ఏ కులము నీదంటే గోకులము నవ్వింది! | Ye kulamu needante song.. from Saptapadi Movie | Sakshi
Sakshi News home page

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది!

Published Fri, Aug 23 2013 11:59 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది!

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది!

చందమామ సినిమాలో ‘సక్కుబాయినే...’ అనే పాటతో గేయ రచయితగా పరిచయమయ్యాను. దాదాపు 20కి పైగా పాటలు రాశా. వీటన్నింటికి పరోక్షంగా నాపై ప్రభావం చూపిన రచయిత వేటూరి. సాధారణంగా రచయితలందరూ మనకు తెలిసిన విషయాన్ని ఇంకొక కోణంలో చె బుతారు. తెలిసిందే కొత్తగా చెప్పడం కాదు... తెలియని విషయాలు కూడా కొత్తగా, అర్థమైనట్లుగా చెప్పడమే ఆయన కలం బలం.
 
ఒక దళిత కులానికి చెందిన హీరో, ఒక అగ్రకులానికి చెందిన హీరోయిన్‌ల మధ్య జరిగే ప్రేమకథ ఆధారంగా డెరైక్టర్ కె.విశ్వనాథ్ కులమతాలకు వ్యతిరేకంగా తీసిన సినిమా ‘సప్తపది’. ఈ సినిమాలో వేటూరిగారి కలం కులాన్ని ఎండగట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఆ మహానుభావుడి కలం నుండి జాలువారిన ఒక  ఆణిముత్యం ‘ఏ కులము నీదంటే గోకులము నవ్వింది’ అనే పాట.
 
 ఈ పాట చరణాల్లో ఏడు వర్ణాలు కలిసీ ఇంద్రధనసౌతాది/అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది... ఏడు రంగులు కలిస్తేనే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అలాగే అన్ని కులాల వారు కలిసిమెలసి జీవిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఎవరు ఏ కులంలో పుట్టినా భూమ్మీదే పుడతారు, చనిపోయినప్పుడు అందరూ పైకే వెళతారు అనే జీవిత సత్యాన్ని అందంగా చెప్పారు.
 
 ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లిధరణి మూగది/నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... అనే వాక్యాల్లో నాకు అర్థమైందేంటంటే అనాది నుండీ ఉన్న ఆకాశం, భూమి అలాగే ఉన్నాయి. ఆ నింగికి, ఈ నేలకు మధ్యలో వచ్చిన మబ్బులు ఎలా అయితే వచ్చి ఉరిమి మాయమైపోతూంటాయో... అలాగే మనం కూడా శాశ్వతం కాదు... అలాంటప్పుడు ఈ కులాల గురించి కొట్లాడుకోవడం ఎందుకు? అని కవి ఈ సమాజాన్ని ప్రశ్నించిన తీరు అమోఘం.
 
వేటూరిగారు రాసిన మరొక పాట కూడా ఈ వర్ణవ్యవస్థను ఎత్తి పొడిచేలా ఉంటుంది. అది గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన/ గోధూళి ఎర్రన ఎందువలన... ఈ పల్లవిలో గోవులు తెల్లగా ఉంటాయి, కృష్ణుడు నల్లగా ఉంటాడు. అలాగే పొద్దుపోయేటప్పుడు గోవులన్నీ ఇంటికి చేరే సమయంలో ఎర్రటి నేలపై అవి వెళ్తునప్పుడు పైకి లేచే ధూళి, ఆ సూర్యుడి కాంతికి మరింత ఎర్రగా మారుతుంటుంది. అన్ని వర్ణాలు ఎందుకని అమాయకంగా చిన్నపిల్లాడిలా కవి ప్రశ్నించాడు.
 
 గోపయ్య ఆడున్నా గోపెవ్ము ఈడున్నా/ గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా... అనే వాక్యాలలో గోవుల వెంట ఉన్న ఆ గోపయ్య అక్కడ ఉన్నా, గోపెమ్మ ఇంట్లో ఉన్నా... ఆ గోధూళి ఈ గోపెమ్మకి కుంకుమలాగ అంటదా అని నర్మగర్భంగా చెప్పారు. ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా... అనే దానిలో పొద్దుపొడవడం అంటే సూర్యాస్తమయం కోసం గోపయ్య ఎదురుచూడటం, పొద్దుగడవడం అంటే గోవులను తోలుకెళ్లిన గోపయ్య ఆలోచనల్లో గోపెమ్మకు కాలం గడవకపోవటం అని మనిషికి, ప్రకృతికి ఉన్న సంబంధాన్ని కవితాత్మకంగా చెప్పారు.
 
 పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు/అల్లన మోవికి తాకితే గేయాలు... అనే వాక్యాలలో ఆ మురళికి ఉండే ఏడు రంధ్రాలు గాయాలు అనగలిగే ధైర్యం ఉన్నవారు వేటూరి మాత్రమే.  ఆ మురళి మూగైనా... ఆ పెదవి మోడైనా... లో ఆ మురళి మూగదైపోయినా, మన పెదాలు మోడై పోయినా...ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా అని ప్రశ్నించడంలోనే వేటూరి అంతరంగం అర్థమవుతుంది. అదేవిధంగా ‘ఈ కడిమి పూసేనా... ఆ కలిమి చూసేనా’ లో కడిమి పూలు త్వరగా పూయవు... అలాగే ఐశ్వర్యం వెనువెంటనే రాదు... అంటే చెట్టుకు పూలే అందం కదా, మోడువారిన ఆ చెట్టు పూలు పూయడమంటే అన్నీ కోల్పోయి నిరుపేదగా మిగిలిన వాడు కూడా తిరిగి ఐశ్వర్యంతో తులతూగడం లాంటిదే! అది ఎందుకూ అంటే దైవలీల అంటూ అలవోకగా దైవం మీదకు దృష్టిని మళ్లించేశారు కవి. నాకు తెలిసి పాటె లా రాయాలో తెలియనివారికీ వేటూరి చూపించిన... ‘వే’టూరిస్టు గైడులాంటిది ఈ పాట.
 
 లక్ష్మీభూపాల్
 సినీ గేయ రచయిత

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement