మగువలు... మహరాణులు
మగువలు మల్టీ టాస్కింగ్ రాణులు అంటున్నారు బ్యూటీ క్వీన్ రుచికాశర్మ. వంట చేయడంలోనే కాదు.. కుటుంబాన్ని నడపడంలోనూ మహిళలు ది బెస్ట్ అని చెబుతున్నారు. స్త్రీలు ఎంపవర్ అయితేనే దేశం సూపర్ పవర్ అవుతుందంటున్నారు. మిసెస్ సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ 2014కు ఎన్నికైన తర్వాత తన కు, తన మాటకూ వెయిట్ పెరిగిందంటున్న ఈ బ్యూటీ క్వీన్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. విశేషాలు ఆమె మాటల్లోనే..
18 ఏళ్లుగా నేను వంట చేస్తున్నాను. బ్యూటీ క్వీన్ కిరీటం దక్కటం చాలా ఫెంటాస్టిక్ ఫీలింగ్. ఇది నా లైఫ్‌కి సెకండ్ ఇన్నింగ్స్. ఇప్పుడు చాలామంది నన్ను గుర్తుపడుతున్నారు. బ్యూటీ క్వీన్ అంటే కేవలం కిరీట ధారణ మాత్రమే కాదు. దాన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఈ అందాల పోటీలో నా ప్లాట్‌ఫాం విమెన్ ఎంపవర్‌మెంట్. దాని కోసమే నా జీవితం అంకితం చేయాలనుకుంటున్నాను.
పది పనులు చేయగలం..
మహిళలు పుట్టుకతోనే మల్టీ టాలెంటెడ్. ఏకకాలంలో పది పనులు చేయగలం. టైం మేనేజ్‌మెంట్‌లో కూడా పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. మా బాబు ఇంటికి రాగానే వాడికి హోం వర్క్ చేయిస్తూ, వంట పని చేసుకుంటాను. ఫోన్లు వస్తే ఆన్సర్ చేస్తాను. మళ్లీ మా వాడి డౌట్లు కూడా తీరుస్తుంటాను. అలా మహిళలకు ఉన్న అపురూపమైన వరం మల్టీ టాస్కింగ్. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఏ రంగంలో అయినా సక్సెస్ కావొచ్చు.
సీన్ మారింది..
ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అయ్యేవారు. కాలక్రమంలో కుటుంబ బాధ్యతతో భర్తతో పాటు ఆర్థిక భారాన్ని పంచుకున్నారు. కొంతకాలం వరకు సెకండ్ ఎర్నర్‌గా ఉన్న స్త్రీలు ఇప్పుడు ఓన్లీ ఎర్నర్ అవుతున్నారు. ఏ పనైనా క్రియేటివ్‌గా చేయడంలో మహిళలు ముందుంటారు. అలాంటి స్త్రీలకు ఏదైనా కళలో కొంత శిక్షణ ఇవ్వగలిగితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. దక్షిణాసియా, ఇండియాలో అందరు స్త్రీలు 9-6 ఉద్యోగాలకు వెళ్లలేరు. వాళ్లు ఇంటి నుంచే ఏదైనా తయారు చేసి, వ్యాపారం చేసుకోగలిగితే ఆ కుటుంబ పరిస్థితే మారిపోతుంది.
అదే లక్ష్యం
జీఎంఆర్ ఫౌండేషన్ వాళ్లు మూడు గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలకు ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. అందులో నేను కూడా పాలుపంచుకుంటున్నాను. వచ్చే మూడేళ్లలో వీలైనంత మంది మహిళలను ఆర్థిక శక్తిగా తయారు చేయడం నా లక్ష్యం. ఎక్కువ పెట్టుబడి అవసరం లేని చాక్‌లెట్ మేకింగ్, క్యాండిల్ తయారీ నేర్పుతున్నాను. ఇక్కడ తయారైన చాక్‌లెట్స్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విక్రయిస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్‌ని నామినేట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ కోసం ఎంకరేజ్ చేస్తున్నాం. 5 వేల పుస్తకాలు రూరల్ ప్రభుత్వ పాఠశాలల్లో పంచాలని నిర్ణయించుకున్నాం. శ్రీశైలం దగ్గర కునుకూరులోని జిల్లా పరిషత్ స్కూల్లో 500 పుస్తకాలు డొనేట్ చేశాను.
ఆధ్యాత్మికతతో ఆత్మవిశ్వాసం
ట్రెడిషనల్ కుటుంబంలో నుంచి వచ్చాను. నా జీవితంలో స్ట్రగుల్స్ చాలానే ఉన్నాయి. మంచి చెడు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి స్పిరిట్యువాలిటీ హెల్ప్ అవుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఉంటే సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ఆత్మవిశ్వాసం వస్తుంది.
- ..:: ఓ మధు
ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్