కొంగు సింగారం
వాలుజడ చివరన వేలాడుతూ.. నడకలతో నాట్యం చేసే కుచ్చులంటే మహిళలకు మహా ఇష్టం. అయితే బారెడు జడలు కానరాక బావురుమంటున్న కుచ్చులకు ఫ్యాషన్ ప్రపంచం సరికొత్త ప్లేస్ ఇచ్చేసింది. శతాబ్దాల పాటు మగువల కురుల్లో కొలువున్న ఈ అలంకరణ వస్తువు.. కాస్త లుక్ మార్చుకుని ష్యాషన్ కాస్ట్యూమ్స్‌లోని యువతులకు భుజకీర్తులుగా.. చీరకట్టులో ఉన్న స్త్రీల కొంగు సింగారంగా రూపుదిద్దుకుని నయా పోకడల్లో కనిపిస్తోంది.
కుచ్చుల గంటలు ఒకప్పుడు జడలకు మాత్రమే అలంకారంగా ఉండేవి. నేటి యువతులు వస్త్రధారణలో ఏ ట్రెండ్ ఫాలో అయినా.. కుచ్చుల గంటలను కామన్ యాక్సెసరీస్‌గా కొలుస్తున్నారు. ‘లవ్ హ్యాంగింగ్స్’ పేరుతో కొత్త లుక్ సంతరించుకున్న కుచ్చుల గంటలు రకరకాల మోడల్స్‌లో ఇప్పుడు ఫ్యాషన్ మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మ్యాచింగ్ లవ్ హ్యాంగింగ్స్.. వేసుకున్న కాస్ట్యూమ్‌కు మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి.
ఫ్యాషన్ హ్యాంగింగ్స్
రకరకాల రంగుల్లో ఈ హ్యాంగింగ్స్ దొరుకుతున్నాయి. పెరల్స్, స్టోన్స్, కుందన్, నేచురల్ స్టోన్స్, బీడ్‌స ఇలా స్పెషల్ ఫినిషింగ్‌తో లవ్ హ్యాంగింగ్స్‌ను స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. జాకెట్ వెనుక డోరీలకు, డ్రెస్‌లకు, చీరల కొంగులకు వీటిని సెట్ చేసుకోవచ్చు. క్రి యేటివ్ ఫ్యాషన్ లవర్స్.. సాదాసీదా చీరకు కొంగు చివర్లో గుత్తులుగా కాంట్రాస్ట్ కలర్ కుచ్చులను ఫిక్స్ చేసి డిజైనరీ చీరగా మార్చేస్తున్నారు. వస్త్రాలకే కాదు.. యాక్సెసరీస్‌కూ లవ్ హ్యాంగింగ్స్ రిచ్ లుక్ తీసుకొస్తున్నాయి. మహిళలు ఇష్టంగా వేసుకునే గాజులకు, హ్యాండ్‌బ్యాగ్ జిప్‌లకు కూడా అతికినట్టు సరిపోతున్నాయి. ఈ కుచ్చులు బ్యాంగిల్ స్టోర్స్‌లో, డిజైనర్ మెటీరియల్ సేల్ సెంటర్స్‌లో దొరుకుతున్నాయి.
- శిరీష చల్లపల్లి