అనుష్క్
తెలుగు సినిమా పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న బాహుబలి చిత్రం కోసం పాత్రపరంగా హీరోయిన్ అనుష్క చాలా కష్టపడుతోంది. దాదాపు రెండేళ్లకుపైగా ఈ సినిమా కోసం జక్కన్న, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తూ దగ్గుబాటి రానా కూడా వారికి తోడయ్యాడు. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ పోరాట సన్నవేశాలకు ప్రభాస్, రానాలకు మంచి శిక్షణ ఇప్పించిన తరువాతే జక్కన్న షూటింగ్ మొదలు పెడుతున్నారు. ఈ శిక్షణను, రిహార్సల్స్ను ఈ ఇద్దరు హీరోలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాపం హీరోయిన్ అనుష్క మాత్రం పడరానిపాట్లు పడుతోందని సమాచారం. హీరోయిన్లు అందాలు ఆరబోయడం - చిలక పలుకులు పలకడం - పాటలకు చిందులు వేయడం... వంటివే కాకుండా చారిత్రక పాత్రలలో అద్బుతమైన నటనను ప్రదర్శించగలరని అనుష్క ఇంతకు ముందే నిరూపించింది. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి సాహసతోపేతమైన సన్నివేశాలలో నటించడానికి తగినవిధంగా శిక్షణ పొంది పోరాట సన్నివేశాలలో కూడా నటిస్తోంది.
ఒక నటిగా అంకిత భావవంతో కఠిన శిక్షణ పొంది పాత్ర పరంగా అనుష్క ఎంత కష్టపడినా మన జక్కన్న సంతృప్తి చెందడంలేదట. షూటింగ్లో ఏమాత్రం తేడా వచ్చినా, తను అనుకున్నట్లు రాకపోయినా రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం పనిచేసేవారందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాకుండా భారత చలన చిత్ర రంగం మొత్తం ఈ సినిమా కోసం ఎదురు చూస్తుందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో హీరోలు ప్రభాస్, రానా కష్టాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ అనుష్క మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నట్లు ఫిలింనగర్ టాక్. ఐతే ఇది రాజమౌళి చిత్రం. కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని అనుష్కకు తెలుసు. అందు వల్ల అనుష్క ఇష్టంగానే ఆ కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. గ్లామర్ పాత్రలు చేసుకునే హీరోయిన్లకు ఇలాంటి కష్టాలూ ఉండవు. కానీ పాత్రల పరంగా ప్రేక్షకుల హృదయాలలో పదికాలాలపాటు నిలవాలనుకునేవారు ఇటువంటి సాహసాలు చేయకతప్పదు. రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి అవకాశం ఈ భామకు దక్కింది. దక్కిన అవకాశానికి న్యాయం చేయడం కోసం అనుష్క నిజాయితీగా కష్టపడుతోంది.
వృత్తి, పాత్ర పరంగా ఇన్ని కష్టాల్లో ఉన్న అనుష్కపై కోలీవుడ్లో ప్రేమ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎంత సెలబ్రిటీలైనా వాళ్లు మనుషులే కదా! వారికి సాధారణ మనుషులకు ఉండే ఆశలు, కోరికలు, ప్రేమలు... అన్నీ ఉంటాయి. వారికి ఎఫైర్ల ఉండకూడదని ఏమీలేదు. అయితే వారు సెలబ్రిటీలు కాబట్టి ఇంత ఉంటే, అంత ప్రచారం జరుగుతుంది. అది సహజం. అనుష్క ఈ మధ్య ఓ తమిళ యువహీరోతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. ఆ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నట్లు, రెడ్హ్యాండెడ్గా దొరికిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా హీరో ?
ఆ హీరో ఆ మధ్య నయనతారతో కూడా ప్రేమాయణం సాగించినట్లు ప్రచారం జరిగింది. ఆయనే తమిళంలో మంచి క్రేజ్ మీదున్న యువ హీరో ఆర్య. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలు హిట్స్మీద హిట్స్ కొడుతున్నాయి. సినిమా ప్రపంచంలో హిట్సే కదా ముఖ్యం. దాంతో కోలివుడ్లో అందగత్తెలంతా ఆర్యతో నటించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అంతే కాకుండా ఎఫైర్ల విషయంలో కూడా ఆర్య ఎప్పుడూ తమిళ మీడియాలో నానుతున్నాడు. ఆ మధ్య నయనతారతో ఎఫైర్ నడిపాడని విస్తృతంగా ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ అనుష్కను బుట్టలోవేసుకున్నాడని ప్రచారం. చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో ఆర్య, అనుష్క ఇద్దరూ కలిసి కనిపించారట. అదీ ఎవరికీ? ఓ విలేకరికి! అంతే ఇంకేముంది ఆ విలేకరి అదే అదునుగా భావించి కెమెరాకు పనికల్పించాడు. ఇప్పుడు ఈ న్యూసే కోలీవుడ్లో హాట్ టాపిక్. నయనతార ఈ మధ్య తన పని తను చూసుకుంటూ బిజీ అయిపోయింది. అంతేకాకుండా ఆర్యకు దూరంగా ఉంటుంది. దాంతో ఈ యువ హీరో కొత్త గర్ల్ ఫ్రెండ్ని వెతుకున్నాడని కోలివుడ్లో రూమర్స్ వినవస్తున్నాయి. బాహుబలి చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్ని అనుష్కకు ఎఫైర్ నడిపే అంత సమయం ఉందో లేదో తెలిదు. ఆలోచన ఉంటే సమయం అదే సరిపోతుందంటారు. ఇందులో ఎంత నిజముందో తెలీదు. అయితే ఈ మధ్యనే ఆర్య-అనుష్క కలిసి 'వర్ణ' (తమిళంలో ఇరాండమ్ ఉలగమ్) చిత్రంలో నటించారు. అంతే కాకుండా తరచూ వీరిద్దరూ కలసి కనిపిస్తున్నారు. ఈ ప్రచారానికి ఇవన్నీ కూడా కారణాలై ఉండవచ్చు.