యోగాసరా
యోగ + ఆసరా... యోగాసరా
యోగ సాధనలో తొలి దశలో అంతగా ఇబ్బంది పెట్టని, కఠినంగా అనిపించని ఆసనాలు మాత్రమే వేయడం అవసరం. అయితే కొన్ని ఆసనాలు చేయడానికి ఇబ్బంది ఉంటే కుర్చీని ఆసరాగా తీసుకోవచ్చు. ఇది కూడా ఒక రకమైన చికిత్సా ప్రక్రియే.
నటరాజాసన
తీరుగా నిలుచుని చేతుల్ని శరీరానికి పక్కగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడికాలిని వంచి, కుడికాలి చీలమండను లేదా కుడికాలి బొటనవేలిని కుడి చేత్తో పట్టుకోవాలి. వీలైనంత వరకూ కుడికాలిని పైకి ఎత్తాలి. తర్వాత ఎడమచేతిని ముందుకు చాచాలి. ఇలా 3 నుంచి 5 సాధారణ శ్వాసల పాటు ఉండి, నిదానంగా పూర్వ స్థితికి రావాలి. అదే విధంగా తర్వాత ఎడమకాలితో కూడా చేయాలి. దీని వలన కాళ్లు, చీల మండలు, తుంటి భాగం శక్తిమంతమవుతాయి. తొడల్లో కొవ్వు తగ్గడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగు పడడానికి, మూత్ర విసర్జన వ్యవస్థ పనితీరు మెరుగుకు, ఉదర కండరాలు పటిష్టం కావడానికి సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది నిజానికి కఠినమైన ఆసనం. యోగాసనాల సాధనలో పరిణతి సాధించిన వారు వేయతగినది. అయితే కొన్ని చికిత్సా సందర్భాల్లో ఇది చేయవలసి వచ్చినప్పుడు ఇదే ఆసనాన్ని కుర్చీ ఆసరాగా చేయించవచ్చు.
ఉత్కటాసన 1
కాళ్లు రెండూ కలిపి ఉంచి సమస్థితిలో నిలుచోవాలి. చేతులు రెండూ ముందుకు చాపి శ్వాస వదులుతూ (మోకాళ్లపై ఎక్కువ భారం పడకుండా) నడుం కింది భాగాన్ని వెనుకకు కొంచెం కొంచెంగా కిందకు తీసుకురావాలి. ఒకట్రెండు సాధారణ శ్వాసలు తీసుకుంటూ పైకి లేచి తిరిగి సమస్థితిలో నిలబడాలి. శరీరం బరువు మోకాళ్లు, తొడల మీద కాకుండా నడుం మీద పడేలా చూసుకోవాలి. ఈ ఆసనంతో తొడల్లో కొవ్వు కరుగుతుంది.
ఉత్కటాసన 2
(కుర్చీ సాయంతో) సమస్థితిలో నిలబడి చేతులు ముందుకు చాపి శ్వాస వదులుతూ సీటును కిందకు తీసుకువచ్చి, మళ్లీ శ్వాస తీసుకుంటూ పైకిలేచి నిలుచోవాలి. ఈ విధంగా ఈ ఆసనాన్ని 5 లేక 6 సార్లు చేయవచ్చు. దీనివల్ల మోకాళ్లు, తొడలకు రక్తప్రసరణ బాగా జరిగి బలంగా తయారవుతాయి. పై రెండు ఆసనాలు అనంతరం వేయాల్సిన మరో ఆసనం ఉంది. అదే...
ఉత్కటాసన 3
సమస్థితిలో నిలబడి కాలి మడమలు కలిపి పాదాలను వై ఆకారంలో ఉంచి రెండు చేతులను కిందకి ఉంచి ఇంటర్‌లాక్ చేసి మోకాళ్లు బయటకు మడుస్తూ వీలైనంత కిందకు కూర్చోవాలి. ఒకటి లేదా రెండు సాధారణ శ్వాసల తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి నిలబడాలి. ఈ విధంగా కిందకు కూర్చుంటూ పైకి లేస్తూ 5 నుంచి 10 సార్లు చేయవచ్చు. సయాటికా సమస్య ఉన్న వారికి నొప్పిని తగ్గిస్తుంది. వెన్నముకని బలంగా తయారు చేస్తుంది. పాదాలకు రక్తప్రసరణ సజావుగా జరిగేలా సహకరిస్తుంది.
యోగావగాహన
ఒకే వస్తువును వివిధ ప్రాంతాలలో ఎలాగైతే విభిన్న పేర్లతో పిలుస్తారో అదే విధంగా యోగాసనాలు, ముద్ర, బంధనాలను పిలిచే విధానంలో వ్యత్యాసాలు ఉండవచ్చు ఎనిమిదేళ్ల నుంచి 80 ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు ఆసనాలు వేసే ప్రదేశము చదునుగా. స్వఛ్చమైన గాలి వెలుతురు ప్రసరించేలా ఉండాలి. తొలుత పొట్ట, మూత్రాశయం ఖాళీగా ఉంచుకోవాలి. సాధన మధ్యలో కొంచెం నీరు తాగవచ్చు ఆసనంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శరీర కదలికలకు అనుగుణంగా ఉఛ్వాసనిశ్వాసలు ఉండాలి. శరీరాన్ని సాగదీసేటప్పుడు శ్వాస తీసుకోవడం, సంకోచింప జేసేటప్పుడు (వదులుగా వదిలినపుడు) శ్వాస వదలడం చాలా ముఖ్యం. ఆసనంలో ఉన్నప్పుడు మాత్రం సాధారణ శ్వాస తీసుకోవాలి. ఎంతసేపు శ్వాస తీసుకోవాలి అనేది కొత్తగా ప్రారంభించే వారికి ముఖ్యం కాదు. కాబట్టి, శక్తి అనుసారం చేయవచ్చు ఆసనంలో ఉండే సమయం వృధ్ధి చేసుకోవడానికి ఒకటి రెండు మూడు...పది అంటూ అంకెలు లెక్కపెట్టవచ్చు ఆసనమైనా, ప్రాణాయామమైనా...సాధకులు వారి వయసును బట్టి, దేహపు స్థితిగతులను బట్టి ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయాలి యోగాలో అన్ని ఆసనాలనూ కుడి, ఎడమ రెండు వైపులకూ చేయాలి. శరీరాన్ని సమస్థితిలోకి తీసుకురావడానికి అది ఉపకరిస్తుంది.
ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్