ఇప్పటికీ తెలుగోళ్లు మదరాసీలేనా?
ఇంతకీ తెలుగు ప్రజలు తెలుగువారేనా? లేకుంటే ఇంకా మదరాసీలుగానే చెలామణీ కావాలా? కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం...ఓట్లు..సీట్ల లాభాల కోసం.. ఆదరా బాదరాగా రూపొందించి... ఆగమేఘాల మీద రాష్ట్రానికి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో మన రాష్ట్రాన్ని తమిళనాడుగానే పేర్కొన్నారు. ఈ తప్పిదం ఉద్దేశ పూర్వకం కాకపోవచ్చుకానీ...తెలంగాణా ముసాయిదా బిల్లు ఎంత అనాలోచితంగా... కంగాళీగా రూపొందించారో మాత్రం ఈ ఒక్క ఉదాహరణే చాటి చెబుతోంది.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత కూడా దశాబ్దాల పాటు తెలుగు వాళ్లను మదరాసీలనే ఉత్తరాదిలో పిలిచేవారు. నందమూరి తారకరామారావు తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి...రికార్డు స్థాయిలో అధికారంలోకి వచ్చాకనే దేశ వ్యాప్తంగా తెలుగువారికి గౌరవం పెరిగింది. తెలగు రాష్ట్రం ఒకటుందని తెలిసొచ్చింది. ఇక కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర విభజన ప్రక్రియను ఎంత ఆదరా బాదరాగా..ఎంత అడ్డగోలుగా చేసుకుపోతోందో... ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును చూస్తే అర్ధమైపోతుంది.
తెలంగాణా ముసాయిదా బిల్లులోని 36,37 పేజీల్లో ఆంధ్రప్రదేశ్ బదులు తమిళనాడు అని ప్రచురించారు. అంటే మన రాష్ట్రాన్ని చీల్చేసే కుట్రలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న కేంద్ర మంత్రి చిదంబరం దగ్గరుండి ఈ బిల్లును తయారు చేయించారని అనుకోవచ్చా? తమిళుడైన చిదంబరం మనసులో తమిళనాడే మెదులుతూ ఉంటుంది కాబట్టే ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోనూ తమిళనాడు జపమే చేశారనుకోవాలా? సవాలక్ష అక్రమాలు, అవకతవకలకు కేంద్రంగా ఉన్నారంటూ ఇన్నాళ్లూ కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చారనే ఆరోపణలున్నాయి.
విషయం ఏంటంటే ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని చీల్చాలని మొండి పట్టుదలతో ముందుకు పోతోన్న కాంగ్రెస్ విభజన విషయంలో ఎలాంటి కసరత్తులూ చేయలేదనడానికి ఈ అచ్చుతప్పులే నిలువెత్తు నిదర్శనమని మేధావులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం కలిసుండగానే ఆంధ్రప్రదేశ్పై ఇంత చిన్న చూపు అయితే...ఇక కాంగ్రెస్ నిరంకుశంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చునని సమైక్య వాదులు హెచ్చరిస్తున్నారు.