
పండగంటే పండగే!
ఆహా ఏమి రుచి! వేఫర్ బిస్కెట్, చెర్రీస్, లాలీపాప్, పిప్పరమెంట్... ఇలా పిల్లలకు నచ్చే వాటితో తయారు చేసిన అందమైన చర్చ్ ఇది. పిల్లలను ఇట్టే ఆకట్టుకునే ఈ చర్చిలో శాంతాక్లాజ్ బహుమానాలు ఇచ్చే వస్తువులు... చాక్‌లెట్స్, బెల్స్, క్యాండీస్, ఆల్‌మండ్స్, కిస్‌మిస్... ఇలా నోరూరేవి ఎన్నో ఈ చర్చిలో అలంకృతమై ఉంటాయి. ఈ స్వీట్ చర్చ్ పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని పిల్లలు తినవచ్చు. ఆత్మీయులకు క్రిస్మస్ కానుకగా ఇవ్వొచ్చు.
క్రిస్మస్ బొకే
సాధారణంగా దొరికే బొకేలలో గులాబీలతో పాటు రకరకాల పువ్వులను మాత్రమే చూస్తుంటాం. ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ బొకేలో మాత్రం... ప్లాస్టిక్ చెట్టుకు వివిధ రకాల చాక్లెట్లు, బిస్కెట్లతో అలంకరించిన స్టార్లు, బౌ, బెల్స్, శాంతాక్లాజ్‌తో చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. పండగ ముగియగానే.. మన ఇంట్లో పిల్లలకు తీపి పండగ.
ఆన్‌లైన్‌లో కూడా...
ఆత్మీయులకు, స్నేహితులకు, బంధువులకు విభిన్నమైన క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వీటి కోసం ఎన్నో ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. శాంతాక్లాజ్ రూపంలో ఉన్న పర్‌ఫ్యూమ్ బాటిల్, పెన్‌స్టాండ్, హ్యాండ్ వాష్... ఇలా క్రిస్మస్ పండగ అంటే గుర్తుకు వచ్చే వస్తువులతో గృహాలంకరణ వస్తువులు అందుబాటు ధరల్లో ఉన్నాయి. వీటికి గ్రీటింగ్ కార్డ్ కూడా జత చేసి పంపితే... మీ పండగ సంతోషాన్ని పంచినట్లే.
లిటిల్ ఏంజిల్స్
ఈ డ్రెస్ ధరిస్తే పిల్లలు సాక్షాత్తు దేవదూతల్లా కనిపిస్తారు. ప్రత్యేకంగా క్రిస్మస్‌ను దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేశారు. సెట్‌గా లభించే ఈ డ్రెస్‌లో... కుచ్చుల ఫ్రాక్, ఫెయిరీ వింగ్స్, హెడ్ వెయిల్, మ్యాజిక్ వాండ్, హెయిర్ బాండ్...మొదలైనవి ఉంటాయి. వైట్, పింక్ అండ్ రెడ్ కలర్స్‌లో లభించే ఈ డ్రెస్ పిల్లలకు వేస్తే... పండగ కళ రెట్టింపుగా ఉట్టిపడుతుంది.