స్వీట్ సిటీ..
ఇది బెంగాలీల మాట
మినీ భారత్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌తో బెంగాలీలు వందల ఏళ్ల నుంచి అనుబంధం కొనసాగిస్తున్నారు. ఇక్కడ తెలుగు వాళ్లు, బెంగాలీలు అనే తేడాలు ఏమీ లేవు, అందరూ ఇండియన్స్ అనే ఫీలింగ్ మాత్రమే. హైదరాబాదీలు చాలా స్నేహంగా వుంటారు. పొగరు, తలబిరుసుతనం ఇక్కడి వాళ్లలో కనిపించదు. ఇది స్వీట్ సిటీ అని బెంగాలీలు మనస్ఫూర్తిగా చెబుతున్నారు.
భాగ్యనగరంతో బెంగాలీల అనుబంధం ఈనాటిది కాదు. నిజాం జమానాలోనే పలువురు బెంగాలీలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. తెలుగింటి కోడలైన సరోజినీ నాయుడు బెంగాలీనే. ఆమె తండ్రి అఘోరనాథ ఛటోపాధ్యాయ శాస్త్రవేత్త. ఇక్కడ నిజాం కాలేజీని స్థాపించింది ఆయనే. అప్పట్లో ఈస్టిండియా కంపెనీలో, సైన్యంలో, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే పలువురు బెంగాలీలు బదిలీలపై ఇక్కడకు వచ్చారు. వారిలో చాలామంది ఇక్కడే స్థిరపడి, హైదరాబాదీలతో మమేకమైపోయారు. మొదట్లో ఎక్కువ మంది హిమాయత్‌నగర్, దోమల్‌గూడ ప్రాంతాల్లో ఉండేవారు.
అప్పట్లో వచ్చిన రైల్వే ఉద్యోగులు చాలామంది తార్నాక వైపు ఉంటున్నారు. ఇక హైదర్‌గూడ, సోమాజిగూడ, అమీర్‌పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా బెంగాలీలు గణనీయంగానే ఉంటున్నారు. ‘హైదరాబాదీలు ఎంతో స్నేహంగా ఉంటారు. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పొగరు, తలబిరుసుతనం ఇక్కడి వాళ్లలో కనిపించదు’ అని చాలాకాలంగా ఇక్కడే స్థిరపడ్డ బెంగాలీలు మనస్ఫూర్తిగా చెబుతున్నారు. బెంగాలీలకు, తెలుగు వారికి సాహితీ సంబంధాలు చిరకాలంగా ఉన్న సంగతి తెలిసిందే. రవీంద్రనాథ్ టాగోర్, బంకించంద్ర ఛటర్జీ, శరత్‌చంద్ర ఛటర్జీల రచనలు తెలుగులోకి విరివిగా అనువాదమయ్యాయి.
తీపి లేనిదే తినలేరు...
దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నా, బెంగాలీల ఆహారపు అలవాట్లు మాత్రం పెద్దగా మారలేదు. ఇప్పటికీ వారు తమ సంప్రదాయ వంటకాలనే ఇష్టపడతారు. బెంగాలీలు తమ వంటల్లో చింతపండును దాదాపు వాడనే వాడరు. తీపికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. రసగుల్లా, సందేశ్ వంటి బెంగాలీ స్వీట్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంగతి తెలిసిందే. తెలుగువారి మాదిరిగా స్పైసీఫుడ్‌ను వీరు తినరు. కూరల్లో సైతం కాస్తంత పంచదార లేదా బెల్లం వేసి వండుకునే అలవాటు వారిది. పప్పుల్లో ఐదారు రకాలు వండుతారు. మాంసాహారంలో ముఖ్యంగా చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. బెంగాలీలు నాన్‌వెజ్ ఎంతగా తిన్నా, కూరగాయలనూ అదే మోతాదులో తింటారని యాభయ్యేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న సంఘమిత్ర అన్నారు.
సంప్రదాయబద్ధంగా..
పండుగలను, వేడుకలను బెంగాలీలు అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. వినాయక చవితి, దసరా నవరాత్రులు, దీపావళి, బసంత్ పంచమి, జన్మాష్టమి వీరికి ముఖ్యమైన పండుగలు. ఏప్రిల్‌లో వచ్చే మేష సంక్రాంతి బెంగాలీలకు సంవత్సరాది. రాఖీ పండుగకు బదులు సోదరుల కోసం భాయిదూజ్ పండుగను జరుపుకుంటారు. పండుగలలో వీరు కేవలం మట్టి విగ్రహాలనే పూజిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఏమాత్రం వాడరు. పండుగ సమయాల్లో మగవారు ధోవతీ, కుర్తా ధరిస్తారు. చిన్నపిల్లలు సైతం ఇవే దుస్తులు ధరిస్తారు. బెంగాలీల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది. విద్యార్థి దశలోనే సంగీతం, చిత్రకళ వంటివి నేర్చుకుంటారు.
కట్నాల ప్రసక్తి లేని పెళ్లిళ్లు...
బెంగాలీల పెళ్లిళ్లు రాత్రిపూట జరుగుతాయి. పెళ్లి తర్వాత మూడో రోజు వరుడి ఇంట జరిగే విందులో పెళ్లికూతురు స్వయంగా వడ్డన చేస్తుంది. ఐదారు కిలోల చేపలు, చీర, జాకెట్, పసుపు వరుడి ఇంటి నుంచి వధువు ఇంటికి పంపడం ఆనవాయితీ. వాటిని కళాత్మకంగా అలంకరించి మరీ పంపుతారు. అలాగే వరుడి ఇంటికి వధువు తరఫు వారు కూడా కానుకలు పంపుతారు. వీరి పెళ్లిళ్లలో కట్నాల ప్రసక్తి లేకపోవడం విశేషం.
ఏడు దశాబ్దాల బెంగాలీ సమితి
హైదరాబాద్‌లో బెంగాలీ సమితి ఏడు దశాబ్దాల కిందటే ఏర్పడింది. ఇది 1942లో రిజిస్టర్ అయింది. అయితే, అంతకు ముందు నుంచే ఇక్కడ ఉంటున్న బెంగాలీలు కలసికట్టుగా పండుగలు, వేడుకలు జరుపుకుంటూ వచ్చేవారు. 1950ల నుంచి ఇక్కడ బెంగాలీల దుర్గాపూజ మహోత్సవాలు మొదలయ్యాయి. మా నాన్న 1951లో ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత చాలామంది బెంగాలీలు ఉద్యోగరీత్యా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఇది స్వీట్ సిటీ.
- సుమీత్ సేన్, జనరల్ సెక్రటరీ, బెంగాలీ సమితి