మినీభారత్
మా భాగ్యనగరం
భిన్నత్వంలో ఏకత్వం సాధించినప్పుడే అభివృద్ధి మూలాలు గట్టిగా ఉంటాయి. అలాంటి చరిత్ర ఉన్న సీమ భాగ్యనగరం. దక్షిణాది వారికి రెడ్‌కార్పెట్ పరచిన హైదరాబాద్.. ఉత్తరాదివారినీ అంతే హుందాగా ఆహ్వానించింది. అందుకే సిటీకి వచ్చి బాగుపడిన వారంతా.. యే షహర్ హమారా హై అంటారు.
అలా నగరానికి వచ్చిన అగర్వాల్ సామాజిక వర్గం కూడా ఇదే మాట చెబుతోంది. నవాబుల కాలంలో నగరానికి వలస వచ్చిన వీళ్లు.. వ్యాపార రంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్ అడ్డాగా సక్సెస్ సాధించిన అగర్వాల్‌లు ఇక్కడి జనాలతో మమేకం అయ్యారు. ఇక్కడి సంస్కృతికి అనుగుణంగా జీవనం కొనసాగిస్తున్నారు.
ఉత్తర భారతీయులైన అగర్వాల్ సామాజిక వర్గం..
శతాబ్దాల కిందట నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తొలినాళ్లలో చిరు వ్యాపారులుగా జీవనాన్ని ప్రారంభించిన వీళ్లు.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాపారాల్లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. బంగారం, వెండి, ముత్యాలు, వస్త్రాలు, షేర్ మార్కెట్లతో పాటు బ్యాంక్‌ల నిర్వహణ, పరిశ్రమల స్థాపన వంటి రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అఖిల భారత
సర్వీసుల్లోనూ తమ ప్రాతినిధ్యాన్ని కనబరుస్తున్నారు.
రాణి సతి (దాది)కి ప్రత్యేక పూజలు
దక్కన్ క్షేత్రానికి వచ్చిన అగర్వాల్‌లు తమ సంప్రదాయాలను నేటికీ పాటిస్తున్నారు. శతాబ్దాలుగా అగర్వాల్‌ల పూజలందుకుంటున్న రాణి సతీ (దాది) ఆలయాన్ని పాతబస్తీ ఘాన్సీబజార్‌లో నిర్మించుకున్నారు. ఏటా ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలను నిర్వహిస్తారు. రాజ స్థాన్‌కు చెందిన అగర్వాల్ సమాజ్ మహిళలు ఈ వేడుకలో అధిక సంఖ్యలో పాల్గొంటారు. రాణి సతీ దాదికి పూజలు చేయడం వెనుక చారిత్రక కథ ఉంది. 726 ఏళ్ల కిందట రాజస్థాన్‌లోని బివానీ నవాబ్ జడ్ చందు దాస్‌తో జరిగిన యుద్ధంలో రాణి సతీ భర్త తన్‌దన్ దాస్ వీర మరణం పొందారు.
దీంతో తన భర్తతో పాటు రాణి సతీసహగమనం చేశారు. అప్పటి నుంచి అగర్వాల్‌లు ఆనాటి దురదృష్టకర సంఘటన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రత్యేక పూజలు చేస్తూ వస్తున్నారు. తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని, తమ పసుపు కుంకుమలు కలకాలం నిలవాలని రాణి సతీకి పూజలు చేస్తారు. ఇక దసరా వచ్చిందంటే అగర్వాల్ కుటుంబాల్లో సందడే వేరు. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా నృత్యాలతో హోరెత్తిస్తారు. దీపావళి వేడుక ప్రత్యేకంగా చేసుకుంటారు.
నగరంలో..
హైదరాబాద్‌లో అగర్వాల్‌ల జనాభా సుమారు 5 లక్షల వరకూ ఉంటుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వీరు నివసిస్తున్నారు. ముఖ్యంగా ఘాన్సీబజార్, రికాబ్‌గంజ్, పటేల్ మార్కెట్, బండికా అడ్డా, కబూతర్ ఖానా, పురానాపూల్, షంషేర్‌గంజ్ తదితర ప్రాంతాల్లో వీళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే అగర్వాల్‌లు నగరంలో పలు సేవా సంస్థలు నిర్వహిస్తున్నారు. అగర్వాల్ సేవా సమితి, ఏపీ అగర్వాల్ సమాజ్, అగ్రసేన్ సమితి తదితర స్వచ్ఛంద సంస్థలు సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి.