అద్భుతం.. అద్వైతం.. అతీంద్రియం..
అద్భుతం... అమోఘం... అపూర్వం... అంటారు కదా! ఇదేంటిలా అనుకుంటున్నారా? భాగ్యనగరి కళాకారులు ప్రదర్శిస్తున్న వైవిధ్యాన్ని తిలకిస్తే, ఎవరైనా ఇలాగే అనక తప్పదు. హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలన్నీ వరుస ప్రదర్శనలతో ఖాళీ లేకుండా కళకళలాడుతున్నాయి. ప్రత్యేకించి ఫలానా అనే కళా ధోరణి ఏదీ ప్రస్ఫుటంగా రాజ్యమేలుతున్న కాలం కాదిది. అయినా, హైదరాబాదీ కళాకారులు తమ ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. పెయింటింగ్‌పై సంతకాన్ని కాకుండా, అందులోని వైవిధ్యాన్ని వెదికి పట్టుకునే బయ్యర్ల ప్రోత్సాహం కూడా బాగానే ఉంటోంది. ఎవరి శైలిలో వారు విలక్షణంగా కృషి చేస్తున్న ఇద్దరు చిత్రకారుల గురించి ప్రత్యేక కథనం...
ఆధ్యాత్మికతే ఆయన కళకు ఆలంబన. సునిశితమైన రేఖా విన్యాసం, వర్ణలేపన నైపుణ్యం ఆయన సొంతం. భారీసైజులో ఆయన రూపొందించిన అనంత పద్మనాభుడి చిత్రం చూపరులను కట్టి పడేస్తుంది. ‘శివాయ విష్ణురూపాయ’ పేరిట ఇటీవల ‘బియాండ్ కాఫీ’లో ఎ.శ్రీకాంత్‌బాబు ప్రదర్శించిన చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ ప్రదర్శన తిలకించిన దర్శకుడు రాజమౌళి ఒక చిత్రాన్ని కొనుక్కున్నారు. నేతకారుల కుటుంబానికి చెందిన ఆయన శివకేశవ రూపాల చిత్రణలో అద్వైతాన్నే అవలంబించారు. ఎక్కువగా ఆక్రిలిక్ రంగులు, కొన్నింటిలో మిక్స్‌డ్ మీడియా టెక్నిక్‌ను ఎంచుకున్నారు. కలంకారీ వంటి సంప్రదాయ శైలుల నుంచి ప్రేరణ పొందిన శ్రీకాంత్ ‘సిటీప్లస్’తో ముచ్చటించారు.
ఇక్కడా ‘చిత్రసంతె’ జరగాలి
నారాయణగూడ కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో చదువుకుంటున్న కాలంలో అక్కడ నరేంద్రనాథ్‌రాయ్ వద్ద, తర్వాత గంగాధర్ వద్ద చిత్రకళ నేర్చుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక మల్టీమీడియా డిప్లొమా చేశా. 2006 నుంచి ప్రదర్శనలు ఇస్తున్నా. శిల్పారామంలో 2009లో జరిగిన ప్రదర్శన నుంచి నా పెయింటింగ్స్ అమ్ముడవడం మొదలైంది. బెంగళూరులో ఏటా దేశం నలుమూలల నుంచి చిత్రకారులు ఒకచోటకు చేరుతారు. ఈ ‘చిత్రసంతె’ వంటిది హైదరాబాద్‌లోనూ జరగాలి.
ఆయన చిత్రాల్లో వర్ణతరంగాలు కనిపిస్తాయి. కొన్ని ఎగసిపడుతున్నట్లు ఉంటాయి. మరికొన్ని నిశ్చల నిశ్శబ్దంగా ఉంటాయి. కొన్ని అమూర్తంగా, మరికొన్ని మూర్తామూర్తంగానూ ఉంటాయి. అర్థమైనట్లే ఉంటాయి, అలాగే అర్థంకానట్లు కూడా... ఇదంతా ట్రాన్సెండ్ ఆర్ట్ (అతీంద్రియ కళ). కళ ఇంద్రియానుభవం మాత్రమే కాదు. ఇంద్రియాలకు అతీతమైన అనుభూతుల వ్యక్తీకరణ కూడా. ఈ కళలో అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంటున్నారు రమాకాంత్ తుమ్రుగోటి. ఈ ఏడాది విదేశాల్లో ఆయన నాలుగు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సామాజిక సమస్యలే తన కళాంశం అని చెబుతున్న రమాకాంత్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
వివరణతో వీక్షకులకు చేరువ
మార్మికంగా ఉండే ‘ట్రాన్సెండ్’ చిత్రాలు వీక్షకులకు మేధాపరంగా లేదా భావోద్వేగపరంగా కనెక్ట్ కావాలంటే, వాటికి కొంత వివరణ జోడించాలి. ఇదే శైలిలో వివిధ దేశాల్లో ఇప్పటికే పలు ప్రదర్శనలు నిర్వహించాను. ఈ ఏడాది నా ప్రదర్శనలు దుబాయి, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్‌లలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తవుతాయి.