
అమ్మో చంద్రబాబుతో పొత్తా?!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టిమరల్చడంతో రాష్ట్ర బిజెపిలో కలకలం మొదలైంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టిమరల్చడంతో రాష్ట్ర బిజెపిలో కలకలం మొదలైంది. ఆయన వ్యవహార శైలి ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. రాష్ట్రంలో పనైపోయిందని తెలుసుకున్న చంద్రబాబు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న యోచనలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నికల్లో పొత్తుల అంశంపై కూడా ఆయన దృష్టి సారించారు. వివిధ పార్టీల జాతీయ నాయకులతో మంతనాలు జరిపారు. గతంలో బిజెపియేతర, కాంగ్రేసేతర పార్టీలతో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడుతుందని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం మూడవ కూటమి మాటెత్తడం లేదు. బిజెపితో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈరోజు న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశమయ్యారు. వారు కొద్దిసేపు రహస్యంగా మాట్లాడుకున్నారు.
చంద్రబాబు బిజెపితో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి తెంగాణలోని బిజెపి నేతలు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. టిడిపితో పొత్తుకు వారు ససేమిరా అంటున్నారు. తెలంగాణను అడ్డుకుంది తానేనని చంద్రబాబు నాయుడు స్వయంగా ఒప్పుకున్నారని, అలాంటి వ్యక్తితో పొత్తేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ విషయంలో ఇన్నాళ్లు పడ్డ కష్టం ఆయనతో పొత్తు పెట్టుకుంటే గంగలో కలిసిపోతుందని వారు అంటున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకున్నందు వల్ల బిజెపి ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అలా చేస్తే టిడిపి లాభపడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ పొత్తు విషయంలో వెంకయ్యనాయుడు సహకరిస్తున్నారని తెలిసి ఆయనపై కూడా వారు మండిపడుతున్నారు.
అయితే సీమాంధ్రలోని బిజెపి నేతలు మాత్రం టిడిపితో పొత్తుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సీమాంధ్రలో బిజెపికి పెద్దగా బలంలేదు. ఈ పరిస్థితులలో టిడిపితో పొత్తుపెట్టుకుంటే అటు నరేంద్ర మోడీ పేరుతో కొంత, టిడిపికి స్థానికంగా ఉన్న బలంతో కొంత పుంచుకోవచ్చన ఆలోచనతో ఉన్నారు. బిజెపికి తెలంగాణలో ఇప్పటికే కొంత బలం ఉంది. తెలంగాణ ఉద్యమంతో ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో తెలంగాణకు అడ్డుపడినటువంటి చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటే నష్టం జరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. పొత్తుకోసం సీమాంధ్ర నేతలు ఆసక్తి చూపుతున్న నేపధ్యంలో తెలంగాణ బిజెపి నేతలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాగం జనార్ధన రెడ్డి వారిలో కదలిక వచ్చింది. వారు పొత్తును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ రోజు సీమాంధ్రకు చెందిన 50 మంది బిజెపి ప్రతినిధి బృందం ఢిల్లీలో ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ, రాజ్నాధ్ సింగ్, వెంకయ్య నాయుడు, అరుణ్జెట్లీ తదితరులను కలిశారు. రాష్ట్రం విభజిస్తే హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర ప్రజలకు భాగం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, అటువంటి నగరంలో వచ్చే అవకాశాలు దక్కకుండా పోతాయన్న అనుమానాలు సీమాంధ్ర ప్రజలలో నెలకొన్నట్లు వారు తెలిపారు. నదీ జలాల పంపకంలో తలెత్తే ఇబ్బందులను వివరించారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, రాష్ట్ర విభజన అంశాన్ని అంతర్గత వ్యవహారంగా భావిస్తోందని చెప్పారు.
చంద్రబాబు మాటలనే సీమాంధ్ర బిజెపి నేతలు వల్లెవేస్తున్నట్లుగా తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ బిజెపి నేత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నేతలు టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.కుమార్ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో చంద్రబాబుకు స్పష్టతలేకపోవడంతో టిడిపితో పొత్తుకు కార్యకర్తలు ఎవరూ ఉత్సాహంగా లేరని తెలిపారు. టిడిపి మునిగిపోయే పడవని చెప్పారు. తెలంగాణలో చాలా కాలంగా బిజెపి బలపడుతోందన్నారు. ఈ పరిస్థితులలో టిడిపితో పొత్తుపెట్టుకుంటే బిజెపికే నష్టం అని ఆ పార్టీ నేతలు తెగేసి చెబుతున్నారు.