ట్రంపొకరు కిమ్మొకరు | Youtube Donald Trump VS Tiktok Kim | Sakshi
Sakshi News home page

ట్రంపొకరు కిమ్మొకరు

Published Tue, May 19 2020 3:55 AM | Last Updated on Tue, May 19 2020 5:26 AM

Youtube Donald Trump VS Tiktok Kim - Sakshi

ఎవరి లాంగ్వేజ్‌ వారిది. ఎవరి స్టెయిల్‌ వారిది. ఎవరి ఫాలోయింగ్‌ వాళ్లది. ఇద్దరూ కుర్రాళ్లు. ఒకరు యూట్యూబ్‌ ట్రంప్‌. ఇంకొకరు టిక్‌టాక్‌ కిమ్‌. కిమ్‌ చేతి వేళ్ల మధ్య సిగరెట్‌! నాకే పోజ్‌ కొడతాడా.. అని ట్రంప్‌. ట్రంప్‌ మెడలో పొడవాటి ఎర్‌ర్రటి టయ్‌! నాకే డేంజర్‌ సిగ్నలా.. అని కిమ్‌. యుద్ధం మొదలైంది.

క్యారీమినాటీ. ఏంటిది!
పేరా? ఊరా? ఆంగ్లమా? ద్విభాషా పద బంధనమా? ఉఫ్‌.. క్యారీమినాటీ.. మనిషి పేరు. ట్వెంటీ ఇయర్స్‌ న్యూల్డ్‌. ఎవరు వారు? వాడో పెద్ద ఎదవ. ఓమై.. గాడ్‌! ఏంటిది రెస్పెక్ట్‌ లేకుండా!! అవును. అలానే చెప్పాలి క్యారీమినాటీ గురించి. లేకపోతే రెస్పెక్ట్‌ ఇవ్వలేదని ఫీలైపోతాడు. ఏం చేస్తాడు? చేస్తాడు కాదు. చేస్తూ.. స్తూ...స్తూ.. ఉంటాడు. అతడిని యూత్‌ చూస్తూ.. స్తూ.. స్తూ.. ఉంటుంది. యూట్యూబర్‌ క్యారీమినాటీ. అతడికో చానెల్‌ ఉంది యూట్యూబ్‌లో.. ‘క్యారీమినాటీ’ అని. ఆ చానల్‌లో రెగ్యులర్‌గా దుర్భాషాభూయిష్టమైన కామెడీ స్కిట్స్‌ ఇస్తుంటాడు హిందీలో. ‘డిస్‌’ సాంగ్స్, సెటైరికల్‌ ప్యారడీలు క్రియేట్‌ చేస్తుంటాడు. ‘డిస్‌’ అంటే డిస్‌రెస్పెక్ట్‌. ఎవర్నీ రెస్పెక్ట్‌ చెయ్యడు. ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అంటాడు.

వ్యూయర్‌లు పడి చస్తారు... ఆ తొక్కలో ఎక్స్‌ప్రెషన్‌కి! తొక్క అనేమాట కూడా అతడిదే. మాటలు కోటలు దాటుతుంటే ‘వ్యూ’స్‌ కోట్లు దాటడంలో వింతేముంది!! ఎందుకు పుట్టుకొచ్చాడు క్యారీమినాటీ అకస్మాత్తుగా ఇప్పుడు! ఇప్పుడు పుట్టడమేంటి! 1999లో పుట్టాడు. ఢిల్లీ దగ్గర ఫరీదాబాద్‌లో. అసలు పేరు అజయ్‌ నాగర్‌. పదేళ్ల వయసు నుంచి యూట్యూబ్‌కి అతుక్కుపోయాడు. అతడు అతుక్కున్నాడే కానీ ఎవరూ అతణ్ణి అతుక్కోలా. ఈ పెద్దోళ్లున్నారే.. ‘ముందు స్టడీస్‌ మీద కాన్‌సన్‌ట్రేషన్‌ చెయ్‌ బేటా’ అన్నారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ వరకు బండిని లాగించాడు. సెకండ్‌ ఇయర్‌లో ఎకనమిక్స్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ఒక్క లైన్‌ కూడా రాయలేనని. ఎగ్జామ్‌కే వెళ్లలేదు. తర్వాత దూరవిద్యలో గట్టెక్కి, యూట్యూబ్‌నే తన ఇల్లు వాకిలి చేసుకున్నాడు. ఇంట్లోంచి వచ్చేసి ఒక ఆఫీస్‌ కూడా పెట్టుకున్నాడు.

ఆఫీస్‌ పెట్టుకుంటే అయిపోతుందా! ఎవరు దేకుతారు? (ఇదీ మినాటీ లాంగ్వేజీనే. మనం ఇలా చెప్పుకుంటే కానీ మినాటీ దేహం శాంతించదు). ఎంతకూ పేరు రావడం లేదు. ఏం చేయాలి? ఎవర్నైనా ఏకాలి! (రోస్ట్‌). ‘ఎస్‌. ఏకాలి..’ అనుకుని యూట్యూబ్‌లో ఏడు లోకాలు గాలించి ‘ప్యూడీపీ’ ని పట్టుకున్నాడు. ప్యూడీపీ స్వీడిష్‌ యూట్యూబర్‌. చాట్‌ ట్రాక్‌లతో యువలోకాన్ని దున్నేస్తూ ఉన్న జగదేకవీరుడు. మినాటీ కన్నా పదేళ్లు పెద్దవాడు. ‘బై ప్యూడీపీ’ అని అతడి మీద ఒక ‘డిస్‌’ ట్రాక్‌ చేసి వదిలాడు మినాటీ. ‘నీకంత సీన్‌ లేదు. పోటీకొచ్చే తూటా నీ దగ్గర లేదు’ అని నాలుగైదు డైలాగ్స్‌ కొట్టాడు. అది చూసి ‘ఐ లవ్‌ మై కంట్రీ’ అని మన యూత్‌ ఫ్లాట్‌ అయి మినాటీని హీరోను చేసేసింది. నిన్నమొన్ననే అతడు హీరో అయింది.

హీరోకు కొమ్ములొచ్చాయి. కుమ్మడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాడు. ఆమిర్‌ సిద్ధిఖీ దొరికాడు. ముంబై అతడిది. క్యారీమినాటీ యూట్యూబ్‌ హీరో అయితే, ఆమిర్‌ సిద్ధిఖీ టిక్‌టాక్‌ హీరో. ఆ హీరో మే మొదటివారంలో ఓ టిక్‌టాక్‌ వీడియో వదిలాడు. అందులో యూట్యూబర్‌లపై సెటైర్‌లు ఉన్నాయి. ఒక్కడికీ అక్కడ (యూట్యూబ్‌లో) వాక్శుద్ధి లేదు అన్నాడు. చెత్త మాట్లాడతారు అన్నాడు. టిక్‌టాక్‌ని కాపీకొడతారు అన్నాడు. దమ్ముంటే నన్ను కొట్టమనండి అన్నాడు. ఆ వీడియోను పట్టుకున్నాడు కొమ్ముల క్యారీ మినాటీ. అతడిని ‘రోస్ట్‌’ చేస్తూ మే 8న ‘యూట్యూబ్‌ వర్సెన్‌ టిక్‌టాక్‌ – ది ఎండ్‌’ అని ఒక వీడియోను రిలీజ్‌ చేశాడు.

దాన్నిండా మితిమీరిన వెటకారం. ఒకళ్లను తిడుతుంటే అనుకోకుండా ఇంకొళ్లకు తగుల్తుంది. అలాంటి మాటలు వాడాడు క్యారీమినాటీ. ‘మీఠా’ అన్నాడు. ‘చెక్కా’అన్నాడు. ‘మిథాయి దుకాన్‌ మే లే జావూంగాతో 200 మే బిక్‌ జాయేగా’ అన్నాడు. ‘స్వీట్‌షాప్‌ దగ్గర 200 రూపాయలకు అమ్ముడుపోయే వాళ్లలాంటి వాడివి నువ్వు’ అన్నాడు. ఆ మాటకు ‘హోమో’ కమ్యూనిటీ నొచ్చుకుంది. చివరికి ఆ వీడియోను యూట్యూబ్‌ మే 14న తొలగించింది. ‘టెర్మ్స్‌ ఆఫ్‌ యూసేజ్‌’ని మీరినప్పుడే ఇలా డిలీట్‌ చేస్తుంది యూట్యూబ్‌. క్యారీమినాటీ ఎక్కడ టెర్మ్స్‌ ఆఫ్‌ యూసేజ్‌ తప్పాడన్న దానిపై ఇప్పుడు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో డిబేట్‌ నడుస్తోంది. క్యారీ మాత్రం తనెవర్నీ కించపరచలేదని అంటున్నాడు. 

మొదట టిక్‌టాకర్‌లకు, యూట్యూబర్‌లకు జరిగిన ఫైట్‌.. మధ్యలో దిశ మార్చుకుని ఆమిర్‌ సిద్ధిఖీ, క్యారీమినాటీ మధ్య మొదలైంది. క్యారీ వీడియోను యూట్యూబ్‌ తొలగించగానే, క్యారీ అభిమానులు యూట్యూబ్‌ మీదకు యుద్ధానికి వెళ్లారు. అయితే యూట్యూబ్‌ యుద్ధాలు చెయ్యదు. చెయ్యనివ్వదు. యుద్ధనివారణకు మాత్రం చర్యలు తీసుకుంటుంది. మాటలో, పాటలో, చూపులో ఏ కొంచెం ద్వేషం ఉన్నా డిలీట్‌ బటన్‌ కొట్టేస్తుంది. నిన్ను మించినవాడు లేడని క్యారీమినాటీకి సిల్వర్‌ బటన్‌లు, గోల్డెన్‌ బటన్‌లు, ౖyð మండ్‌ బటన్‌లు అవార్డుగా ఇచ్చిన యూట్యూబ్‌ ఇప్పడు డిలీట్‌ బటన్‌ వాడవలసి వచ్చిందంటే కారణం లేకుండా ఉంటుందా, ఆ కారణం వెనుక క్యారీమినాటీ లేకుండా ఉంటాడా?

మమ్మల్నెందుకు లాగుతారు?
మిమ్మల్ని ఉల్లాసపరచడానికి మేమిక్కడ లేము. మా మీద జోకులు వేసుకోవడం ఏమిటి? మిమ్మల్ని మీరు కించపరచుకోడానికి, అవమానించుకోడానికి, అసహ్యించుకోడానికి మమ్మల్ని పోలుస్తారెందుకు? నిత్యం మేము జీవించడానికి పోరాటం చేస్తూ ఉంటాం. మనుగడ కోసం మేము ఉద్యమిస్తున్నాం. మా ఉద్యమం ఆగేది కాదు. – రిషి వ్యాస్, ‘క్వీర్‌’ హక్కుల కార్యకర్త

రోస్ట్‌ చేస్తే ఊరుకోం
యూట్యూబర్స్‌ని రెచ్చగొట్టే ఉద్దేశం లేదు. టిక్‌టాకర్స్‌ అంతా కలిసికట్టుగా ఉండాలి అన్నాను అంతే. విమర్శను మేము పాజిటివ్‌గా తీసుకుంటాం. అయితే సైబర్‌ బుల్లీయింVŠ ని సహించం. అతడి (క్యారీమినాటీ) వీడియోను యూట్యూబ్‌ ఎందుకు తొలగించిందో అతడికే తెలియాలి. మమ్మల్ని రోస్ట్‌ చేసినవాళ్లను మేము రోస్ట్‌ చేయకుండా వదలం. – ఆమిర్‌ సిద్ధిఖీ, టిక్‌టాకర్‌

అపార్థం చేసుకున్నారు
యూట్యూబ్‌ నా వీడియోను ఎందుకు డిలీట్‌ చేసిందో అర్థం కావడం లేదు. నన్ను అపార్థం చేసుకున్నారు. నేను హిందీలో మాట్లాడతాను. దానిని ఇంగ్లిష్‌లోకి సరిగా తర్జుమా చెయ్యకపోతే అపార్థాలే వస్తాయి. ఒక వరసలో మాట్లాడుతున్నప్పుడు ఆ వరసలోని ఒక మాటనో, కొన్ని మాటల్నో పట్టుకుని జడ్జ్‌ చెయ్యడం కరెక్టు కాదు. – క్యారీమినాటీ, యూట్యూబర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement