ఓ బాలిక వ్యథ
కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన కన్నవాళ్లే.. ఆడపిల్లన్న కారణంగా గాలికి వదిలేసి వెళితే... ఆ వేదన వర్ణించడానికి మాటలు చాలవు. అలా నిర్లక్ష్యానికి గురైన ఓ బాలిక కథే ఇది..
- సరస్వతి రమ
నీలిమకు ఇప్పుడు పన్నెండేళ్లు. ఏడో తరగతి చదువుతోంది. కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉంటోంది. ఆ అమ్మాయి ఈ ఆశ్రమానికి ఎప్పుడు, ఎలా వచ్చిందంటే..
నాలుగేళ్ల కిందట..
చలికాలంలో ఓ రోజు సాయంత్రం.. దవడలు కదిలే చలిలో నల్గొండ బస్టాండ్‌లోని బెంచి మీద ఏడేళ్ల పాప కూర్చునుంది.. అమాయకంగా దిక్కులు చూస్తూ! కిందటి రోజు రాత్రి నుంచి అక్కడే అలాగే కూర్చునుంది. కడుపులో తిండిలేదు.. కంటి మీద కునుకు లేదు. కనీసం మంచి నీళ్లు కూడా లేవు. నెమ్మది నెమ్మదిగా నీరసించి పోతోంది. అలాగే నిస్సత్తువతో నిద్రలోకి జారుకుంది. మరో 24 గంటలు గడిచాయి. సొమ్మసిల్లి పోయింది. బస్టాండ్‌లో ఈ పాపను గమనించిన ఎవరో పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి పాపను తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లోనే అన్నం తినిపించారు. తనవాళ్ల వివరాలు అడిగితే చెప్పిందిలా.. ‘నాకు ఓ తమ్ముడు. నాన్న లేడు. తమ్ముడిని తీసుకొని అమ్మ ఇంకో నాన్నతో వెళ్లిపోయింది... నన్ను బస్టాండ్‌లో వదిలేసి!’ ఏ భావమూ లేకుండా చేతి వేళ్ల గోర్లు చూసుకుంటూ.‘ఎప్పుడు?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్. ‘ఊ.. మొన్న’ తలెత్తి అతని కళ్లలోకి చూస్తూ సమాధానమిచ్చింది అదే అమాయకత్వంతో.
కస్తూర్బా గాంధీ ఆశ్రమం నిర్వాహకురాలికి ఆ రాత్రే ఫోన్ చేశారు పోలీసులు. ‘ఓ అమ్మాయి ఉంది. మీ ఆశ్రమానికి తీసుకెళ్తారా?’ అని. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదిన్నర. ‘ఈ రాత్రి.. ఇంత చలిలో అంతదూరం రాలేం. మీరు అక్కడి నుంచి ఫలానా చోటికి వస్తే మేమూ అక్కడికి వచ్చి పాపను తీసుకెళ్తాం’ అని చెప్పి.. అప్పటికప్పుడు టాక్సీ మాట్లాడుకొని అసిస్టెంట్‌ను తీసుకొని బయలుదేరారు. నీలిమను ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ పాపను తోటివాళ్లతో కలిసేలా చేయడానికి చాలానే శ్రమ పడాల్సి వచ్చింది వీళ్లకు. ఆ వయసులో ఉండాల్సిన ఉత్సాహం, చురుకుదనం లేకుండా దిగాలుపడి ఉండేది.
ఇప్పుడు..
రివ్వున వీచే గాలి తెమ్మెరలా ఉంటుంది. మాటల ప్రవాహం.. కలివిడితనమంటే నీలిమేమో అన్నట్టు ఉంటుంది. చదువులోనూ ఫస్టే! పెద్దయ్యాక డాక్టర్‌నవుతా అంటుంది. ఆ మాటల్లో తన శక్తి ఏంటో తెలుసుకున్న ఆత్మవిశ్వాసం వినిపిస్తుంది. నీలిమ మన బిడ్డ. కాపాడుకుందాం.. డాక్టర్ కావాలనుకునే ఆ పిల్ల ఆశ నెరవేరేలా సహకరిద్దాం.. ఇంకే అడ్డంకులు కల్పించకుండా!.
(పేరు మార్చాం)