపై తల్లిదండ్రుల ఆవేదన
కృష్ణాజిల్లా: అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకున్న కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన దేవినేని సూర్యతేజను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని, చేతికి బేడీలు వేసి దుర్భాషలాడటంపై అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. యూఎస్‌ఏలోని జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టులో కనీసం రికార్డులు కూడా పరిశీలించకుండా తిరిగి ఇండియా వెళతావా? లేదా జైలుకు వెళతావా? అంటూ దుర్భాషలాడిన విషయాన్ని ఫోన్ ద్వారా తెలుసుకుని ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించి ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలిలా ఉన్నాయి. స్థానిక బీకాలనీకి చెందిన దేవినేని శ్రీనివాసరావు, నవీనబాల తనయుడు దేవినేని సూర్యతేజ అమెరికాలోని న్యూహెవెన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదివేందుకు సీటు సంపాదించాడు. ఉన్నత చదువుల కోసం ఆంధ్రాబ్యాంకు విద్యా రుణం కింద రూ.16.50 లక్షలు, వీరి సొంత సొమ్ము రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.21.50 లక్షల (8,208.9 డాలర్ల)కు చెక్కు మంజూరు చేసింది. ఈ నెల ఏడో తేదీ రాత్రి ఢిల్లీ నుంచి అమెరికాకు సూర్యతేజ బయల్దేరాడు. ఇతనితో పాటు మరికొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. న్యూయార్క్ జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టులో దిగిన వారిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. న్యూహెవెన్ యూనివర్సిటీ పేరు చెప్పగానే సూర్యతేజతో పాటు అందర్నీ అదుపులోకి తీసుకుని బేడీలేశారు. ‘ఇండియా కుక్కలు’ అంటూ నానా దుర్భాషలాడారు.
తర్వాత విమానం ఎక్కించి పంపేశారు. పాస్‌పోర్టులు ఓ అధికారి ద్వారా ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పాస్‌పోర్టు కావాలంటే రూ.లక్ష చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థులంతా తమకు పాస్‌పోర్టులు అక్కర్లేదని చెప్పి హైదరాబాద్‌కు వచ్చేశారు. అయితే పాస్‌పోర్టులు లేనందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న తెలంగాణ మంత్రి ఒకరు విషయం తెలుసుకుని విద్యార్థులను విడుదల చేయించారు. మంత్రి విడుదల చేయించకపోతే తమ పిల్లల గతి ఏమయ్యేదని సూర్యతేజ తల్లిదండ్రులు ప్రశ్నించారు. విద్యా సర్టిఫికెట్లు, ఆర్థికపరమైన అంశాలు, వీసా అన్నీ సరిగ్గానే ఉన్నా నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఉగ్రవాదుల్లాగా తుపాకులు అడ్డుపెట్టి చేతికి బేడీలు వేస్తుంటే మన ప్రభుత్వాలు ఏమిచేస్తున్నాయని ప్రశ్నించారు. విద్యార్థిలోకం ఉద్యమించకముందే వీసా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.
► అమెరికా నుంచి మరో 22 మంది వెనక్కి..
► ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ చొరవతో సమస్య పరిష్కారం
శంషాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి తిరుగుముఖం పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు అక్కడికి వెళ్లి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 22 మంది విద్యార్థులు న్యూయార్క్ వెళ్లి.. అక్కడి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో తిరుగుముఖం పట్టారు. వీరందరు శనివారం అర్ధరాత్రి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ విద్యార్థులను బయటకు పంపడానికి చాలా సమయం తీసుకుంది. దీంతో అదే సమయంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడడంతో ఈ సమస్య వెంటనే పరిష్కారమైంది.