భానుప్రియ
ముందుతరం సినీ హీరోయిన్ భానుప్రియ అనగానే ఆమె విశాల నేత్రాలు, రూపలావణ్యం, అభినయం, ఆమె నాట్యం, వంశీ కాంబినేషన్.. ఒకటి వెంట ఒకటి వరుసగా గుర్తుకు వస్తాయి. డ్యాన్స్లో మెగాస్టార్ చిరంజీవి ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. అటువంటి చిరంజీవికి సమఉజ్జీగా నాట్యం చేసి మెప్పించారు. 1967 జనవరి 15న భానుప్రియ జన్మించారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. అభినేత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆమె. తన అభినయంతో తెలుగువారిని పులకింపచేసింది. అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, వివిధ పాత్రల్లో తనదైన బాణీ పలికించింది. 1980-1993 మధ్య కాలంలో హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగువెలిగారు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యంలో ఆమెలో ఉంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించారు.
'సితార' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ, దర్శకుడు వంశీ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. వంశీ, భానుప్రియ కాంబినేషన్ సినిమాలను అత్యధికమంది ఇష్టపడేవారు. వారి కాంబినేషన్లో సంగీత, నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. నటిగా, నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీ పలికించిన భానుప్రియ నాటి అగ్రహీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని తారగా నిలిచారు. చిరంజీవి స్టార్ హీరోగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు. చిరంజీవి అంటే అప్పట్లో స్పీడ్ డాన్సులకు పెట్టింది పేరు. భానుప్రియ ఆయనతో సమవుజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. వారిద్దకి కాంబినేషన్ అదుర్స్. చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలసి డాన్స్ చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు.
నందమూరి బాలకృష్ణ విజయవిహారం చేస్తున్న సమయంలోనే భానుప్రియ కూడా తెలుగునాట అడుగు పెట్టారు. బాలకృష్ణ, భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. బాలకృష్ణ సొంత చిత్రాల్లో భానుప్రియ నాయికగా జయకేతనం ఎగురవేయడం విశేషం. మరో టాప్ హీరో వెంకటేశ్‌తోనూ భానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు విజయవంతమయ్యాయి. వారిద్దరూ జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి. తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు. అయితే అక్కడ ఆమె అంతగా రాణించలేక పోయారు. 'ఖుద్‌గర్జ్, ఇన్సాఫ్ కీ పుకార్, మార్ మిటేంగే" వంటి హిందీ చిత్రాల్లో భానుప్రియ నటించారు.
భరత నాట్య కళాకారిణి సుమతీ కౌషల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌషల్ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది. కారణాలు ఏవైనా భార్యాభర్తలు విడిపోయారు. ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, భరతనాట్యం శిక్షణ, ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు. తగిన పాత్ర లభించినప్పుడు టివి సీరియల్స్, సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. భానుప్రియకు పుట్టిరోజు శుభాకాంక్షలు.
భానుప్రియ నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలు: సితార - రౌడీ - రామాయణంలో భాగవతం - ప్రేమించు-పెళ్లాడు - మొగుడూపెళ్లాలు - ఇల్లాలికో పరీక్ష - అన్వేషణ - చిరంజీవి - జ్వాల - పల్నాటి పులి - విజేత - అపూర్వ సహోదరులు - ఆలాపన - దొంగమొగుడు- చక్రవర్తి - జేబుదొంగ - స్వర్ణకమలం - ఖైదీ నంబర్ 786 - త్రినేత్రుడు - బ్లాక్ టైగర్ - స్టేట్ రౌడీ - ఏడుకొండలస్వామి - పెదరాయుడు - మామా బాగున్నావా? - అన్నమయ్య - ఛత్రపతి - గౌతమ్ ఎస్.ఎస్.సి.- అమెరికా అల్లుడు- పెదరాయుడు.
s.nagarjuna@sakshi.com