గోల్డెన్ వాయిస్
పల్లె జానపదాలు.. అలనాటి ఆణిముత్యాలు.. ప్రజెంట్ మెలొడీస్... శుక్రవారం వెస్లీ కళాశాల భిన్నమైన పాటల సంద్రమైంది. బిగ్ ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో జరిగిన ‘బిగ్ గోల్డెన్ వాయిస్ సీజన్-2’ ఫైనల్‌లో ఆరుగురు గాయకులు తవు సత్తా చాటారు. వరంగల్‌కు చెందిన సుహిత విజేతగా నిలిచింది. ప్రముఖ గాయని సునీత న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. బిగ్ ఎఫ్‌ఎం దేశవ్యాప్తంగా 44 రేడియో స్టేషన్లలో నిర్వహించిన ఈ పోటీల్లో 37 మంది విజేతల్ని ఎంపిక చేసింది. ముంబాయిలో జరిగే ఫైనల్స్‌లో పాల్గొనే 37 మందిలో సుహిత ఒకరు. ఇక అందులో గెలుపొందినవారికి బాలీవుడ్‌లో సింగర్‌గా అవకాశం దక్కుతుంది.
‘గాయకులుగా నిలదొక్కుకోవాలనే ఔత్సాహికులకు ఇది మంచి అవకాశం. ముంబైలో హైదరాబాద్ సత్తాను చాటి బాలీవుడ్‌లోనూ అవకాశం దక్కించుకోవాలని కోరుకుంటున్నా. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి, మనసుకు సంగీతం ఎంతో హాయినిస్తుంది. అదే సంగీతం గొప్పదనం. అలాంటి సంగీతాన్ని పదికాలాలపాటు బతికించేందుకు బిగ్ ఎఫ్‌ఎం చేస్తున్న కృషి అభినందనీయం’ అని సునీత అన్నారు.
- దార్ల వెంకటేశ్వరరావు