'అభయ'కు చేటు చేసిన చాటింగ్!
'అభయ'పై సామూహిక అత్యాచార ఘటన భాగ్యనగర వాసులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనకు ఏమరపాటు కూడా ఒక కారణమని తెలుస్తోంది. బాధితురాలు ఏమరపాటుగా ఉండడం వల్లే దుండగులు ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. స్వీయరక్షణ విషయంలో 'అభయ' కాస్త అప్రమత్తంగా వ్యవహరించివుంటే కామాంధుల బారి నుంచి బయటపడేదన్న వాదన విన్పిస్తోంది.
ఒక్కోసారి మన నిర్లక్ష్యమే నేరగాళ్లకు ఆయుధమవుతుంది. 'అభయ' విషయంలోనూ ఇది రుజువయింది. తన హాస్టల్కు వెళ్లేందుకు కిరాయి కారులో ఎక్కిన వెంటనే ఆమె సెల్ఫోన్ చాటింగ్లో మునిగిపోయింది. కారు ఎటు వెళుతున్నదీ గమనించకుండా స్నేహితుడితో సెల్‌ఫోన్ చాటింగ్‌లో లీనమయింది. ఆమె ఏమరపాటును దుండగులు తమకు అనువుగా మలుచుకున్నారు. కారును దారి మళ్లించి దారుణానికి పాల్పడ్డారు.
సెల్ఫోన్ చాటింగ్ నుంచి అభయ తేరుకునేటప్పటికీ ఆలస్యమైపోయింది. సెల్ఫోన్ ద్వారా బెంగళూరులోని తన స్నేహితుడి సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. అతడి సలహాతో కేకలు పెట్టడంతో ఆమె సెల్‌ఫోన్ లాక్కున్న దుండగులు స్విచ్ఛాఫ్ చేశారు. కేకలు బయటకు విన్పించకుండా కారు అద్దాలను మూసేశారు. తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెను పాడుచేశారు.
అడుగడునా కీచక సంతతి పొంచివున్న కంప్యూటర్ కాలంలో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని 'అభయ' ఉదంతం చాటిచెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అందించిన సౌలభ్యాలకు బానిసలుగా మారి ఆత్మరక్షణ మర్చిపోవద్దని హెచ్చరిస్తోందీ ఘటన. చుట్టుపక్కల గమనించకుండా సెల్ఫోన్లో మునిగి తేలడం నేటి తరంలో చాలా మందికి బలహీనతగా మారడం దురదృష్టకర పరిణామం. స్వీయ రక్షణ గురించి పట్టించుకోకుండా సాంకేతి వెల్లువలో కొట్టుకుపోతుండండం ప్రమాదకర ధోరణిగా మారుతోంది.
బెంగళూరులోని స్నేహితుడికి సమాచారం అందించిన 'అభయ' కనీసం పోలీసు నంబర్ 100కు సమాచారమిచ్చినా దుండగులు బరితెగించి ఉండేవారు కాదేమో. చాలా మందికి ఈ నంబర్ ఉందన్న సంగతి తెలియపోవడం శోచనీయం. నేరాల నిరోధానికి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండడం ద్వారా కొన్ని ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. తనను కాటేసేందుకు చూసిన ఆటోడ్రైవర్ల కళ్లలో పెప్పర్ పౌడర్ చల్లి ఓ యువతి ఇటీవల బయటపడిన ఉదంతం మనకు గుర్తుండే వుంటుంది. ఏదేమైనా కీచకుల పశుశాంఛకు 'అభయ' బలైంది. ఆత్మరక్షణ పట్ల అతివలు అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇటువంటివి చాలా వరకు తగ్గే అవకాశముంది.