సెలబ్రిటీ కాదు కంప్లీట్ మ్యాన్
యాడ్స్.. ప్రొడక్ట్ క్వాలిటీని ఎంతవరకు ప్రొజెక్ట్ చేస్తున్నాయో తెలియదు కానీ మారిన తరంలోని మానవ సంబంధాలను మాత్రం కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా మీసం మెలేసే మగాడు సున్నితంగా మారిన వైనానికి అద్దం పడుతున్నాయి!. ఓరియో బిస్కట్స్ నాన్న.. భారత్ మ్యాట్రిమోనీ భర్త.. క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ స్నేహితుడిని కలుపుకొని రేమండ్స్ ది కంప్లీట్ మ్యాన్‌ని ఆవిష్కరిస్తోంది! యాడ్స్‌లోనే కాదు ఇంట్లోనూ అలాగే ఉన్న ఈతరం పురుషుడి గురించి కథనం..
నిజమైన సంఘటనలే ఊపిరి
సెలబ్రిటీలే కాదు కంప్లీట్ మ్యాన్‌కి అద్దంపట్టే సామాన్యూలూ ఉన్నారు. సికింద్రాబాద్‌కి చెందిన కోమల్‌రెడ్డి నేటి తరం పురుషుడికి ప్రతినిధి. ఆయన గురించి వాళ్లావిడ శిరీష ‘నాకు డిగ్రీ అవగానే పెళ్లయింది. పీజీ చేయాలని ఉండింది. కోమల్‌తో చెబితే ఓకే అన్నాడు. ఎంట్రెన్స్ రాస్తే సీట్ వచ్చింది. ఫస్టియర్ అయేటప్పటికి కన్సీవ్ అయ్యాను. సెకండియర్ ఎగ్జామ్స్ అప్పటికి చంటిబిడ్డ తల్లిని. రోజుల బిడ్డను పట్టుకొని ఎగ్జామ్స్ రాయడమా అని భయపడ్డాను.
కోమల్ ధైర్యం చెప్పి పరీక్షలకు రెడీ చేశాడు. నేను ఎగ్జామ్‌నేషన్ హాల్లో.. తను బయట పాపను ఎత్తుకొని పచార్లు.. ఇలాంటి నేచర్ ఉన్న మగవాళ్లను ఇటు మా ఇంట్లోను, అటు వాళ్లింట్లోనూ చూడలేదు’ అంది. ‘శిరీష నా కోసం కొన్నింటిని శాక్రిఫైస్ చేసినప్పుడు ఆమె లైఫ్ యాంబిషన్ కోసం నేనెందుకు చూయకూడదని అనుకున్నాను. మా పాప అనన్య విషయంలో తల్లిగా తనకెంత బాధ్యత, ప్రేమ ఉన్నాయో, తండ్రిగా నాకూ అంతే బాధ్యత, ప్రేమ ఉన్నాయి’ అంటాడు కోమల్.
యాడ్స్ ప్రభావం..
యాడ్స్‌కి రియల్ ఘటనలు ప్రేరణ ఇచ్చినట్టే యాడ్స్ ప్రభావమూ తన మీదుందంటాడు బాలశేఖర్. ‘సినిమాలు మగవాళ్లలోని సున్నితత్వాన్ని చంపేస్తుంటే ఇలాంటి యాడ్స్ మరింత సెన్సిటైజ్ చేస్తున్నాయి. నా పెళ్లయి తొమ్మిది నెలలైంది. నా భార్య శ్రావణి.. మంచి ఫ్రెండ్. ఏ విషయంలోనూ సొంత నిర్ణయం తీసుకోను. నేను మల్టీమీడియా చేశాను. తను బీటెక్. ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్‌చేశాం. ఆడవాళ్లు సెకండ్ జెండర్‌కాదు.. మగవాళ్లతో ఈక్వల్. ఈ భావన నాలో కలగడానికి నాకున్న రీడింగ్ హాబీ ఒక కారణమైతే.. రేమండ్స్‌లాంటి యాడ్సూ కారణమే’ అంటాడు బాలశేఖర్. ‘నిజమే.. శేఖర్ భర్తగా కన్నా ఓ ఫ్రెండ్‌లా ఉంటాడు. అన్నీ షేర్ చేసుకుంటాను’ అంటుంది బాలశేఖర్ భార్య శ్రావణి.