ఆర్ట్ లవ్‌లీ.. సుకాంత్ పాణిగ్రాహి
ఆర్ట్ డెరైక్టర్- బాలీవుడ్: సినిమా అనేది ఓ ఆర్ట్.. ఆ కళను మరింత అందంగా చూపించేది మాత్రం ఆర్ట్ డెరైక్టరే. తన పనితనంతో ఆర్ట్ డెరైక్షన్‌ను సినిమా పబ్లిసిటీకి బ్రాండ్‌గా మార్చిన కళాదర్శకుడు సుకాంత్ పాణిగ్రాహి. ఆయన మొదటి సినిమా ‘గంగాజల్’ నుంచి నిన్నమొన్నటి ‘నోవన్ కిల్డ్ జెస్సికా, ఏక్ థా టైగర్..’ వరకు ఆర్ట్ డెరైక్షన్ వహించిన డజను సినిమాలు చూస్తే తెలుస్తుంది ఆ కళాతపన. మాదాపూర్ హెచ్‌ఐసీసీలో శనివారం ప్రారంభమైన ఆగస్ట్ ఫెస్ట్‌కి సుకాంత్ ఆత్మీయ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’కు హలో చెప్పారు. నేను పుట్టి పెరిగింది.. ఒడిశాలోని ఓ పల్లెటూరులో. నేను మొదటిసారి ఆర్ట్ చూసింది మా అమ్మ వేసిన ముగ్గులోనే. మా ఊరి పరిసరాలు నాకు కళాత్మకంగా కనిపించేవి. వీటి మీద మనసై.. చదువుపై దృష్టి పెట్టలేకపోయా. కళలు కడుపు నింపుతాయా అని ఎందరన్నా నేను మారలేదు.
చలో ముంబై..
సినిమాల్లో పనిచేయాలని.. పదహారో ఏట ముంబైకి వచ్చేశాను. ఇండస్ట్రీ తెలియదు.. దొరికిన పని చేయడం.. ఫుట్‌పాత్‌పై గడపడం ఇదే పని. ఆ కష్టాల్లో ఎన్నో కోణాలు కనిపించాయి. డ్రగ్స్ వలలో చిక్కుకున్న పిల్లలను చూశాను. సినిమాకు వర్క్ చేయాలన్న నా లక్ష్యం బలంగా లేకపోతే.. నేనూ ఆ రొంపిలో కూరుకుపోయేవాడినేమో. ఆ టైంలోనే సినిమాల్లో పనిచేసే ఓ వ్యక్తి కలిశాడు. స్టూడియోకి తీసుకెళ్లాడు.
స్వీపర్ టు కార్పెంటర్
ఇండస్ట్రీలో స్వీపర్‌గా మొదలైన నా ఉద్యోగం క్లీనర్, టీ బాయ్, లిఫ్టర్, వెల్డర్, కార్పెంటర్, ఆర్ట్ అసిస్టెంట్ ఇలా సాగి.. ఆర్ట్ డెరైక్టర్‌గా నిలబెట్టింది. ఈ ప్రయూణానికి ఎనిమిదేళ్లు పట్టింది. కళాదర్శకుడిగా నా మొదటి సినిమా గంగాజల్. నన్ను నేను ప్రూవ్ చేసుకున్న సినిమా. అక్కడి నుంచి చక్ దే ఇండియా, న్యూయార్క్, దేవ్ డి, చిల్లర్ పార్టీ.. ఇలా ప్రతి సినిమా నా నేమ్‌కార్డ్‌ను సుస్థిరం చేసిందే!
మాఫియా ఫౌండర్..
సినిమాలతో బిజీగా ఉంటూనే ఖాళీ టైంలో లైక్‌మైండెడ్ పీపుల్‌తో సృజనాత్మక కార్యక్రమాలు చేయడానికి ‘మాఫియా’ను స్థాపించాను. కఅఊఐఅ.. అంటే ‘మ్యూజిక్, ఆర్ట్, ఫిల్మ్ మేకింగ్.. ఇంట్రెస్టెడ్ ఆజా’ అని! ఈ మూడు కళల్లో ఆసక్తి ఉన్న వాళ్లమంతా ఓ గ్రూప్‌గా ఏర్పడి లీజర్ ఉన్నప్పుడల్లా ప్రోగ్రామ్స్ చేస్తుంటాం.
నో పీవోపీ.. నో ప్లాస్టిక్..
నా తొలి సినిమాలకు ప్లాస్టర్ ఆఫ్ పారీస్, ప్లాస్టిక్‌ను ఉపయోగించి సెట్లు వేశాను. వాటితో పని అయిపోయాక తిరిగి చూసుకుంటే.. నేను పర్యావరణాన్ని పొల్యూట్ చేస్తున్నాననిపించింది. తర్వాతి చిత్రం నుంచి పీవోపీ, ప్లాస్టిక్‌కు గుడ్ బై చెప్పేశాను. భూమిలో తేలికగా కలిసిపోయే మెటీరియల్‌తోనే సెట్స్ వేయడం మొదలుపెట్టాను.
పదిహేనేళ్ల అనుబంధం..
హైదరాబాద్‌తో నాకు పదిహేనేళ్ల అనుబంధం ఉంది. కె. రాఘవేంద్రరావు ‘మంజునాథ’ సినిమా కోసం ఫస్ట్‌టైమ్ హైదరాబాద్ వచ్చాను. ఇక్కడి ఫుడ్, వాతావరణం బాగా నచ్చుతాయి. ఇప్పటి వరకు నేను చూసిన సిటీ క్లీన్ అండ్ గ్రీన్‌గా ప్రశాంతంగా ఉంది.
వ్యర్థానికి అర్థం చెబుతా
సుకాంత్ ఆర్ట్ డెరైక్టరే కాదు శిల్పి కూడా. ఈ వేస్ట్, ప్లాస్టిక్‌తో రకరకాల శిల్పాలను చేశాడు. పర్యావరణ ప్రేమికుడిగా మారిన సుకాంత్ ప్రభుత్వానికి ఓ వినతి చేస్తున్నాడు. భూమిలో కలసిపోని చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా.. దానికో స్థలం కేటాయించాలంటున్నాడు. ఆ ప్రదేశాన్ని తాను ఓ కళానిలయంగా మారుస్తానని చెబుతున్నాడు. ఆ వ్యర్థానికి ఓ రూపాన్నివ్వడమే కాక.. దాన్నో వర్క్‌షాప్‌గా మలుస్తానంటున్నాడు. ఆ ప్రాంతాన్ని ఎకో ఫ్రెండ్లీ టౌన్‌షిప్‌గా మార్చి.. కళలకు, పర్యావరణానికి ఓ వేదికగా మలచాలనుకుంటున్నాడు.
- సరస్వతి రమ