పొత్తుల కోసం చంద్రబాబు పాట్లు | Chandrababu Try to Alliance | Sakshi
Sakshi News home page

పొత్తుల కోసం చంద్రబాబు పాట్లు

Published Wed, Aug 14 2013 5:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

చంద్రబాబు - Sakshi

చంద్రబాబు

రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే కాదు, దేశంలో కూడా వచ్చే ఎన్నికల్లో మూడవ కూటమిదే అధికారమని, చక్రం తిప్పేది కూడా తానేనని ఇప్పటివరకు చంద్రబాబు కలలు కన్నారు.

ఆయనకు అధికాం లేకపోయినా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పకపోయినా  నిద్రపట్టదు. ఆయన ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. అయినా ఆయన అధికారంలోకి రావడానికి పడరాని పాట్లు పడుతున్నారు. మళ్లీ అధికారంలోకి రాలేనని తెలిసినా, అధికారంలోకి రాగానే తొలి సంతకం పలానా దానిపై పెడతానాని చెప్పడం మాత్రం మానరు. అధికారంపై ఆయనకు అంత ఆశ. 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఎమ్మెల్యేలను పశువులతో పోల్చడానికి కూడా వెనుకాడరు.  మహానుభావుడు ఎన్టీఆర్ను దెబ్బతీసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అని మీకు ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.

 రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే కాదు, దేశంలో కూడా వచ్చే ఎన్నికల్లో  మూడవ కూటమిదే అధికారమని, చక్రం తిప్పేది కూడా తానేనని ఇప్పటివరకు ఆయన కలలు కన్నారు.  ఇప్పుడు చంద్రబాబుకు  అసలు విషయం బోధపడినట్లుంది.  తానేది చెప్పినా జనం నమ్మరని ఒక నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు.  మిత్రులు లేనిదే వచ్చే ఎన్నికల్లో  గట్టెక్కలేనని గట్టి నమ్మకానికి వచ్చేశారు.  అందుకే బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపధ్యంలో చంద్రబాబు పథకం ప్రకారం పావులు కదులుతున్నాయి. నాడు మతతత్వ పార్టీ అని దూరంగా పెట్టిన బీజేపీకి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  చంద్రబాబు పథకంలో భాగంగానే బావమర్థి బాలయ్య, నమ్మిన బంటు మురళీమోహన్‌ మొన్న హైదరాబాద్‌ వచ్చిన బిజెపి ప్రచార సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి  నరేంద్ర మోడీని కలిసినట్టు స్పష్టమవుతోంది.  సినీ పరిశ్రమ తరపున వీళ్లిద్దరూ నరేంద్ర మోడీని కలిసినా, అసలు ఉద్దేశం వేరే ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పథకంలో భాగంగానే మోడీ నోటి నుంచి ఎన్టీఆర్‌ పేరు వచ్చినట్టు తెలుస్తోంది. తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ను నరేంద్ర మోడీ ఆకాశానికి ఎత్తారు. కేంద్రంలో  కాంగ్రెస్సేతర పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ప్రధాన కారణం ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు.  

1999లో చంద్రబాబు బీజేపీతో దోస్తీ చేశారు. నాటి ఆ మైత్రీ బంధం  బాగా కలిసొచ్చింది. అప్పటి వరకు రాష్ట్రంలో చిన్న పార్టీగా  ఉన్న బీజేపీ, పొత్తు కారణంగా నాటి ఎన్నికల్లో  ఏకంగా ఏడు స్థానాల్లో విజయం సాధించింది.  అంతకు ముందుగాని, ఆ తర్వాతగాని బీజేపీ ఆ స్థాయిలో రాష్ట్రంలో గెలిచిన దాఖలాలు  ఇప్పటి వరకూ లేవు. 1999 నుంచి 2004 వరకు 30 మంది ఎంపీలతో టీడీపీ కేంద్రంలో ఎన్డిఏ  ప్రభుత్వంలో చక్రం తిప్పింది. ఆ కూటమికి చంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా కూడా వ్యవహరించారు. గోధ్రా ఘటనల తర్వాత మైనార్టీ ఓటర్లు దూరమవుతారనే భయంతో,  2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో దోస్తి కట్ చేశారు.  నాటి నుంచి ఆ పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. మారిన రాజకీయ పరిణామాలలో ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కీలక మిత్రుడవసరమని భావిస్తున్న చంద్రబాబు మనస్సు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఏ మోడీ కారణంగానైతే బీజేపీకి దూరమయ్యారో,  ఇప్పుడు అదే  మోడీతో జట్టు కట్టేందుకు తహతహలాడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని వస్తున్న ఎన్నికల సర్వేలు,  దేశ యువతంతా  మోడీ మ్యాజిక్‌కు దాసోహమంటోందని వస్తున్న కథనాలు చంద్రబాబును పునరాలోచనలో పడేసినట్టు కనిపిస్తోంది.  మోడీపై ఉన్న మోజు ద్వారా  రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలో చంద్రాబబు ఉన్నట్లు అర్ధమవుతోంది.  

 1999లో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని కేంద్రం ద్వారా అన్ని పనులు చేసుకున్న చంద్రబాబు రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. 1999 ఎన్నికల్లో  12 మంది బీజేపీ తరపున గెలిస్తే, 2004 వచ్చేసరికి ఆ సంఖ్య రెండుకు పడిపోయింది.  ఏ ఇజాలు లేవు ఉండేది టూరిజమేనని కమ్యూనిస్టులను ఎగతాళి చేసిన చంద్రబాబు 2009లో మహాకూటమి పేరుతో  వారితో పొత్తు పెట్టుకొని  దెబ్బకొట్టారు.

2004లో పోయిన అదృష్టం 2009లో వస్తుందనుకున్న చంద్రబాబు ఆశలు అడియాసలే అయ్యాయి.  ఇక ఇప్పటి పరిస్థితి చూస్తే మరీ ఆధ్వాన్నంగా ఉంది. టిడిపి నుంచి 13 మంది ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేతలు అనేక మంది  వెళ్లిపోయారు.  దాంతో పార్టీలో కార్యకర్తలు కూడా పలచబడిపోయారు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల్లో  టీడీపీ సొంతంగా గెలవలేదన్న విషయం బాబుకు తెలుసు. దాంతో పొత్తుల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  చంద్రబాబు  వల్లే తాము బలహీనపడ్డామని ఆగ్రహంతో ఉన్న పార్టీలు మరి ఇప్పుడు  ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. అయితే రాజకీయాలలో ఎవరైనా కలవడానికి అవకాశం ఉందనేది మాత్రం జగమెరిగిన సత్యం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement